258 కోట్ల నగదు.. 25 కిలోల బంగారం

ABN , First Publish Date - 2021-12-28T06:43:08+05:30 IST

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు రోజులపాటు సాగిన సుదీర్ఘ సోదాలు. వెతికే కొద్దీ అంతులేని ఆస్తులు. కిలోల కొద్దీ బంగారం, కట్టల కొద్దీ నగదు, లెక్కకు మించి లాకర్లు, గుత్తుల....

258 కోట్ల నగదు.. 25 కిలోల బంగారం

దుబాయ్‌ సహా పలుచోట్ల విలువైన ఆస్తులు

కాన్పూర్‌లో అత్తరు వ్యాపారి పీయూష్‌ జైన్‌ అరెస్టు 


కాన్పూర్‌, డిసెంబరు 27 : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు రోజులపాటు సాగిన సుదీర్ఘ సోదాలు. వెతికే కొద్దీ అంతులేని ఆస్తులు. కిలోల కొద్దీ బంగారం, కట్టల కొద్దీ నగదు, లెక్కకు మించి లాకర్లు, గుత్తుల కొద్దీ తాళాలు.. ఆదాయ పన్ను శాఖ అధికారులు లెక్కపెట్టలేక అలసిపోయేంత సొత్తు. కాన్పూర్‌కు చెంది న సుగంధ ద్రవ్యాల(పర్ఫ్యూమ్‌)ల వ్యాపారి పీయూష్‌ జైన్‌ ఇంట్లో వెలుగు చూశాయి ఈ ఆస్తులు. జైన్‌ ఇత్తర్‌వాలీ గల్లీలో పర్ఫ్యూమ్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఆదాయ పన్ను ఎగవేశాడన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ, జీఎస్టీ అధికారులు ఈ నెల 22న జైన్‌ నివాసంతో పాటు కనౌజ్‌లోని ఫ్యాక్టరీ ప్రాంగణంలో సోదాలు ప్రారంభించారు.


120 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సోదాలు సోమవారం ముగిశాయి. ఈ తనిఖీల్లో 16 ఖరీదైన ఆస్తులు బయటపడ్డాయి. ఇందులో 4 కాన్పూర్‌లో, 7 కనౌజ్‌లో, 2 ముంబైలో, ఒకటి ఢిల్లీలో, 2 దుబాయ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రూ.258 కోట్లకుపైగా నగదును కనుగొన్నారు. 25 కిలోల బంగారం, 250 కిలోల వెండిని సీజ్‌ చేశారు. కనౌజ్‌లోని పీయూష్‌ పూర్వీకుల ఇంట్లో 18 లాకర్లను గుర్తించారు. సుమారు 500 తాళం చెవులు దొరికాయి. వాటి సాయంతో లాకర్లను తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.


మరోవైపు, పర్ఫ్యూమ్‌ల తయారీలో ఉపయోగించే 600 కిలోల గంధపు నూనెనూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.6 కోట్లు ఉంటుంది. పీయూ్‌షను సుమారు 50 గంటల పాటు విచారణ చేసిన అధికారులు ఆయనను అరెస్టు చేశారు. మెట్రోపాలిటన్‌ కోర్టు.. జైన్‌కు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.

Updated Date - 2021-12-28T06:43:08+05:30 IST