రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తాం : ప్రతిపక్షాలు
ABN , First Publish Date - 2021-01-28T20:32:50+05:30 IST
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం
న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజు శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని 16 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. కొత్త సాగు చట్టాలను ప్రతిపక్షాలు లేకుండా ఆమోదించారని, వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు గురువారం ఈ పార్టీలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి.
కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ గురువారం మాట్లాడుతూ, పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం చేసే ప్రసంగాన్ని బహిష్కరించాలని 16 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్, ఎన్‌సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, డీఎంకే, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ముస్లింలీగ్, ఆర్ఎస్‌పీ, పీడీపీ, ఎండీఎంకే, ఏఐయూడీఎఫ్, కేరళ కాంగ్రెస్ (ఎం) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనికి ప్రధాన కారణం, ప్రతిపక్షాలు లేకుండా కొత్త సాగు చట్టాలను పార్లమెంటులో ఆమోదించడమేనని తెలిపారు.
ఇదిలావుండగా, ఢిల్లీ పోలీసులు గురువారం 20 మంది రైతు సంఘాల నేతలకు నోటీసులు జారీ చేశారు. గణతంత్ర దినోత్సవాలనాడు ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటలకు సంబంధించిన కేసుల్లో ఈ నోటీసులను పంపించారు. మూడు రోజుల్లోగా సమాధానాలు సమర్పించాలని ఆదేశించారు.
మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన హింసాత్మక సంఘటనల్లో గాయపడి, చికిత్స పొందుతున్న పోలీసు సిబ్బందిని పరామర్శించారు. సివిల్ లైన్స్‌లోని సుశ్రుత ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్న పోలీసులను పరామర్శించారు. జనవరి 26న జరిగిన ఘర్షణలో దాదాపు 400 మంది పోలీసులు గాయపడిన సంగతి తెలిసిందే.