యోగీపై విమర్శలు.. ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్
ABN , First Publish Date - 2021-01-12T02:37:43+05:30 IST
సోమ్‌నాథ్ భారతీ అరెస్ట్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘యోగీజీ.. ప్రభుత్వ పాఠశాలలు చూసేందుకు వస్తే అరెస్ట్ చేస్తారా? ఇంకుతో దాడి చేస్తారా? మీ పాఠశాలలు చూపించడానికి ఎందుకు
లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతీని యూపీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లు సుల్తాన్‌పూర్ కోర్టు తెలిపింది. ఆయన అరెస్ట్, కోర్టు ముందు హాజరు అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే దీనికి కొద్ది సమయం ముందు సోమ్‌నాథ్ భారతీపై ఓ వ్యక్తి ఇంకుతో దాడి చేశాడు. రాయ్‌బరేలిలోని ఒక గెస్ట్ హౌజ్ నుంచి బయటికి వస్తున్న క్రమంలో ఈ దాడి జరిగింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పాలన, ఆసుపత్రుల నిర్వహణపై యోగి ఆదిత్యనాథ్‌ను సోమ్‌నాథ్ భారతీ విమర్శించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఆయనను చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. కాగా, సోమ్‌నాథ్ భారతీ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు కానీ ఫలితం లేకుండా పోయింది. బెయిల్ పిటిషన్‌ను జనవరి 13న వింటామని కోర్టు తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా సోమ్‌నాథ్ భారతీనే వెల్లడించారు.
సోమ్‌నాథ్ భారతీ అరెస్ట్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘యోగీజీ.. ప్రభుత్వ పాఠశాలలు చూసేందుకు వస్తే అరెస్ట్ చేస్తారా? ఇంకుతో దాడి చేస్తారా? మీ పాఠశాలలు చూపించడానికి ఎందుకు భయపడుతున్నారు? మీ పాఠశాలలు అంత దారుణంగా ఉన్నాయా? మీకు పాఠశాలలు ఎలా నిర్మించాలో తెలియకపోతే మనీశ్ సిసోడియాను అడగండి’’ అని కేజ్రీవాల్ అన్నారు.