కండరాల పటుత్వం తగ్గుతోంది.. ఎలా?
ABN , First Publish Date - 2021-07-30T19:03:54+05:30 IST
ముప్ఫయి ఏళ్లు దాటిన తరువాత నుంచి వయసు పెరిగే కొద్దీ కండరాలు బలహీనపడతాయి. దీనిని సార్కోపీనియా అంటారు. శారీరక శ్రమ లేక పోవడం, కొన్ని రకాల మందుల వాడకం, శారీరకంగా మరేదైనా అస్వస్థత ఉండడం లాంటి కారణాల

ఆంధ్రజ్యోతి(30-07-2021)
ప్రశ్న: నాకు నలభై ఏళ్లు. కండరాల పటుత్వం తగ్గుతోంది. ఈ కండరాలకు బలాన్నిచ్చే ఆహార పదార్థాల గురించి తెలియజేస్తారా?
- నారాయణ రెడ్డి, చిత్తూరు
డాక్టర్ సమాధానం: ముప్ఫయి ఏళ్లు దాటిన తరువాత నుంచి వయసు పెరిగే కొద్దీ కండరాలు బలహీనపడతాయి. దీనిని సార్కోపీనియా అంటారు. శారీరక శ్రమ లేక పోవడం, కొన్ని రకాల మందుల వాడకం, శారీరకంగా మరేదైనా అస్వస్థత ఉండడం లాంటి కారణాల వల్ల కొన్నిసార్లు వయసుతో సంబంధం లేకుండా కూడా కండరాలు బలహీనపడతాయి. మీరు ఆరోగ్యంగా ఉన్నా, కండరాల బలహీనతకు లోనైతే పోషకాహారంతో పాటు, శారీరక వ్యాయామం చేయడం తప్పనిసరి. ఆహారంలో మాంసకృత్తులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీని కోసం మాంసాహారులైతే మాంసం, చికెన్, చేప, గుడ్లు మొదలైనవి తీసుకోవచ్చు. శాకాహారులు పప్పుధాన్యాలు, పాలు, పెరుగు, పనీర్, అన్ని రకాల గింజలు, సోయాపనీర్ మొదలైనవాటి నుండి ప్రొటీన్లు పొందవచ్చు. విటమిన్లు, ఖనిజాల లోపం వల్ల కూడా నీరసం, బలహీనత రావచ్చు. దీనిని అధిగమించడానికి అన్నిరకాల ధాన్యాలు, పాలు, పాలఉత్పత్తులు, వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు రోజూ తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఉత్పత్తులు, నూనెలో వేయించిన పదార్థాలు మొదలైనవి మానెయ్యాలి. ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వ్యాయామం రోజూ చేస్తే కండరాల బలహీనత తగ్గేందుకు కొన్ని వారాల నుండి నెలలు పడుతుంది. కాబట్టి శీఘ్ర ఫలితాలు ఆశించవద్దు.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)