బంగ్లాదేశ్‌లో ఆగని దాడులు... Hindu Federation ఆందోళన

ABN , First Publish Date - 2021-10-26T00:26:21+05:30 IST

బంగ్లాదేశ్‌లో ముస్లిమేతరులపై దాడులు ఆగడం లేదని వరల్డ్

బంగ్లాదేశ్‌లో ఆగని దాడులు... Hindu Federation ఆందోళన

ఢాకా : బంగ్లాదేశ్‌లో ముస్లిమేతరులపై దాడులు ఆగడం లేదని వరల్డ్ హిందూ ఫెడరేషన్ బంగ్లాదేశ్ శాఖ ఆవేదన వ్యక్తం చేసింది. అక్టోబరు 13న ప్రారంభమైన దాడులపై పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నప్పటికీ ఆదివారం కాక్స్ బజార్ జిల్లాలోని కటఖలి ఫారెస్ట్ బుద్ధిస్ట్ మోనస్టరీని తగులబెట్టారని, ఈ దారుణ సంఘటనలో 15 మంది బౌద్ధ చక్మాలు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. 


బంగ్లాదేశ్‌వ్యాప్తంగా హిందువులు అత్యంత దారుణమైన దాడులకు గురవుతున్నారని తెలిపింది. అక్టోబరు 13 నుంచి ప్రారంభమైన హింసాకాండలో 35కుపైగా జిల్లాల్లో 335 దేవాలయాలు, 1,650 హిందువుల ఇళ్ళు, దుకాణాలను ధ్వంసం చేశారని పేర్కొంది. ఏడుగురు హిందూ పూజారులు, ఏడుగురు హిందువులు హత్యకు గురయ్యారని తెలిపింది. 17 మంది హిందువుల జాడ తెలియడం లేదని పేర్కొంది. 26 మంది హిందూ మహిళలు, బాలికలపై అత్యాచారాలు చేశారని పేర్కొంది. బాధితుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపింది. పదేళ్ళ హిందూ బాలికపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారని పేర్కొంది. హిందువులపై దాడులను నివారించేందుకు ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. దుర్గా పూజ మండపంలోని ఆంజనేయుడి విగ్రహం వద్ద ఖురాన్‌ను పెట్టిన వ్యక్తి ఇక్బాల్ అని బంగ్లాదేశ్ పోలీసులు గుర్తించినప్పటికీ, అతని చర్యను ఇస్లామిక్ సంస్థలు ఖండించలేదని తెలిపింది. 


బంగ్లాదేశ్ లౌకికవాద సౌభాగ్యవంతమైన దేశంగా ఉండాలని కోరుకుంటున్నారా? లేదంటే పాకిస్థాన్ క్రింద ఉన్నప్పటి దేశంగా వెనుకకు వెళ్ళాలని కోరుకుంటున్నారా? ప్రభుత్వం అనే విషయాన్ని స్పష్టం చేయాలని కోరింది. 


దాడులు ఎలా ప్రారంభమయ్యాయంటే...

కొమిల్లా పట్టణంలోని ఓ దుర్గా పూజ మండపంలో ఆంజనేయుడి విగ్రహం వద్ద ఖురాన్ ఉన్నట్లు కనిపిస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో చూసిన ముస్లింలు రెచ్చిపోయి, హిందువులపైనా, దుర్గా పూజ మండపాలపైనా దాడులు చేశారు. ఈ దాడులు దేశవ్యాప్తంగా విస్తరించాయి. 


Updated Date - 2021-10-26T00:26:21+05:30 IST