10 years తర్వాత పాపం పండింది...
ABN , First Publish Date - 2021-11-26T17:43:16+05:30 IST
పేలుళ్లకు పాల్పడి అమాయకులను బలిగొన్న దుర్మార్గులకు పదేళ్ల తర్వాత శిక్ష పడింది. సంచలనలనం రేపిన బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వద్ద బాంబుపేలుళ్ళ కేసులో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్షను

- చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసులో ఇద్దరికి యావజ్జీవం
బెంగళూరు: పేలుళ్లకు పాల్పడి అమాయకులను బలిగొన్న దుర్మార్గులకు పదేళ్ల తర్వాత శిక్ష పడింది. సంచలనలనం రేపిన బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వద్ద బాంబుపేలుళ్ళ కేసులో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. చిన్నస్వామి స్టేడియం వద్ద 2010లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న వేళ బాంబుపేలుళ్ళకు కారకులైన అహమ్మద్ జమాల్, అఫ్తాబ్ ఆలమ్ అలియాస్ ఫారూక్లను నేషనల్ ఇనిస్టేగేషన్ ఏజెన్సీ అధికారులు అప్పట్లో అరెస్టు చేశారు. సుధీర్ఘ విచారణ అనంతరం గురువారం ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కసనప్ప నాయ్కతుది తీర్పును ప్రకటించింది. బాంబు పేలుళ్లకు సంబంధించి ఇద్దరికి ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి విచారణ జరిపిన వేళ తప్పును అంగీకరించారు. ఎన్ఐఏ కోర్టు ముందు కూడా బాంబుపేలుళ్ళకు పాల్పడినట్లు ఒప్పుకున్న విషయం అప్పట్లో సంచలనం అయ్యింది. గతంలో ఇదే కేసులో కోర్టు ఇరువురికి 8 ఏళ్ళ జైలుశిక్షతోపాటు నాలుగు లక్షల జరిమానా విధించింది. విచారణాధికారులు హైకోర్టును ఆశ్రయించారు. మరోసారి తీర్పును పరిశీలించాలని హైకోర్టు ధర్మాసనం సూచించిన మేరకు ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును ఖరారు చేశారు. ఇద్దరికి యావజ్జీవకారాగార శిక్షను ఖరారు చేశారు. వీరిద్దరూ సుమారు పదేళ్లుగా జైలులోనే గడుపుతున్నారు.