వర్కవుట్స్, డైటింగ్ చేసినా ఫలితం లేదా..? ఈ మాత్రలను వాడితే ఈజీగా బరువు తగ్గొచ్చు..!

ABN , First Publish Date - 2021-12-14T22:13:06+05:30 IST

అధిక బరువును తగ్గించడంలో సంతృప్తికరమైన ఫలితాన్నిచ్చేవి ప్రధానంగా... డైటింగ్‌, వెయిట్‌ లాస్‌ డ్రగ్స్‌! ఈ రెండు విధానాలు ఎవరికి? ఎందుకు?

వర్కవుట్స్, డైటింగ్ చేసినా ఫలితం లేదా..? ఈ మాత్రలను వాడితే ఈజీగా బరువు తగ్గొచ్చు..!

ఆంధ్రజ్యోతి(14-12-2021)

అధిక బరువును తగ్గించడంలో సంతృప్తికరమైన ఫలితాన్నిచ్చేవి ప్రధానంగా... డైటింగ్‌, వెయిట్‌ లాస్‌ డ్రగ్స్‌! ఈ రెండు విధానాలు ఎవరికి? ఎందుకు? 


ఏళ్ల తరబడి బరువు పెరుగుతాం. అలాంటప్పుడు పెరిగిన బరువు నెల లేదా రెండు నెలల్లో తగ్గిపోవాలని అనుకోవడం సరి కాదు. బరువు తగ్గాలనుకుంటే, మున్ముందు కూడా తగ్గిన బరువును కొనసాగించగలిగే పట్టుదల ఉండాలి. అందుకు తగిన ఆహార నియమాలు పాటించాలి. తాత్కాలిక వెయిట్‌లాస్‌ కోసం కాకుండా, శాశ్వతంగా బరువును నిలకడగా ఉంచే జీవనశైలి అలవరుచుకోవాలి. ఎక్కువ మంది అనుసరించే డైటింగ్‌ ట్రెండ్స్‌ విఫలమవడానికి కారణం వాటిని అనుసరించే విధానం గురించిన అవగాహన లోపమే! ఎంతోకాలంగా వాడుకలో అలాంటి కొన్ని డైట్‌ ట్రెండ్స్‌ వాటి ప్రభావాలను పరిశీలిస్తే...కీటో

ఇది మూర్చ వ్యాధితో బాధపడే పిల్లల కోసం ఉద్దేశించిన థెరప్యూటిక్‌ డైట్‌. ఫిట్స్‌ వచ్చే పిల్లల్లో గ్లూకోజ్‌ మెటబాలిజంను తగ్గించడం కోసం ఈ డైట్‌ను వైద్యులు సూచించేవారు. ఆ డైట్‌లో గ్లూకోజ్‌ను కీటోన్స్‌తో భర్తీ చేయడం వల్ల నాడుల ప్రేరణ సద్దుమణిగి, ఫిట్స్‌ అదుపులోకొచ్చేవి. ఇలా వాడుకలోకొచ్చిన కీటో డైట్‌ను తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనుకునేవాళ్లందరూ ఎంచుకుంటున్నారు. అయితే కీటో డైట్‌ అధిక బరువును తగ్గించే ఉత్తమమైన ప్రత్యామ్నాయం కాదు.  


దుష్ప్రయోజనాలే ఎక్కువ


ఈ డైట్‌తో వేగంగా బరువు తగ్గినా, మానేసిన వెంటనే తిరిగి పూర్వపు బరువుకు చేరుకుంటారు. 


ఈ డైట్‌ను ఎప్పటికీ కొనసాగించే వీలుండదు. 


మూత్రపిండాల సమస్యలూ తలెత్తవచ్చు.


మలబద్ధకం వేధిస్తుంది.


అతి నిద్ర, నిస్సత్తువ, నీరసం వేధిస్తాయి.


కండరాలు కరగడం వల్ల చర్మం జీవం కోల్పోతుంది.


ఇంటర్‌మిటెంట్‌

పరిమిత వేళలకు (విండో పీరియడ్‌) కట్టుబడి, ఆహారం తీసుకుంటూ మిగతా రోజంతా ఉపవాసంతో ఉండే డైట్‌ స్టైల్‌ ఇది.  విండో పీరియడ్‌లో నచ్చినవన్నీ, కడుపారా తినేసి, మిగతా సమయమంతా ఉపవాసం కొనసాగిస్తే సరిపోతుంది అనుకుంటే పొరపాటు. మన శరీరం 24 గంటల పాటు పని చేయాలంటే, నిరంతరంగా క్యాలరీలు అందుతూ ఉండాలి. ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌లో తక్కువ నిడివిలో ఎక్కువ క్యాలరీలను శరీరంలో కూరడం వల్ల శరీరం షాక్‌కు గురవుతుంది. దాంతో అవసరానికి మించిన క్యాలరీలు కొవ్వు రూపంలో నిల్వ ఉండిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే విండో పీరియడ్‌లో సరైన పరిమాణాల్లో, సరైన నాణ్యతతో కూడిన ఆహారం ఎంచుకోవాలి. శక్తిని, దీర్ఘకాలం పాటు నెమ్మదిగా విడుదల చేసే పదార్థాలనే ఎంచుకోవాలి. ఇందుకోసం బ్రౌన్‌ రైస్‌, మిల్లెట్స్‌ ఉపయోగపడతాయి.


దుష్ప్రయోజనాలు ఇవే!

16 నుంచి 18 గంటల పాటు ఉపవాసం ఉండడం వల్ల విపరీతమైన ఆకలితో, అవసరానికి మించి తినేసే ప్రమాదం ఉంది.


అసిడిటీ, కడుపులో అల్సర్లు మొదలయ్యే అవకాశాలు ఉంటాయి.


తలనొప్పులు వేధిస్తాయి. 


కడుపు ఉబ్బరం, మలబద్ధకం ఇబ్బంది పెడతాయి.


నిద్రలేమి సమస్య తలెత్తుతుంది.స్మాల్‌.. ఫ్రీక్వెంట్‌

రోజులో తక్కువ మొత్తంలో, ప్రతి రెండు గంటలకూ తినడం ఆరోగ్యకరం. అయితే ఈ చిన్న చిన్న మీల్స్‌లో ఏ ఆహారం, ఎంత తినాలో తెలుసుకుని అనుసరించాలి. ఉదయం నిద్ర లేచిన గంటలోగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం లోపు ఒక పండు, లంచ్‌లో ప్రొటీన్‌, కాంప్లెక్స్‌ కార్బొహైడ్రేట్స్‌, పీచు ఉండేలా చూసుకోవాలి. మరో రెండు లేదా మూడు గంటలకు ఒక ప్రొబయాటిక్‌, పండ్లు లేదా నట్స్‌ తినాలి. డిన్నర్‌లో లంచ్‌లో తీసుకున్నవే తినవచ్చు. రాత్రికి పాలు లేదా మజ్జిగ... నచ్చింది తీసుకోవాలి. అయితే ఈ రకమైన డైట్‌ను ఎవరికి వారు ఎంచుకోకుండా, న్యూట్రిషనిస్టు సూచన మేరకు అనుసరించడం ఆరోగ్యకరం. 


ప్రయోజనాలే ఎక్కువ


ఈ డైట్‌తో శరీరానికి నిరంతరంగా శక్తి అంది చురుగ్గా ఉంటుంది.


పోషకాలన్నీ సక్రమంగా, సమయానికి అందడం మూలంగా ఆకలి బాధ తప్పుతుంది.


ఎప్పటికప్పుడు క్యాలరీలు ఖర్చయిపోతూ ఉంటాయి కాబట్టి కొవ్వు పేరుకుపోయే పరిస్థితి ఉండదు. 


ప్రతి రెండు గంటలకూ తింటాం కాబట్టి, ఆకలితో అవసరానికి మించి తినే ప్రమాదం ఉండదు.కొవ్వు కరగాలి, కండలు కాదు

ఉపవాసం పాటించిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా బరువు తగ్గుతారు. అయితే కొవ్వు కరగడం వల్ల బరువు తగ్గారా? లేక కండరాలు కరగడం వల్ల బరువు తగ్గారా అనేది కీలకం. కొవ్వు, కండరాలు, ఎముకలు, నీరు... శరీర బరువులో ఇవన్నీ కలిసి ఉంటాయి. పురుషుల్లో 20ు, మహిళల్లో 20 - 25ు కొవ్వు ఆరోగ్యకరం. ఇంతకు మించితే కండరాలను మించి, కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. ఉపవాసంలో శరీరం తనకు కావలసిన శక్తి కోసం కొవ్వు మీద కాకుండా, కండరాల మీద ఆధారపడుతుంది. దాంతో కండరాలు కరుగుతాయి. కొవ్వు కరగడానికి ఎంత కాలం పడుతుందో కండరం తయారవడానికి అంతకు నాలుగింతల కాలం పడుతుంది. శరీరంలో ఎంత ఎక్కువ కండరం ఉంటే, మెటబాలిజం అంత చురుగ్గా ఉండి, కొవ్వు కరుగుతుంది. అలాంటప్పుడు ఉపవాసంతో కండరాలను కోల్పోతే, కొవ్వు కరిగే పరిస్థితే ఉండదు. ఉపవాసం చేసినంత కాలం శరీర బరువు తగ్గి, మానేసిన వెంటనే బరువు పెరిగిపోవడానికి కారణం ఇదే! కాబట్టి కండరాలకు బదులుగా కొవ్వు కరగాలంటే, ఇష్టారాజ్యంగా ఉపవాసాలు చేయడం మానుకోవాలి.  


ఫ్లెక్సిబిలిటీ ముఖ్యం

కొందరు ఉండవలసిన బరువు కంటే రెండు మూడు కిలోలు ఎక్కువ బరువుతో ఉంటారు. అయితే ఎటువంటి రుగ్మతలూ లేకుండా, ఆరోగ్యంగా, ఫ్లెక్సిబిలిటీతో చురుగ్గా ఉన్నంత కాలం ఈ అదనపు బరువుతో ఎలాంటి సమస్యలూ ఉండవు. ఈ అదనపు కిలోలను డైటింగ్‌తో తగ్గించుకోవలసిన అవసరమూ లేదు. 


అశ్వినీ సాగర్‌, 

క్లినికల్‌ అండ్‌ స్పోర్ట్స్‌ న్యూట్రిషనిస్ట్‌,

ఆహార్‌ వేద, హైదరాబాద్‌. బరువు తగ్గించే మందులు

అధిక బరువును డైట్‌, వ్యాయామం ద్వారా తగ్గించుకోవచ్చు. వెయిట్‌ లాస్‌ డ్రగ్స్‌ వాడకం చిట్టచివరి ప్రత్యామ్నాయం. మొదట 3 నెలలు డైటింగ్‌ చేయడంతో పాటు, వారానికి 300 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామాలు చేయవలసి ఉంటుంది. వీటిని అనుసరించినా బరువు తగ్గలేని వాళ్లకు మాత్రమే ఈ డ్రగ్స్‌.


ఎవరు అర్హులు: బిఎమ్‌ఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) 23 దాటితే అధిక బరువు కింద లెక్క. బిఎమ్‌ఐ 25 దాటితే ఒబేసిటీగా పరిగణించాలి. బిఎమ్‌ఐ 27 నుంచి 32.5 మధ్య ఉన్నవాళ్లు, డైట్‌, వ్యాయామం చేయలేని స్థితిలో ఉన్నవాళ్లు, చేసినా బరువు తగ్గనివాళ్లు వెయిట్‌లాస్‌ డ్రగ్స్‌కు అర్హులు. 


ఎలా పని చేస్తాయి: బరువును తగ్గించే మందులు రెండు రకాలు. మొదటి రకం మందులు తినే ఆహారంలోని కొవ్వును జీర్ణం కాకుండా శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. రెండో రకం ఆకలిని చంపడంతో పాటు, కొద్ది ఆహారంతోనే కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. అలాగే బరువు పెంచే హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఫలితంగా రెండు రకాల డ్రగ్స్‌తోనూ అధిక బరువు తగ్గుతుంది.


ఏ మందులు: ఆర్లీస్టాట్‌.. ఆహారంలోని కొవ్వును బయటకు పంపించే ఈ మాత్రను రోజుకు మూడు సార్లు, భోజనానికి ముందు వేసుకోవాలి. ఆకలిని పుట్టించని రెండో రకం డ్రగ్స్‌ మాత్ర లేదా ఇంజెక్షన్‌ రూపంలో ఉంటాయి. మాత్ర రూపంలోని లిరాగ్లూటైడ్‌ను రోజుకొకటి చొప్పున, ఇంజెక్షన్‌ రూపంలోని సెరాగ్లూటైడ్‌ను వారానికి ఒకటి చొప్పున తీసుకోవాలి. 


మధుమేహులైతే: వీళ్లు పైన చెప్పిన మందులతో పాటు ఎస్‌జిఎల్‌టి2 ఇన్హిబిటర్లను కూడా అదనంగా తీసుకోవలసి ఉంటుంది. ఈ ఇన్హిబిటర్లతో శరీరంలోని చక్కెర ఎక్కువగా మూత్రం ద్వారా బయటకు వెళ్లడం మూలంగా బరువు తగ్గుతారు. పైగా ఈ మందులు మూత్రపిండాలు, గుండె ఆరోగ్యానికి దన్నుగా పనిచేస్తాయి. మందులు వాడినంత కాలం మూడు నుంచి నాలుగు అంతకంటే ఎక్కువ కిలోల బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. 


మందులు ఎంతకాలం: కనీసం మూడు నెలలు వాడినప్పుడే మందుల ప్రభావం కనిపిస్తుంది. మందులు పని చేస్తున్నాయని తేలితే, అనుకున్నంత బరువు తగ్గేవరకూ వీటిని వాడుకోవచ్చు. రెండేళ్ల పాటు, 60 లేదా 70 వారాల పాటు వాడుకోవచ్చు. 


మందులు వాడేటప్పుడు: మందులు వేసుకుంటూ, సుష్టుగా భోంచేద్దాం అనుకునేవాళ్లకు ఈ మందులు పని చేయవు. మందులు వాడినంత కాలం వైద్యులు సూచించిన ఆహార నియమాలు పాటించవలసిందే! 


దుష్ప్రభావాలు: కొవ్వు జీర్ణం కాకుండా శరీరం నుంచి బయటకు వెళ్లిపోయేలా చేసే ఆర్లీస్టాట్‌ మాత్ర వాడినప్పుడు, పలుచని విరోచనాలు అవుతాయి. లిరాగ్లూటైడ్‌, సెరాగ్లూటైడ్‌ వాడినప్పుడు వికారం కలుగుతుంది.                                    


బిఎమ్‌ఐ 32.5 ఉండీ, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఉన్నవాళ్లు వెయిట్‌ లాస్‌ డ్రగ్స్‌కు అర్హులు కారు. వీళ్లు అధిక బరువును వేగంగా తగ్గించుకోవడానికి బేరియాట్రిక్‌ సర్జరీ ఒక్కటే ప్రత్యామ్నాయం. 37.5 బిఎమ్‌ఐ ఉన్నవారికి వెయిట్‌ లాస్‌ డ్రగ్స్‌ పని చేయవు. కాబట్టి వీరికి మధుమేహం లాంటి కొమార్బిడ్‌ సమస్యలు లేనప్పటికీ బరువు తగ్గడం కోసం బేరియాట్రిక్‌ సర్జరీని ఆశ్రయించక తప్పదు. డాక్టర్‌ శ్రీ నగేష్‌,

కన్సల్టెంట్‌ ఎండోక్రైనాలజిస్ట్‌ అండ్‌ డయబెటాలజిస్ట్‌,

శ్రీ నగేష్‌ డయాబెటిస్‌ థైరాయిడ్‌ అండ్‌ ఎండోక్రైన్‌ క్లినిక్‌, హైదరాబాద్‌.

Read more