సిక్కు నేతే 'ఆప్' పంజాబ్ సీఎం అభ్యర్థి: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-06-21T20:24:08+05:30 IST

పంజాబ్‌‌లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ ఆకాంక్షలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్..

సిక్కు నేతే 'ఆప్' పంజాబ్ సీఎం అభ్యర్థి: కేజ్రీవాల్

ఛండీగఢ్: పంజాబ్‌‌లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ ఆకాంక్షలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంకేతాలిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కులకు చెందిన స్థానిక అభ్యర్థే 'ఆప్' ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని ఆయన ప్రకటించారు. సోమవారంనాడు పంజాబ్‌లో పర్యటనకు వచ్చిన కేజ్రీవాల్ అమృత్‌సర్‌లో మీడియాతో మాట్లాడుతూ, పంజాబ్ రాష్ట్రం గర్వించే వ్యక్తినే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దింపుతామని చెప్పారు. ఈ సందర్భంగా పంజాబ్ మాజీ పోలీసు అధికారి కున్వర్ విజయ్ ప్రతాప్ 'ఆమ్ ఆద్మీ పార్టీ'లో చేరారు. కున్వర్ ప్రతాప్ రాకను కేజ్రీవాల్ స్వాగతిస్తూ, ఆయన రాజకీయవేత్త కాదని, ఆమ్ ఆద్మీ  పార్టీకి పోలీస్‌వాలా అని చమత్కరించారు. దేశానికి సేవ చేసేందుకే తామంతా ఇక్కడ ఉన్నట్టు చెప్పారు. అదే ఆశయంతో ఆమ్ ఆద్మీ పార్టీలో కున్వర్ ప్రతాప్ చేరారని చెప్పారు.


కేజ్రీవాల్ గో బ్యాక్...

కాగా, కేజ్రీవాల్ పంజాబ్ చేరుకోక ముందు అమృత్‌సర్‌లో 'కేజ్రీవాల్ గో బ్యాక్' అని రాసి ఉన్న పోస్టర్లు వెలిసాయి. పంజాబ్‌లో కేజ్రీవాల్ అవసరం ఏమాత్రం లేదని, ఆయన పర్యటన కేవలం రాజకీయ స్టంటేనని కాంగ్రెస్ నేత సౌరభ్ మదన్ పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో ఆయన ఎన్నిసార్లు ఇక్కడకు వచ్చారు? అని ప్రశ్నించారు. ఆయన హర్మీందర్ సాహిబ్‌ను దర్శించుకుని వెనక్కి వెళ్లిపోవాలని అన్నారు. ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయారని, ఏ ఒక్క నేత కూడా ఆయన పార్టీలో చేరడం లేదని, ఒక ఆఫీసరు చేరుతున్నట్టు తెలుస్తోందని, లీడర్లు మాత్రం కాదని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ అమృత్‌సర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2021-06-21T20:24:08+05:30 IST