ఫ్రెంచ్ కోర్టులో భారత ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ
ABN , First Publish Date - 2021-07-08T19:24:54+05:30 IST
పారిస్‌లోని 20 భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి బ్రిటన్‌కు

న్యూఢిల్లీ : పారిస్‌లోని 20 భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ కంపెనీకి ఫ్రెంచ్ కోర్టు అనుమతి ఇచ్చింది. భారత ప్రభుత్వం బాకీ పడిన 1.7 బిలియన్ డాలర్లలో కొంత భాగాన్ని రాబట్టుకోవడానికి ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత కాలం నుంచి వర్తించే పన్నుల విధింపును ఆర్బిట్రేషన్ ప్యానెల్ రద్దు చేయడంతో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
పారిస్ నడిబొడ్డున ఉన్న, భారత ప్రభుత్వానికి చెందిన సుమారు 20 మిలియన్ యూరోల విలువైన ఫ్లాట్లు, తదితర ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి కెయిర్న్ ఎనర్జీకి ఫ్రెంచ్ కోర్టు అనుమతి ఇచ్చింది. కెయిర్న్ కంపెనీ దాఖలు చేసిన దరఖాస్తును జూన్ 11న ఫ్రెంచ్ కోర్టు ఆమోదించింది. దీనికి సంబంధించిన చట్టపరమైన లాంఛనాలు బుధవారం సాయంత్రానికి పూర్తయ్యాయి.
అయితే ఈ ఫ్లాట్లలో నివసిస్తున్న భారతీయ అధికారులను కెయిర్న్ కంపెనీ ఖాళీ చేయించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. మరోవైపు కోర్టు ఆర్డర్ కారణంగా వీటిని అమ్మడానికి భారత ప్రభుత్వానికి అవకాశం ఉండదు.
ముగ్గురు సభ్యులుగల ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ ట్రైబ్యునల్‌లో భారత ప్రభుత్వం నియమించిన జడ్జి ఒకరు ఉన్నారు. గత కాలం నుంచి వర్తించే విధంగా పన్నులను విధించడాన్ని ఈ ట్రైబ్యునల్ తప్పుబట్టింది. ఈ పన్నులను రాబట్టుకునేందుకు అమ్మిన వాటాలు, జప్తు చేసిన డివిడెండ్, నిలిపివేసిన ట్యాక్స్ రిఫండ్స్‌ను తిరిగి కెయిర్న్‌కు ఇచ్చేయాలని ఆదేశించింది.
ఈ తీర్పును భారత ప్రభుత్వం అమలు చేయడానికి తిరస్కరించింది. దీంతో కెయిర్న్ వివిధ ఓవర్సీస్ జ్యురిస్‌డిక్షన్స్‌ను ఆశ్రయించింది. ఆర్బిట్రేషన్ తీర్పును అమెరికా, బ్రిటన్, కెనడా, సింగపూర్, మారిషస్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌లలో నమోదు చేసింది.
కెయిర్న్ ఎనర్జీ అధికార ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశానికి తెర దించడానికి భారత ప్రభుత్వంతో సామరస్య పరిష్కారానికే తాము ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అనేక ప్రతిపాదనలను భారత ప్రభుత్వానికి సమర్పించామని చెప్పారు. అయితే సరైన పరిష్కారం లభించకపోవడం వల్ల అంతర్జాతీయ వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం తాము అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలను తీసుకోవడం తప్పనిసరి అవుతుందని చెప్పారు.