ఈ సూత్రాలు పాటిస్తే ఆరోగ్యం భేష్‌!

ABN , First Publish Date - 2021-12-16T18:46:53+05:30 IST

‘ఆయుర్వేదం శరీరానికి చేసే ఒక చికిత్స కాదు.. ఒక జీవన విధానం. దీన్ని అర్ధం చేసుకున్నప్పుడు అనేక

ఈ సూత్రాలు పాటిస్తే ఆరోగ్యం భేష్‌!

ఆంధ్రజ్యోతి(16-12-2021)

‘ఆయుర్వేదం శరీరానికి చేసే ఒక చికిత్స కాదు.. ఒక జీవన విధానం. దీన్ని అర్ధం చేసుకున్నప్పుడు అనేక ప్రయోజనాలు మనకు చేకూరుతాయి’ అంటారు ‘కైరాలీ’ గ్రూపు వ్యవస్థాపకురాలు గీతా రమేష్‌. ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన కైరాలీ ప్రస్తుతం రెండు వేల కోట్ల రూపాయల గ్రూపుగా ఎదిగింది. ఈ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించిన గీత ‘నవ్య’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ విశేషాలు ఆమె మాటల్లోనే..


నాన్న కేరళలో పేరుమోసిన ఆయుర్వేద వైద్యులు. అందువల్ల ఈ వైద్య విధానం నాకు కొత్త కాదు. చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నా. బయోకెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చేసిన తర్వాత నేను కూడా ఆయుర్వేద వైద్య విధానానికి సంబంధించిన ఏదో ఒక వృత్తిలో ప్రవేశించాలనుకున్నా. నా భర్త రమేష్‌ అలోపతి డాక్టర్‌. ఆయనకు కూడా ఆయుర్వేదం అంటే చాలా ఆసక్తి. దాంతో ఆయుర్వేద ఉత్పత్తులను తయారుచేసే కంపెనీని ప్రారంభించాలనుకున్నాం. 1989లో ఢిల్లీలో ఫ్యాక్టరీ ప్రారంభించాం. ఇప్పుడైతే ఆయుర్వేదం గురించి ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది కానీ ఒకప్పుడు ఈ వైద్య విధానం గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. దీంతో మేం ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రజలకు అవగాహన కల్పించకుండా ఏం చేసినా ఫలితం ఉండదనే విషయం అర్థమయింది. అందుకే ఢిల్లీలో మందులతో పాటుగా ప్రజలకు సంపూర్ణమైన అవగాహన కల్పించటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. మేము ఢిల్లీని ఒక కేంద్రంగా ఎంచుకోవటానికి ఒక కారణం ఉంది. ఢిల్లీ మన దేశ రాజధాని. అక్కడ వివిధ రాష్ట్రాల ప్రజలు ఉంటారు. అదే విధంగా అనేక మంది విదేశీయులూ ఉంటారు. వారికి మా సంస్థ గురించి తెలిస్తే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల వారికి తెలుస్తుందనే ఉద్దేశంతో అక్కడ మొదలుపెట్టాం. నెమ్మదిగా ప్రజల దగ్గర నుంచి ఆదరణ లభించటం మొదలుపెట్టింది. ఆ తర్వాత కేరళలోని పాలక్కాడ్‌లో కైరాలీ సెంటర్‌ను ప్రారంభించాం. 


కారణాలివే..

పాలక్కాడ్‌లో సెంటర్‌ను ప్రారంభించినప్పుడు- ఒక పేషెంట్‌ మా దగ్గరకు వచ్చాడు. అతనికి సైనసైటిస్‌, ఆర్థరైటిస్‌ వంటి సమస్యలున్నాయి. అతనికి మసాజ్‌తో పాటుగా ఆహారపు అలవాట్లలో చేయాల్సిన మార్పులు.. క్రమం తప్పకుండా వేసుకోవాల్సిన మందుల గురించి మా డాక్టర్లు చెప్పారు. ఆ పద్ధతి చూసి అతను షాక్‌ అయ్యాడు. ‘‘నాకు మోకాలి నొప్పి ఉంటే - ఆహారపు అలవాట్లు మార్చుకోమంటారెందుకు?’’ అని వాదించటం మొదలుపెట్టాడు. అతనికి ఆయుర్వేద పద్ధతి గురించి వివరించిన తర్వాత సమాధానపడ్డాడు. అతనే కాదు..  ఇప్పటికి కూడా మనలో చాలా మందికి ఆయుర్వేదం అంటే కేవలం మసాజ్‌ మాత్రమేననే అభిప్రాయం ఉంది. కానీ అది శుద్ధ తప్పు. ఆయుర్వేదం ఒక చికిత్సా పద్ధతి కాదు. అదొక జీవన విధానం. దీని ద్వారా మన పూర్వీకులు ఆరోగ్యంగా జీవించగలిగారు. మనం కూడా ఆ పద్ధతులు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాం. పైగా- ఈ పద్ధతులు అంత కఠినమైనవేమి కావు. మన దైనందిన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలంతే! కొంత క్రమశిక్షణ కూడా అవసరం. అయితే చాలా మందికి ఈ మార్పులు చేసుకోవటం ఇష్టం ఉండదు. క్రమశిక్షణ అసలే ఉండదు. వీటితో పాటుగా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు- దానికి శాశ్వత పరిష్కారం కనుగొనటానికి ఇష్టపడరు. 


అన్ని రకాలుగా..

నాకు చిన్నప్పటి నుంచి వంటలు చేయడమటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి రకరకాల వంటలు చేసేదాన్ని. ఇవన్నీ మేము పాలక్కాడ్‌లో సెంటర్‌ ప్రారంభించిన తర్వాత ఎంతగానో ఉపకరించాయి. ఈ సెంటర్‌లో రకరకాల ఆరోగ్య సమస్యలతో ఉన్న వారు నివసిస్తూ ఉంటారు. వారికి మందులు ఇస్తే మాత్రం చాలదు. ఆహార నియమాలను కూడా అమలు చేయాలి. పైగా వంటకాలన్నీ రుచిగా ఉండాలి. దీని కోసమే నేను ఆయుర్వేద వైద్య సూత్రాల ఆధారంగా రకరకాల వంటలను తయారుచేశాను. మా సెంటర్‌లో చెఫ్‌లందరూ వీటినే వండుతారు. సెంటర్‌లో ఉండే విదేశీయులకు కూడా ఇవి చాలా నచ్చుతాయి. నా వంటలను రెండు పుస్తకాలుగా కూడా ప్రచురించారు. చక్కని సమతౌల్యమైన ఆహారం తినాలనుకొనేవారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. రెండేళ్ల క్రితం కోవిడ్‌ వచ్చినప్పుడు- అందరూ చాలా కంగారు పడ్డారు. మేము కూడా మా సెంటర్‌ను మూసేశాం. అయితే మేము తయారుచేసిన ఆయుర్వేద మందులకు మాత్రం విపరీతమైన ఆదరణ లభించింది. చివరగా అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నా. మనిషి జీవితంలో ఆరోగ్యం లేకపోతే ఎన్ని సిరి సంపదలున్నా వృధా. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మన పూర్వీకులు అద్భుతమైన మార్గాలు చెప్పారు. అవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ సూత్రాలు పాటిస్తే చాలు. నూరేళ్లు ఆరోగ్యంగా బతుకుతాం.’’ 


మన దేశంలో ఆయుర్వేద పరిశోధనలకు సరైన ఆదరణ లభించటం లేదు. మేము మా వంతు కృషి చేస్తున్నాం. రకరకాల మూలికలు, వాటి ప్రయోజనాలపై పరిశోధనలు చేస్తున్నాం. వాటి ఫలితాల ఆధారంగా మందులు తయారుచేస్తున్నాం. మాకు కొన్ని పేటెంట్లు కూడా లభించాయి. అయితే ఆయుర్వేద వైద్య విధానంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. 


ఆయుర్వేదం స్త్రీ, పురుషుల మధ్య ఎటువంటి వ్యత్యాసం చూపించదు. అయితే మహిళలకు సంబంధించిన వైద్య విధానాలపై ఆయుర్వేదంలో ప్రత్యేక అధ్యాయాలు ఉన్నాయి. వాస్తవానికి పురుషులతో పోలిస్తే మహిళలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఒక మహిళ జీవితంలో రసజ్వల కావటం... గర్భం ధరించటం... రుతుస్రావం ఆగిపోవటం- ఇలాగ రకరకాల మైలురాళ్లు ఉంటాయి. ఈ సమయాల్లో వచ్చే ఆరోగ్య సమస్యలకు ఆయిర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. వీటి వల్ల మంచి ఫలితాలు కూడా లభిస్తాయి. 


మన భారతీయ వంటకాలకు సాటి వచ్చేవేవి ఉండవు. ఒక కూరగాయను తీసుకొని దాన్ని రకరకాలుగా వండేది భారతీయులే. అంతేకాకుండా మన దగ్గర దొరికే కూరగాయలన్నీ సులభంగా అరిగేవే. రకరకాల కూరగాయలను కలిపి కొన్ని వందల వంటలు వండవచ్చు. అందుకే మా సెంటర్‌లో ప్రతి రోజూ వేర్వేరు మెనూలు ఉంటాయి. ఒక రోజు చేసిన వంట మరో రోజు ఉండదు.

సివిఎల్‌ఎన్‌ప్రసాద్‌

                                                                                                                                  

Read more