95% మందికి పెట్రోల్ అవసరమే లేదు: ధరల పెరుగుదలపై బీజేపీ నేత వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-10-22T01:15:55+05:30 IST
పెరుగుతున్న పెట్రోల్ ధరలపై సమాధానం చెప్పమంటే దేశంలో మెజారిటీ ప్రజలకు అసలు పెట్రోల్ అవసరమే లేదని సమాధానం చెప్పి తీవ్ర విమర్శల పాలవుతున్నారు ఉత్తరప్రదేశ్‌కి చెందిన మంత్రి ఉపేంద్ర తివారి. గురువారం రాష్ట్రంలోని జలౌన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు..

లఖ్‌నవూ: పెరుగుతున్న పెట్రోల్ ధరలపై సమాధానం చెప్పమంటే దేశంలో మెజారిటీ ప్రజలకు అసలు పెట్రోల్ అవసరమే లేదని సమాధానం చెప్పి తీవ్ర విమర్శల పాలవుతున్నారు ఉత్తరప్రదేశ్‌కి చెందిన మంత్రి ఉపేంద్ర తివారి. గురువారం రాష్ట్రంలోని జలౌన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతున్న మాట వాస్తవమే కానీ.. కార్లు, బైక్‌లు చాలా తక్కువ మంది వద్ద ఉన్నాయి. పెట్రోల్ ఆ తక్కువ మందికే అవసరం. దేశంలోని 95 శాతం జనాభాకు పెట్రోల్ అవసరమే లేదు. ప్రతిపక్షాలకు ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో వాగుతున్నారు. వారికి దమ్ముంటే దేశ తలసరి ఆదాయం గురించి మాట్లాడమనండి. 2014కి ముందు ఈ దేశ తలసరి ఆదాయం ఎంత ఉండేదో, ఇప్పుడు ఎంత ఉందో చెప్పమనండి. మోదీ, యోగీ వల్ల దేశంలో తలసరి ఆదాయం రేటు గననీయంగా పెరిగింది’’ అని మంత్రి ఉపేంద్ర తివారి అన్నారు.