62 మంది జలసమాధి?

ABN , First Publish Date - 2021-01-10T07:24:49+05:30 IST

ఇండోనేషియాలో ఓ డొమెస్టిక్‌ విమానం శనివారం గల్లంతైంది. అది జావా సముద్రంలో కుప్పకూలిందని.. అందులో ఉన్నవారంతా జలసమాధి అయ్యారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

62 మంది జలసమాధి?

  • ఇండోనేషియాలో విమాన ప్రమాదం
  • గాల్లోకి ఎగిరిన 4 నిమిషాలకు సిగ్నల్‌ కట్‌
  • సముద్రంలో శకలాలను గుర్తించిన జాలర్లు
  • గాలింపు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం


జకార్తా, జనవరి 9: ఇండోనేషియాలో ఓ డొమెస్టిక్‌ విమానం శనివారం గల్లంతైంది. అది జావా సముద్రంలో కుప్పకూలిందని.. అందులో ఉన్నవారంతా జలసమాధి అయ్యారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇండోనేషియా రాజధాని జకర్తా నుంచి పశ్చిమ కాళీమంతన్‌ రాష్ట్రంలోని పోంటియానక్‌ దీవికి వెళ్లాల్సిన శ్రీవిజయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737-500 విమానం(ఎ్‌సజే 182) మధ్యాహ్నం 2.36కు టేకాఫ్‌ అయ్యింది. తర్వాత 4 నిమిషాల్లోనే.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. ఆ సమయంలో విమానం 29,000 ఎత్తులో ఉన్నట్లు ఇండోనేషియా రవాణా శాఖ మంత్రి బూది కార్య సుమాదీ తెలిపారు.


ఆ విమానంలో 50 మంది ప్రయాణికులతోపాటు.. పైలట్లు, ఇతర సిబ్బందిని కలుపుకొని మరో 12 మంది ఉన్నట్లు వివరించారు. సిగ్నళ్లు నిలిచిపోయిన సమయంలో.. ఆ విమానం కుదుపునకు లోనై.. ఒక్క నిమిషం వ్యవధిలోనే 10,600 అడుగుల మేర కిందకు దూసుకుపోయినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. ఈ విమాన ప్రయాణం అధికంగా జావా సముద్రం మీదుగా  ఉంటుందని, నాలుగు యుద్ధ విమానాలు, మరికొన్ని నౌకలతో గాలింపు చర్యలను ప్రారంభించామని ఇండోనేషియా రవాణా మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అదిత ఐరావతి వెల్లడించారు. రాడార్‌ సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని నేషనల్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ, జాతీయ రవాణా భద్రత కమిటీ (ఎన్‌టీఎ్‌ససీ) రంగంలోకి దిగాయని తెలిపారు. విమానం టేకాఫ్‌ అయిన సమయంలో వర్షం కురిసిందన్నారు.




అయితే.. ఆ విమానం జావా సముద్రంలో కూలిపో యి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. థౌజం డ్‌ ఐలాండ్స్‌ సముదాయం సమీపంలో విమాన శకలాలను గుర్తించిన జాలర్లు.. అధికారులకు సమాచారం అందించినట్లు స్థానిక మీడియా వార్తలను ప్రసారం చేసింది. గాలింపు చర్యల్లో పాల్గొన్న త్రిశూల్‌ కోస్ట్‌గార్డ్‌ కమాండర్‌ కూడా విమాన శకలాలు, మానవ శరీర భాగాలను గుర్తించామన్నారు.


‘‘విమానం క్షేమంగా ఉంటే.. ఎమర్జెన్సీ లొకేటర్‌ ట్రాన్స్‌మిటర్‌ (ఈఎల్‌టీ) సంకేతాలను పరిశీలించే అవకాశాలుంటాయి. కానీ, విమానం టేకాఫ్‌ అయిన 4 నిమిషాల తర్వాత ఈఎల్‌టీ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. ఆస్ట్రేలియాకు చెందిన శాటిలైట్‌ వ్యవస్థ ద్వారా కూడా ఈఎల్‌టీ సంకేతాలకు ప్రయత్నించాం. ఫలితం శూన్యం. దీన్ని బట్టి.. విమానం కూలిపోయి ఉంటుంది’’ అని ఓ అధికారి అన్నారు.


కాలం చెల్లిన విమానమా?

శనివారం గల్లంతైన బోయింగ్‌ 737-500 విమానం 26 ఏళ్ల క్రితం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 1994లో ఆ విమానాన్ని తొలిసారి వినియోగంలోకి తెచ్చారని ఫ్లైట్‌ ట్రేడర్‌-24 సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కాగా, ఇండోనేషియాను విమాన ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. 2018 అక్టోబరు 29న లయన్‌ ఎయిర్‌కు చెందిన బోయింగ్‌ 737-మ్యాక్స్‌ విమానం జకార్తాలో టేకాఫ్‌ అయిన 12 నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 189 మంది చనిపోయారు. 2014లో(మృతులు 162 మంది), 1997లో (234 మంది మృత్యువాత)నూ ప్రమాదాలు సంభవించాయి.


Updated Date - 2021-01-10T07:24:49+05:30 IST