డీఎంకే పాలనకు నిరసనగా 28న అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్త ఆందోళన

ABN , First Publish Date - 2021-07-24T13:17:47+05:30 IST

శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపుచ్చేలా ప్రకటించిన హామీలు నెరవేర్చని డీఎంకే ప్రభుత్వాన్ని ఖండిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే తొలిసారిగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టనుంది.

డీఎంకే పాలనకు నిరసనగా 28న అన్నాడీఎంకే రాష్ట్రవ్యాప్త ఆందోళన

చెన్నై: శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపుచ్చేలా ప్రకటించిన హామీలు నెరవేర్చని డీఎంకే ప్రభుత్వాన్ని ఖండిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే తొలిసారిగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టనుంది. ఈ మేరకు శుక్రవారం అన్నాడీఎంకే ఉపసమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త ఒ. పన్నీర్‌సెల్వం సంయుక్తంగా ఓ ప్రకటన జారీ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్త ఆందోళన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కరోనా నిరోధక నిబంధనలు పాటిస్తూ పార్టీ జిల్లా శాఖ నాయకులు, ప్రముఖులు తమ ఇళ్ల ముందు పార్టీ పతకాలను చేతపట్టుకుని ధర్నాలు జరపాలని పిలుపునిచ్చారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, ఆయన సోదరి కనిమొళి, తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ తదితర నేతలంతా తమ పార్టీ అధికారంలోకి రాగానే నీట్‌ రద్దు చేయిస్తామని ప్రకటించారని, అధికారంలోకి రాగానే ఆ హామీని నెరవేర్చక తీరని ద్రోహానికి పాల్పడిందని ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం ఆరోపించారు. డీఎంకే అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గిస్తామని ప్రకటించిన స్టాలిన్‌ ఆ హామీని అమలు చేయలేదని డీఎంకే అధికారంలోకి వచ్చి మూడు మాసాలు కావస్తున్నా కొత్త పథకాల అమలు గురించి గానీ, మేనిఫెస్టో హామీలు గురించి గాని పట్టించుకోవడమే లేదని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని డీఎంకే ప్రభుత్వ అసమర్థతను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు 28వ తేదీ ఉదయం పది గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా శాఖల నేతలు, నగరశాఖల నేతలు తమ ఇళ్ల ఎదుట అన్నాడీఎంకే జెండాలతో ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-07-24T13:17:47+05:30 IST