ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఆరుగురు దుర్మరణం

ABN , First Publish Date - 2021-12-26T20:06:57+05:30 IST

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నూడిల్స్ తయారీ కర్మాగారంలో బాయిలర్ పేలి..

ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఆరుగురు దుర్మరణం

పాట్నా: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నూడిల్స్ తయారీ కర్మాగారంలో బాయిలర్ పేలి ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. ఐదు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగ్రాతులను సమీపంలోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్టు ముజఫర్‌పూర్ ఎస్ఎస్‌పీ జయంత్ కాంత్ తెలిపారు.


దీనికి ముందు, జిల్లా మెజిస్ట్రేట్ ప్రణవ్ కుమార్ ఒక ప్రకటనలో నూడిల్స్ ఫ్యాక్టరీలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో ఐదుగురు మరణించారని, ఆరుగురు గాయపడ్డారని తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. కాగా, ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతులకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం సుమారు 5 కిలోమీటర్ల వరకూ వినిపించింది. పేలుడు తీవ్రతకు సమీపంలోని పిండి మిల్లు కూడా ధ్వంసమైంది. మిల్లులో నిద్రిస్తున్న ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. కాగా, ప్రమాద స్థలిలో శిథిలాలు తొలగింపు కొనసాగుతోందని, పది మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని సహాయక సిబ్బంది చెబుతున్నారు.

Updated Date - 2021-12-26T20:06:57+05:30 IST