8 లక్షల ఆదాయ పరిమితిపై పునఃపరిశీలిస్తాం
ABN , First Publish Date - 2021-11-26T09:01:33+05:30 IST
అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్) కోటాకు అర్హతగా రూ.8లక్షల ఆదాయ పరిమితిని నిర్ణయిస్తూ జారీచేసిన ఉత్తర్వులను పునఃపరిశీలిస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.

- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకు తెలిపిన కేంద్రం..
- కమిటీ వేసి 4 వారాల్లోగా నిర్ణయం
- అప్పటివరకు నీట్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు వెల్లడి
న్యూఢిల్లీ, నవంబరు 25: అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్) కోటాకు అర్హతగా రూ.8లక్షల ఆదాయ పరిమితిని నిర్ణయిస్తూ జారీచేసిన ఉత్తర్వులను పునఃపరిశీలిస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ అంశంపై నిపుణుల కమిటీని నియమిస్తామని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కోటా విధివిధానాలను పరిశీలించి కమిటీ నివేదికను సమర్పించనుందని చెప్పారు. నాలుగు వారాల్లోగా మొత్తం కసరత్తును పూర్తిచేసి, నిర్ణయాన్ని కోర్టుకు తెలుపుతామన్నారు.
మెడికల్ పీజీ ఆలిండియా కోటా సీట్లలో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని గత జూలైలో కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కొంతమం ది విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై అక్టోబరు 21న విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.8 లక్షలు గా నిర్ణయించడంలో హేతుబద్ధతను ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా ఒకే ఆదాయ పరిమితిని నిర్ణయించడానికి ప్రాతిపదిక ఏమిటో స్పష్టం చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ కోటాను రాష్ట్రాలు కూడా నోటిఫై చేయాల్సి ఉందని, అలాంటప్పుడు అన్ని రాష్ట్రాలు, నగరాలు, పట్టణాలకు ఒకే ఆదాయ పరిమితిని ఎలా పెడతారని ప్రశ్నించింది. ఈ ఏడాదికి రిజర్వేషన్ల అమలును వాయిదావేయాలని, కౌన్సెలింగ్‌ను కొనసాగించాలని పిటిషనర్లు కోర్టును అభ్యర్థించారు. దీనికి కేంద్రం తిరస్కరించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కమిటీ నివేదిక వచ్చే వరకు.. 4 వారాలపాటు కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నామని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.