‘శశికళ విడుదల తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు’
ABN , First Publish Date - 2021-01-12T15:35:54+05:30 IST
అదే సమయంలో దివంగత మాజీ సీఎం జయ సన్నిహితురాలు శశికళ జైలు నుంచి విడుదలవుతున్న సందర్భంగా...

- వన్నియార్లకు 20 శాతం ఇస్తే మాకు అంతే రిజర్వేషన్ ఇవ్వాలి
- ముక్కులత్తోర్ పులిపడై నాయకుడు కరుణాస్ డిమాండ్
చెన్నై : వన్నియార్లకు ఇరవై శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ చేస్తున్న ప్రయత్నాలకు గండి కొట్టేందుకు ముక్కులత్తోర్ పులిపడై నాయకుడు, హాస్యనటుడు కరుణాస్ పావులు కదుపుతున్నారు. వన్నియార్లకు రిజర్వేషన్లు కల్పిస్తే తమ కులస్థులకు కూడా కల్పించాలని అధికార అన్నాడీఎంకే ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో దివంగత మాజీ సీఎం జయ సన్నిహితురాలు శశికళ జైలు నుంచి విడుదలవుతున్న సందర్భంగా ఆమెకు ఘనస్వాగతం పలి కేందుకు కరుణాస్ భారీ సన్నాహాలు చేపడుతున్నారు. తిరుప్పూరులో ముక్కులత్తోర్ పులిపడై నాయకుల సమావేశం కరుణాస్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశం ముగిసిన తర్వాత కరుణాస్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవాలనే అంశంపై సమావేశంలో సమగ్రంగా చర్చించామన్నారు. ఎన్నికల నోటిషికేషన్ జారీ అయిన తర్వాత పొత్తుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ వన్నియార్లకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని, అన్నాడీఎంకే ప్రభుత్వం ఆ డి మాండ్ను అంగీకరిస్తే ముక్కులత్తోర్ కులస్థులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరు తామని చెప్పారు. వన్నియార్ల కంటే ఆర్థికంగా ముక్కులత్తోర్ కులస్థులు వెనకబడి ఉన్నారని ఆయన తెలిపారు. తాము ఏ కులస్థులకు వ్యతిరేకం కాదన్నారు. అయితే ముక్కులత్తోర్ కులస్థులు కూడా రిజర్వేషన్లు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని చెప్పారు.
శశికళకు సాదర స్వాగతం..
మాజీ ముఖ్యమంత్రి జయతోపాటు 27 యేళ్లపాటు ఆమెను వెన్నంటి నీడలా ఉంటూ సుఖదుఃఖాలలో పాలుపంచుకున్న శశికళ జైలు నుంచి విడుదలైన వెంటనే ఆమెకు తమ పార్టీ తరఫున ఘనస్వాగతం పలుకుతామని కరుణాస్ తెలిపారు. 1991 నుంచి 2016 వరకు శశికళ సూచనలు, సలహాల మేరకు జయ కీలకమైన రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారని ఆయన చెప్పారు. తమ పార్టీ జయలలితకు ఇచ్చినట్లే శశికళకు కూడా గౌరవమర్యాదలను ఇస్తుందన్నారు. శశికళ విడుదల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని ఆయన చెప్పారు.
