యూపీలో బీజేపీకి 7 పార్టీల మద్దతు
ABN , First Publish Date - 2021-10-28T22:27:52+05:30 IST
రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం

లక్నో : రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం ఏడు చిన్న పార్టీలతో కూడిన హిస్సేదారీ మోర్చా తమకు మద్దతు ప్రకటించిందని భారతీయ జనతా పార్టీ తెలిపింది. ఈ 7 పార్టీల నేతలు తమ పార్టీల మద్దతుకు సంబంధించిన లేఖలను యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్‌కు అందజేశారని తెలిపింది.
కేవత్ రామ్‌ధానీ బింద్ (భారతీయ మానవ్ సమాజ్ పార్టీ), చంద్ర వనవాసి (ముసాహర్ ఆందోళన్ మంచ్), బాబూలాల్ రాజ్‌భర్ (శోషిత్ సమాజ్ పార్టీ), కృష్ణ గోపాల్ సింగ్ కాశ్యప్ (మానవ్ హిత్ పార్టీ), భీమ్ రాజ్‌భర్ (భారతీయ సుహేల్ దేవ్ జనతా పార్టీ), చందన్ సింగ్ చౌహాన్ (పృథ్వీరాజ్ జనశక్తి పార్టీ), మహేంద్ర ప్రజాపతి (భారతీయ సమత సమాజ్ పార్టీ) తమ పార్టీల మద్దతు లేఖలను స్వతంత్ర దేవ్ సింగ్‌కు అందజేశారని పేర్కొంది.
2017 శాసన సభ ఎన్నికల్లో సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ)తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అయితే ఈ పార్టీ తాజాగా సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఎస్‌పీ, ఎస్‌బీఎస్‌పీ నేతలు బుధవారం మావులో ఒకే వేదికపైకి వచ్చి, ఈ విషయాన్ని ప్రకటించారు. 2022 ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని చెప్పారు.