అందరి హృదయాల్లో పునీత్‌ అమరుడు

ABN , First Publish Date - 2021-11-09T16:55:59+05:30 IST

పునీత్‌రాజ్‌కుమార్‌కు పద్మశ్రీ ఇవ్వాలని కోరుతున్నారని, ఇప్పటికే కోట్లాదిమంది హృదయాలలో ఆయన అమరశ్రీగా నిలిచారని ‘పద్మశ్రీ’ అనేది టైటిల్‌ మాత్రమేనని నటుడు శివరాజ్‌కుమార్‌

అందరి హృదయాల్లో పునీత్‌ అమరుడు

                             - నటుడు శివరాజ్‌కుమార్‌ 


బెంగళూరు(Karnataka): పునీత్‌రాజ్‌కుమార్‌కు పద్మశ్రీ ఇవ్వాలని కోరుతున్నారని, ఇప్పటికే కోట్లాదిమంది హృదయాలలో ఆయన అమరశ్రీగా నిలిచారని ‘పద్మశ్రీ’ అనేది టైటిల్‌ మాత్రమేనని నటుడు శివరాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. పునీత్‌ దశదినకర్మ సోమవారం నిర్వహించారు. కుటుంబ సభ్యులు పునీత్‌ సమాధికి ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం 9.30 గంటలకే కుటుంబ సభ్యులంతా కంఠీరవ స్టూడియోకు చేరుకుని పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ పునీత్‌ లేరనే విషయం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. 11వ రోజు జరపాలా.. వద్దా.. అనేది కూడా వేధించిందన్నారు. పునీత్‌ మామధ్య లేడనేది ఊహించుకోలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. పునీత్‌ ఓ తమ్ముడికంటే ఎక్కువగా కొడుకులా ఉండేవాడన్నారు. పునీత్‌ దూరమైన బాధ జీవితకాలం ఉంటుందని, మరువలేమన్నారు. పునీత్‌ అందరినీ ఆకర్షించే వ్యక్తి అని, బాల్యం నుంచే ఎదుగుదలను చూసి సంతోషపడ్డామని ఈలోగానే మమ్మల్ని వీడతారని అనుకోలేదన్నారు. పునీత్‌ అకాలమరణం తర్వాత పలువురు ఆత్మహత్య చేసుకున్నారని ఇది సమంజసం కాదని... అభిమానులు అటువంటి నిర్ణయాలు తీసుకోరాదన్నారు. కంఠీరవ స్టూడియో వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొని పలువురికి శివరాజ్‌ పంచిపెట్టారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు సమాధివద్దకు చేరుకోగా మధ్యాహ్నం దాకా ఎవరినీ అనుమతించలేదు. కుటుంబ సభ్యులు పూజలు ముగించుకుని వెనుతిరిగా అభిమానులకు అవకాశం కల్పించారు. ఓవైపు జోరున వర్షం కురుస్తున్నా బారులు తీరిన అభిమానులు సమాధిని దర్శించుకున్నారు. కాగా పునీత్‌ నివాసంలో జరిగిన కార్యక్రమంలో సీఎం బసవరాజ్‌ బొమ్మై పాల్గొన్నారు. పునీత్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మంత్రులు అశోక్‌, మునిరత్న తదితరులు పాల్గొన్నారు. 


నాయండహళ్లి రోడ్డుకు పునీత్‌ పేరు పెట్టాలి 

మైసూరు రోడ్డులోని నాయండహళ్ళి జంక్షన్‌ నుంచి బన్నేరుఘట్ట రోడ్డు వేగా సిటీ మాల్‌ దాకా ఉండే రింగ్‌రోడ్డుకు పునీత్‌ పేరు పెట్టాలని బీజేపీ దక్షిణ జిల్లా విభాగం అధ్యక్షుడు ఎన్‌ఆర్‌ రమేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు బీబీఎంపీ కమిషనర్‌ గౌరవ్‌గుప్తకు వినతిపత్రం అందచేశారు. 

Updated Date - 2021-11-09T16:55:59+05:30 IST