మహారాష్ట్రలో 7 ‘డెల్టా ప్లస్‌’ కేసులు

ABN , First Publish Date - 2021-06-21T09:12:35+05:30 IST

‘డెల్టా ప్లస్‌’ కరోనా వేరియంట్‌ మహారాష్ట్రలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. 7 డెల్టా ప్లస్‌ కేసులను రత్నగిరి, నవీ ముంబై, పాల్ఘర్‌ జిల్లాల్లో ఆదివారం గుర్తించారు. రత్నగిరి జిల్లాలోనే 5 కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తమైన

మహారాష్ట్రలో 7 ‘డెల్టా ప్లస్‌’ కేసులు

డెల్టా ప్లస్‌తో మూడోవేవ్‌ రావచ్చు


ముంబై/న్యూఢిల్లీ, జూన్‌ 20 : ‘డెల్టా ప్లస్‌’ కరోనా వేరియంట్‌ మహారాష్ట్రలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. 7 డెల్టా ప్లస్‌ కేసులను రత్నగిరి, నవీ ముంబై, పాల్ఘర్‌ జిల్లాల్లో ఆదివారం గుర్తించారు. రత్నగిరి జిల్లాలోనే 5 కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ వైద్య యంత్రాంగం ఈ జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల నుంచి మరిన్ని శాంపిళ్లను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపింది. వాటి తుది నివేదిక రావాల్సి ఉందని మహారాష్ట్రకు చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (డీఎంఈఆర్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ టి.పి.లహానే వెల్లడించారు. రత్నగిరి జిల్లాలో ఇన్ఫెక్షన్‌ బారినపడిన ఐదుగురిలో ఇద్దరికి కొవిడ్‌ లక్షణాలు బయటపడలేదన్నారు. కొల్హాపూర్‌, సతారా, సాంగ్లి, రాయ్‌గడ్‌, సింధుదుర్గ్‌ జిల్లాల్లోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మూడోవేవ్‌ మొదలుకావచ్చని, ఇన్ఫెక్షన్ల వ్యాప్తిరేటు రెట్టింపయ్యే ముప్పు ఉందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ నివేదించింది. కాగా, రానున్న రోజుల్లో డెల్టా ప్లస్‌ ‘ఆందోళన రేకెత్తించే వేరియంట్‌’గా పరిణమిస్తుందని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా హెచ్చరించారు. దాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడం మంచిదని సూచించారు. నెలల తరబడి కఠిన లాక్‌డౌన్‌ తర్వాత బ్రిటన్‌ ప్రభుత్వం మార్కెట్లను తెరవగానే డెల్టా వేరియంట్‌ వల్ల ఒక్కసారిగా కేసులు భారీగా పెరగడాన్ని గుర్తుంచుకోవాలన్నారు. భారత్‌ ఇప్పుడు అప్రమత్తతతో వ్యవహరించకుంటే 3, 4 నెలల తర్వాత బ్రిటన్‌ పరిస్థితి రావచ్చని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-21T09:12:35+05:30 IST