కొవిన్ యాప్‌లో పేరు నమోదు.. కేంద్రం కీలక ప్రకటన!
ABN , First Publish Date - 2021-02-06T23:36:57+05:30 IST
కరోనా టీకా కోసం కొవిన్ యాప్‌లో పేరు నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డ్ తప్పనిసరేమీకాదని కేంద్రం తాజాగా తెలిపింది.

న్యూఢిల్లీ: కరోనా టీకా కోసం కొవిన్ యాప్‌లో పేరు నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డ్ తప్పనిసరేమీకాదని కేంద్రం తాజాగా తెలిపింది. కేంద్రం ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్వినీ చౌబే లోక్‌సభలో శుక్రవారం నాడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ యాప్ కోసం కేంద్రం ఫిబ్రవరి 1వరకూ రూ. 58.90 లక్షలను ఖర్చు చేసిందన్నారు. కరోనా టీకా పంపిణీ వ్యవహారాలన్నీ సమన్వయ పరిచేందుకు కేంద్రం కొవిన్ వెబ్ పోర్టల్‌ను, యాప్‌ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. కరోనా టీకాను వేసుకోదలచిన వారు ముందుగా ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. యూఎన్‌డీపీ సహకారంతో కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ యాప్‌ను రూపొందించింది. కాగా.. కొవిన్ యాప్‌లో పేరు నమోదుకు ఆధార్ అవసరమా అని లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి చౌబే ఈ మేరకు సమాధానం చెప్పారు. సమాచార భద్రత దృష్ట్యా కొవిన్‌లో నమోదైన డాటా అంతా అత్యంత పటిష్టమైన కీ ద్వారా ఎన్‌క్రిప్ట్ అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రైవెసీకి సంబంధించి జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్‌లోని విధివిధానాలను కొవిన్ ప్లాట్‌ఫామ్‌లో అమలవుతున్నాయని చౌబే లోక్‌సభకు తెలిపారు.