ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో..16 లక్షల కేసులు

ABN , First Publish Date - 2021-12-31T08:47:07+05:30 IST

కొవిడ్‌ డెల్టా వేరియంట్‌కు.. ఒమైక్రాన్‌ తోడు కావడంతో ప్రపంచవ్యాప్తంగా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గురువారం రాత్రి వరకు.

ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో..16 లక్షల కేసులు

  • 7 వేల మరణాలు
  • ఏడవ రోజూ 10 లక్షలకు పైగా పాజిటివ్‌లు
  • అమెరికాలో కొత్తగా 4.65 లక్షల పాజిటివ్‌లు
  • ఫ్రాన్స్‌లో మళ్లీ 2 లక్షలపైనే కేసులు నమోదు
  • యూకేలో రికార్డు స్థాయిలో 1.83 లక్షల కేసులు
  • 8 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
  • టీకా పంపిణీ వేగిరం.. పరీక్షలను పెంచండి
  • ఆంక్షలు కఠినంగా అమలయ్యేలా చూడండి
  • దేశంలో 33 రోజుల తర్వాత 10 వేల కేసులు
  • ముంబైలో ఒక్కరోజే 3,600పైగా పాజిటివ్‌లు


వాషింగ్టన్‌, డిసెంబరు 30: కొవిడ్‌ డెల్టా వేరియంట్‌కు.. ఒమైక్రాన్‌ తోడు కావడంతో ప్రపంచవ్యాప్తంగా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గురువారం రాత్రి వరకు.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 16.04 లక్షల మంది వైరస్‌ బారినపడ్డారు. 7,317 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారంతో పోలిస్తే.. కేసులు 4 లక్షలు, మరణాలు 800 వరకు పెరిగాయి. అమెరికాలో కొత్తగా 4,65 లక్షల పాజిటివ్‌లు రికార్డయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే ఇవి కాస్త తక్కువ. మరణాలు మాత్రం 1,777 గా నమో దయ్యాయి. వైరస్‌ ఉధృతి రీత్యా అగ్రరాజ్యంలో భారీ బహిరంగ కార్యక్రమాలు రద్దవుతున్నాయి. వీటిలో కొత్త సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఏర్పాటు చేసినవీ ఉంటున్నాయి. ఫ్రాన్స్‌లో కేసులు 2 లక్షలకు తగ్గడం లేదు. తాజాగా 2.08 లక్షల పాజిటివ్‌లు నమోదయ్యాయి. 184 మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీ (41,816)లో బుధవారం కంటే బాధితులు మరో వెయ్యి పెరిగారు. అమెరికా తర్వాత రష్యా (932)లో మరణాలు మరణాలు అధికంగా ఉన్నాయి. పోలండ్‌ (794)లోనూ మృతుల సంఖ్య అధికంగా నమోదవుతోంది. ఈ దేశంలో కేసులు 15 వేల మధ్యనే ఉంటున్నా.. మరణాలు భారీగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఒమైక్రాన్‌ ఉధృతితో యూకే అతలాకుతలం అవుతోంది. ఇదివరకు ఎన్నడూ లేనంతగా కొత్తగా 1.83 లక్షల పాజిటివ్‌లు నమోదయ్యాయి. క్రితం రోజుకు ఇవి 32 శాతం అధికం. ముందుజాగ్రత్తగా ప్రభుత్వం ఆస్పత్రుల్లో రోగులకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది. వ్యాక్సిన్‌ పంపిణీ చాలా స్వల్పంగా ఉన్న పశ్చిమ యూర్‌పపై కొవిడ్‌ పంజా విసురుతోంది. 


8 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

వారపు కేసులు, పాజిటివ్‌ రేటు ప్రకారం మహారాష్ట్ర, బెంగాల్‌, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్‌లో పరిస్థితిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో వైరస్‌ వ్యాప్తిని సూచించే.. ఆర్‌ విలువ 1.22గా ఉన్నదని, కేసుల పెరుగుదలకు ఇది హెచ్చరిక అని వివరించింది. పరీక్షలు పెంచాలని, ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని, టీకా పంపిణీ వేగిరం చేయాలని, ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ, హరియాణ, జార్ఖండ్‌,  గుజరాత్‌కు లేఖ రాసింది. ఈ రాష్ట్రాల్లోని  చెన్నై, ముంబై, బెంగళూరు, రాంచీ, కోల్‌కతా, బెంగళూరు, గుర్గావ్‌, పుణె, థానె, నాగపూర్‌ తదితర 14 నగరాల్లో పెద్దఎత్తున కేసులకు ఒమైక్రాన్‌ వ్యాప్తి ప్రధాన కారణమని కేంద్రం భావిస్తోంది. ఢిల్లీ తరహాలో దేశమంతటా ఎల్లో అలర్ట్‌ను ప్రకటించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. టెస్టులు పెంచాలని 19 రాష్ట్రాలను కోరింది. 


దేశంలో 49 రోజుల గరిష్ఠ స్థాయిలో కేసులు

దేశంలో బుధవారం కేసులు భారీగా పెరిగాయి. 49 రోజుల గరిష్ఠ స్థాయిలో.. 13,154 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. పాజిటివ్‌లు 10 వేలు దాటడం 33 రోజుల్లో ఇదే తొలిసారి. కాగా, మొత్తం ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య 961కి పెరిగింది. కొత్తగా గరిష్ఠ స్థాయిలో 180 ఒమైక్రాన్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి. మొత్తం 22 రాష్ట్రాలకు ఈ వేరియంట్‌ వ్యాపించిందని కేంద్రం తెలిపింది.

  

మహారాష్ట్రలో ఒక్క రోజే 5 వేల కేసులు

 మహారాష్ట్రలో మరోసారి వైరస్‌ కలకలం రేపుతోంది. గురువారం ఏకంగా 5,368 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఇందులో 198 ఒమైక్రాన్‌ పాజిటివ్‌లుండడం గమనార్హం. ముంబైలోనే 190 ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా ముంబైలో 3,671 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. క్రితం రోజుకు ఇవి 46 శాతం అధికం. దేశ రాజధాని ఢిల్లీలో మే 26 తర్వాత గురువారం రికార్డు స్థాయిలో 1,313 కేసులు వచ్చాయి. బుధవారం కేసులు 923కు చేరగా.. ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి. కొత్త పాజిటివ్‌ ల్లో 46 శాతం ఒమైక్రాన్‌వేనని ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ పేర్కొన్నారు. జనవరి 3 నుంచి యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మీదుగా వచ్చే అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు బెంగాల్‌ ప్రకటించింది.  


కొవాక్సిన్‌తో పిల్లలకు బలమైన రక్షణ

కొవాక్సిన్‌ టీకాతో పిల్లలకు బలమైన రక్షణ లభిస్తోందని భారత్‌ బయోటెక్‌ సంస్థ వెల్లడించింది. రెండు, మూడో దశ ఔషధ పరీక్షల్లో టీకా సురక్షితమని నిరూపితమైందని, పిల్లల్లో రోగ నిరోధక శక్తిని మరింత పెంపొందిస్తుందని తేలిందని ప్రకటించింది. ట్రయల్స్‌ ఫలితాలను సంస్థ గురువారం వెల్లడించింది. 2 నుంచి 18 ఏళ్ల పిల్లలు 525 మందిపై ట్రయల్స్‌ నిర్వహించింది. ఎవ్వరిలోనూ  తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించలేదు. పిల్లల్లో కొవాక్సిన్‌  టీకా ఔషధ పరీక్షల ఫలితాలు మరింత ప్రోత్సాహాన్నిచ్చేలా ఉన్నాయని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణా ఎల్లా తెలిపారు. పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ అత్యంత సురక్షితమని, టీకా వారిలో మెరుగైన రోగనిరోధక శక్తిని పెంపొందించిందని వెల్లడించారు.  


భారత్‌లో స్వల్పకాలిక థర్డ్‌ వేవ్‌

భారత్‌లో త్వరలోనే థర్డ్‌ వేవ్‌ వస్తుందని.. దీంతో కరోనా కేసులు తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలోని జడ్జ్‌ బిజినెస్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ పాల్‌ కట్టూమాన్‌ అంచనా వేశారు.అయితే, ఈ వేవ్‌ కొద్ది రోజులే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లోనే కొత్త కేసులు పెరుగుతాయని, అది ఈ వారంలోనే జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే రోజుకు ఎన్ని కేసులు నమోదవుతాయని చెప్పడం కష్టమని అన్నారు. మే నెలలో కలకలం రేపిన సెకండ్‌ వేవ్‌ను సరిగ్గా అంచనా వేసిన పాల్‌.. ఆగస్టులోనూ స్వల్పంగా కరోనా కేసులు నమోదవుతాయని చెప్పారు. 


ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు బూస్టర్‌డోసుపై..త్వరలో మార్గదర్శకాలు జారీ

ఫ్రంట్‌లైన్‌, హెల్త్‌కేర్‌ వర్కర్లు, కొమార్బిడిటీస్‌ ఉన్న వృద్ధులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రికాషనరీ(బూస్టర్‌) డోసు ఇవ్వడంపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ వెల్లడించారు. ఈ అంశంపై 3 రోజులుగా నీతిఆయోగ్‌, నిపుణులతో సమావేశాలు జరుపుతున్నామన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో హైబ్రీడ్‌ ఇమ్యూనిటీ వస్తుందన్నారు. కొవిడ్‌ సోకగానే యాంటీబాడీస్‌ పనిచేయడం ప్రారంభిస్తాయని తెలిపారు. వ్యాక్సిన్‌ ఏదైనా.. ఏ దేశం తయారీ అయినా.. కొవిడ్‌ను ఆపలేదని, తీవ్రతను.. ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని చెప్పారు. కాగా.. ప్రికాషనరీ డోస్‌కు అర్హులైన వారి మొబైల్‌ ఫోన్‌కు సందేశాలు అందుతాయని, రెండో డోసు తీసుకున్న 9 నెలలకే బూస్టర్‌ డోసు తీసుకోవాలని ఆరోగ్య సంస్థ తెలిపింది.

Updated Date - 2021-12-31T08:47:07+05:30 IST