జీలకర్ర నీళ్లు మహా అద్భుతం.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే ఇలా చేయండి..
ABN , First Publish Date - 2021-12-28T16:41:23+05:30 IST
ఏ కూరలోకైనా జీలకర్ర పడితే ఆ రుచే వేరు. మంచి సువాసనతో పాటు జీర్ణశక్తిని పెంచే శక్తి ఈ దినుసు సొంతం. అయితే మనం ఎప్పుడూ

ఆంధ్రజ్యోతి(28-12-2021)
ఏ కూరలోకైనా జీలకర్ర పడితే ఆ రుచే వేరు. మంచి సువాసనతో పాటు జీర్ణశక్తిని పెంచే శక్తి ఈ దినుసు సొంతం. అయితే మనం ఎప్పుడూ జీలకర్రను వంటలతోనే సరిపెట్టేస్తాం. ఈ మోతాదు మాత్రమే సరిపోదు. దీనిని పలు రకాలుగా వాడితే.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అందులో జీలకర్ర నీళ్లు మహా అద్భుతం.. లాభాలెన్నో...
జీర్ణశక్తి- పిండి పదార్థాలు, గ్లూకోజ్, కొవ్వులు తేలికగా విడిపోయి.. జీర్ణమయ్యేందుకు తోడ్పడే ఎంజైమ్‌లు తయారయ్యేలా చేస్తాయి జీలకర్ర నీళ్లు. శరీరం శక్తిని ఖర్చు చేసే ప్రక్రియ వేగాన్ని పెంచి.. డయేరియా, వాంతులు లాంటి జీర్ణ సంబంధ రుగ్మతలను తొలగిస్తాయి కూడా.
విషాలు- శరీరం నుంచి విషతుల్య పదార్థాలను బయటకు వెళ్లగొట్టడంలో సమర్థమైనవి జీలకర్ర నీళ్లు. ఫలితంగా కాలేయం పనితీరు మెరుగుపడి జీర్ణశక్తి పెరుగుతుంది. ఫలితంగా అంతర్గత అవయవాల ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది.
వ్యాధినిరోధక శక్తి- జీలకర్రలోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఒక కప్పు జీలకర్ర నీటిలో ఒక రోజుకు అవసరమైన ఐరన్‌లో 7 శాతం లభిస్తుంది. ఈ నీటిలోని ఎ, సి విటమిన్లు వ్యాధికారక ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి.
రక్తహీనత- ఈ నీటిలోని అధిక ఐరన్ వల్ల రక్తహీనత తొలగిపోతుంది. రక్తంలో తగినంత ఐరన్ లేకపోతే అవసరమైనన్ని ఎర్ర రక్త కణాలు తయారు కావు. ఫలితంగా నీరసం, నిస్సత్తువ ఆవహిస్తుంది. ఈ లోపాన్ని జీలకర్ర నీటితో భర్తీ చేయవచ్చు.
శ్వాసకోశ వ్యవస్థ- కఫాన్ని కరిగించే గుణం జీలకర్రకు ఉంది. ప్రతి రోజూ ఉదయం జీలకర్ర నీరు తాగితే ఛాతీలో పేరుకున్న కఫం కరిగి బయటకు వచ్చేస్తుంది. దీనిలోని వ్యాధి నిరోధక గుణాలు బ్యాక్టీరియాను చంపి జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
నిద్ర- త్వరగా నిద్రలోకి జారుకునేలా చేయడంతో పాటు, గాఢమైన నిద్ర పట్టేందుకు ఈ నీళ్లు తోడ్పడతాయి.
జ్ఞాపకశక్తి- మెదడు పనితీరు మెరుగుపరిచి, జ్ఞాపకశక్తి పెరిగేలా చేయడంతో పాటు, ఏకాగ్రతనూ పెంచుతాయివి.
చర్మం- జీలకర్ర నీటితో శరీరంలోని విషాలు హరిస్తాయి. ఫలితంగా చర్మం మచ్చలు లేకుండా తాజాదనాన్ని సంతరించుకుంటుంది. సహజసిద్ధమైన మెరుపు సొంతమవుతుంది.
కొవ్వు- జీలకర్రలో ఉండే పైటోస్టిరాల్, సెపోనిన్ అనే మూలకాలు కొలెస్ర్టాల్ శోషణను నిరోధిస్తాయి. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకునే ప్రక్రియ తగ్గుతుంది.
తయారీ ఇలా: ఒక కప్పు నీళ్లలో ఒక చెంచా జీలకర్ర వేసి మరిగించాలి. తర్వాత వడపోసి వేడిగా తాగాలి. ఈ పానీయం ఎన్నో రకాల చర్మ, శిరోజ సంబంధ సమస్యలను తొలగిస్తుంది. పరగడుపునే ఈ పానీయం తాగితే ఫలితం ఉంటుంది.
మరికొన్ని పద్ధతుల్లో...
జీలకర్ర నీళ్లను నేరుగా తాగలేని వాళ్లు, కొంత అదనపు రుచులు జోడించి కూడా తీసుకోవచ్చు.
నిమ్మరసం- రెండు చెంచాల జీలకర్రను ఒక కప్పు నీటిలో వేసి, రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి, అరచెక్క నిమ్మరసం పిండుకుని తాగాలి.
దాల్చిన చెక్క- రెండు చెంచాల జీలకర్రను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వడగట్టాలి. దీనిలో చెరొక చెంచా దాల్చిన చెక్క పొడి, సోంపు పొడి కలిపి తాగాలి.
యాపిల్ సిడార్ వెనిగర్- రెండు చెంచాల జీలకర్రను నీళ్లలో కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వడగట్టి చెంచా యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి తాగాలి.
పెరుగు- ఒక చెంచా జీలకర్ర పొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి మిక్సీలో వేసి తిప్పి తినాలి.