కోవిడ్ సోకిన వ్యక్తి నుంచి 10 మీటర్ల పరిధిలో గాలితుంపర్ల ప్రయాణం : కేంద్రం

ABN , First Publish Date - 2021-05-20T22:08:58+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి తేలికగా

కోవిడ్ సోకిన వ్యక్తి నుంచి 10 మీటర్ల పరిధిలో గాలితుంపర్ల ప్రయాణం : కేంద్రం

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి తేలికగా పాటించగలిగిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం గురువారం జారీ చేసింది. డబుల్ మాస్క్‌లను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ధారాళంగా గాలి, వెలుతురు ప్రసరించే చోట ఉండాలని తెలిపింది. కోవిడ్-19 సోకిన వ్యక్తి నుంచి 10 మీటర్ల పరిధిలో గాలితుంపర్లు (ఏరోసోల్స్) ప్రయాణిస్తాయని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ కే విజయ్‌రాఘవన్ కార్యాలయం గురువారం ఈ మార్గదర్శకాలను ప్రకటించింది. 


లక్షణాలతో కనిపించనివారు కూడా వ్యాపింపజేయగలరు

గాలి, వెలుతురు బాగా ప్రసరించే చోట ఉండటం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చునని ప్రభుత్వం తెలిపింది. ఎయిర్ కండిషనర్లను వాడటంపై కూడా హెచ్చరించింది. తలుపులు, కిటికీలు మూసివేసి, ఏసీలను వాడటం వల్ల ఈ వైరస్ గల గాలి గదిలోనే స్థిరంగా ఉంటుందని తెలిపింది. దీనివల్ల ఆ వైరస్ ఇతరులకు సోకుతుందని తెలిపింది. ఈ వ్యాధి లక్షణాలతో కనిపించని వ్యక్తులు సైతం దీనిని వ్యాపింపజేయగలరని వివరించింది. కోవిడ్-19 మహమ్మారి నియంత్రణకు తగినవిధంగా నడచుకోవాలని ప్రజలను కోరింది. 


చిన్న తుంపర్లు 10 మీటర్ల పరిధిలో...

ఈ వ్యాధి సోకిన వ్యక్తి నుంచి వచ్చే తుంపర్లు రెండు మీటర్ల పరిధిలో పడతాయని, చిన్న చిన్న తుంపర్లు దాదాపు 10 మీటర్ల పరిధిలో ప్రయాణిస్తాయని తెలిపింది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి నోటి నుంచి వచ్చే లాలాజలం, ముక్కు నుంచి వచ్చే చీమిడి ద్వారా వచ్చే నీటి తుంపర్లు, గాలి తుంపర్లు ఈ మహమ్మారి వ్యాప్తికి ప్రధాన కారణమని తెలిపింది. గాలి, వెలుతురు ప్రసరించే చోట దుర్వాసన తగ్గుతుందని, అదేవిధంగా అలువంటి చోట్ల ఉండే ప్రమాదకరమైన వైరస్ కూడా బయటి నుంచి వచ్చే గాలి వల్ల తగ్గుతుందని తెలిపింది. 


తరచూ శుభ్రపరచాలి

ఈ వ్యాధి సోకిన వ్యక్తి నుంచి వచ్చే తుంపర్ల నుంచి కాపాడుకోవడానికి తలుపు గడియలు, లైట్ స్విచ్‌లు, టేబుల్స్, కుర్చీలు, నేల వంటివాటిని తరచూ బ్లీచింగ్, ఫినాయిల్ వంటివాటితో శుభ్రపరచాలని తెలిపింది. డబుల్ లేయర్ మాస్క్ లేదా ఎన్95 మాస్క్ ధరించాలని పేర్కొంది. మొదట సర్జికల్ మాస్క్‌ను ధరించి, ఆ తర్వాత వస్త్రంతో తయారు చేసిన బిగుతుగా ఉండే  మాస్క్‌ను ధరించాలని వివరించింది. సర్జికల్ మాస్క్ లేనివారు నూలు గుడ్డతో తయారు చేసిన రెండు మాస్క్‌లను ధరించవచ్చునని వివరించింది. సర్జికల్ మాస్క్‌ను ఒకసారి మాత్రమే ఉపయోగించి, పారేయాలని తెలిపింది. అయితే ఒకసారి వాడినదానిని మళ్ళీ మళ్ళీ వాడాలంటే, దానిని ఏడు రోజులపాటు పొడి ప్రదేశంలో ఉంచాలని, సూర్య రశ్మి తగిలే చోట ఉంచడం శ్రేయస్కరమని, ఆ విధంగా చేసిన తర్వాత మరొకసారి ధరించవచ్చునని తెలిపింది. ఈ పద్ధతిలో మొత్తం ఐదుసార్లు వరకు సర్జికల్ మాస్క్‌ను నూలు గుడ్డతో తయారు చేసిన మాస్క్‌తో కలిపి డబుల్ లేయర్ మాస్క్‌గా వాడవచ్చునని తెలిపింది. 


బయటి గాలి గదిలోకి వస్తే...

కిటికీలు, తలుపులు మూసి ఉన్న గదిలో దుర్వాసన రావడం మనం గమనిస్తామని, అటువంటి గదిలోని తలుపులు, కిటికీలను తెరిచిన తర్వాత ఆ దుర్వాసన పోవడం మనకు తెలుసునని తెలిపింది. ఇదేవిధంగా గదిలోని ప్రమాదకరమైన వైరస్ బయటికి పోవాలంటే, తలుపులు, కిటికీలను బార్లా తెరిచి ఉంచాలని, బయటి నుంచి గాలి రావడం వల్ల గదిలోని ప్రమాదకరమైన వైరస్ బయటికి పోతుందని తెలిపింది. వైరస్ వ్యాప్తిని తగ్గిస్తుందని పేర్కొంది. కిటికీలను కొద్దిగా తెరిచినప్పటికీ బయటి గాలి గదిలోకి వస్తుందని, తద్వారా గదిలోని గాలి నాణ్యత మెరుగుపడుతుందని తెలిపింది. 


కమ్యూనిటీ లెవెల్ టెస్టింగ్, ఐసొలేషన్

గ్రామాలు, చిన్న పట్టణ ప్రాంతాలకు వెళ్లేవారికి రాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నిర్వహించాలని తెలిపింది. దీని కోసం ఆశా, అంగన్వాడీ, హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇవ్వాలని తెలిపింది. ఈ పరీక్షలు నిర్వహించేవారికి సర్టిఫైడ్ ఎన్95 మాస్క్‌లను ఇవ్వాలని తెలిపింది. వీరు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ, ఎన్95 మాస్క్ తప్పనిసరిగా ధరించాలని తెలిపింది. 


Updated Date - 2021-05-20T22:08:58+05:30 IST