బెంగాల్‌లో ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ అమలు కానీయం: మమత

ABN , First Publish Date - 2021-03-25T00:25:02+05:30 IST

బెంగాల్‌లో ఎప్పటికీ జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) అమలు కానీయమని..

బెంగాల్‌లో ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీ అమలు కానీయం: మమత

బంకుర: బెంగాల్‌లో ఎప్పటికీ జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) అమలు కానీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అన్నారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బంకురాలో బుధవారంనాడు జరిగిన ర్యాలీలో మమత ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ అసోంలో 14 లక్షల మంది బెంగాలీల పేర్లు తొలగించారని, బెంగాల్‌లో మీ పేరు కూడా తొలగించవచ్చని, అయితే తాను అధికారంలో ఉన్నంతవరకూ ఆయనను (మోదీ) ఆ పని చేయనీయనని మమత అన్నారు. బెంగాల్‌లో ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీని తాము అమలు కానీయమని స్పష్టం చేశారు.


అదానీపై కూడా మమత విమర్శలు గుప్పించారు. అదానీ, ప్రధాని మోదీ సోదరులని, ఇద్దరూ రైతులకు సంబంధించిన భూములను హస్తగతం చేసుకుంటున్నారని ఆరోపించారు. 'గత ఎన్నికల్లో బీజేపీకి మీరు ఓటు వేసినప్పుడు చాలా విచారించాను. బీజేపీ నా తలమీద కర్రపెట్టి, ఇతర ప్రాంతాల నుంచి గూండాలను రప్పించి, బెంగాల్‌ను తమపరం చేసుకునే ప్రయత్నం చేసింది. వాళ్లు నా కాలికి గాయం చేశారు. అందువల్ల మిమ్మల్ని నేరుగా కలుసుకోలేకపోయాను. నాకు ఎలాంటి భయాలు లేవు. బుల్లెట్లతో కూడా పోరాడాను, అంత తేలిగ్గా భయపడను' అని మమత అన్నారు.


అలా చేస్తే... ఛేజ్ చేయండి

ఎన్నికల ముందు రోడ్లను తమ అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే మహిళలంతా వంటపాత్రలు, చీపురకట్టలతో బీజేపీని తరిమికొట్టండని మమత పిలుపునిచ్చారు. కౌంటింగ్ సమయంలో పోలీసులు తప్పిదాలకు పాల్పడకుండా చూడండని కోరారు. అక్రమ చర్యలకు పాల్పడే వారిని పట్టుకుంటే వారికి తాను రివార్డు, ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - 2021-03-25T00:25:02+05:30 IST