దేశంలో 1,500 ఆక్సిజన్ ప్లాంట్లు
ABN , First Publish Date - 2021-07-10T08:11:12+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధించింది. ప్రాణ వాయువు అందక ఆస్పత్రుల్లో వేలాది రోగులు అల్లాడిపోయారు.
పీఎం కేర్స్ నిధులతో ఏర్పాటు
దీంతో ఆస్పత్రుల్లో 4 లక్షలకు పైగా ఆక్సిజన్ పడకలు
త్వరగా వినియోగంలోకి తేవాలి
ప్లాంట్ల నిర్మాణం, ఆక్సిజన్ లభ్యతపై
ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష
న్యూఢిల్లీ, జూలై 9: కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధించింది. ప్రాణ వాయువు అందక ఆస్పత్రుల్లో వేలాది రోగులు అల్లాడిపోయారు. అయితే కొద్ది రోజులుగా వైరస్ ఉధృతి బాగా తగ్గింది. మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందుజాగ్రత్తగా దేశవ్యాప్తంగా 1,500 పైగా ప్రెజర్ స్వింగ్ అడ్సార్షన్ (పీఎ్సఏ) ప్లాంట్ల ఏర్పాటుకు పూనుకుంది. పీఎం కేర్స్, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల నిధుల సహకారంతో వీటిని నెలకొల్పుతున్నారు. ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దేశంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యత, ప్లాంట్ల నిర్మాణ ప్రగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్లాంట్లను సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. నిర్వహణకు సంబంధించి ఆస్పత్రి సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని నిర్దేశించారు. అంతేకాక, ప్రతి జిల్లాలో శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వాటి పని తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 8 వేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు ప్రధానికి వివరించారు. పీఎ్సఏ ప్లాంట్ల వినియోగంతో.. 4 లక్షలపైగా ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
దేశంలో కొత్త కేసులు 43,393
దేశంలో గురువారం 43,393 మందికి వైరస్ నిర్ధారణ అయింది. 911 మంది చనిపోయారు. మహారాష్ట్ర (439) కరోనా మృతుల సంఖ్య సవరణ కొనసాగుతోంది. దీంతో జాతీయ స్థాయిలో మరణాల సంఖ్య పెరుగుతోంది. గురువారం 17.90 లక్షల మందికి పరీక్షలు చేశారు. పాజిటివ్ రేటు 2.42గా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాగా, మహారాష్ట్రలో పాజిటివ్లు పదివేల లోపునకు వచ్చినా.. కేరళలో 13వేలకు తగ్గడం లేదు. ఈ రాష్ట్రంలో మరణాలు సైతం 150కి దగ్గరగా ఉంటున్నాయి. గతవారం దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 53 శాతం కేరళ(32), మహారాష్ట్ర(21)వేనని కేంద్రం తెలిపింది. గురువారం 40 లక్షల పైగా టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. మొత్తం టీకా లబ్ధిదారుల సంఖ్య 36.89 కోట్లకు చేరిందని, రాష్ట్రాల వద్ద 1.70 కోట్ల టీకాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.
సిడ్నీవాసులూ.. గడప దాటొద్దు
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో లాక్డౌన్ను మరింత కఠినం చేశారు. ఎన్నడూ లేనివిధంగా కేసులు నమోదవడంతో పరిస్థితి తీవ్రంగా ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను ఇల్లు దాటొద్దని ఆదేశాలిచ్చారు. డెల్టా వేరియంట్ విజృంభణతో సిడ్నీలో మూడు వారాలుగా లాక్డౌన్ నడుస్తోంది. 20 రోజుల్లోనే 450 మంది వైర్సబారిన పడ్డారు. తాజా నిబంధనలతో 50 లక్షల మందికి ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది.