మా బామ్మకు ఓటెయ్యండి ప్లీజ్‌!

ABN , First Publish Date - 2021-03-22T16:28:42+05:30 IST

‘మా బామ్మకు ఓటేసి గెలిపించండి’ అంటూ ఆలందూరు శాసనసభ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి పి. వలర్మతి

మా బామ్మకు ఓటెయ్యండి ప్లీజ్‌!


- వలర్మతి మనవరాలి ప్రచారం

 చెన్నై: ‘మా బామ్మకు ఓటేసి గెలిపించండి’ అంటూ ఆలందూరు శాసనసభ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి పి. వలర్మతి మనుమరాలు ఆరతి చేస్తున్న ప్రచారం స్థానికులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రతిరోజూ వలర్మతి నియోజకవర్గంలో ఇంటింటా ప్రచారం సాగిస్తున్నారు. సెలవుదినమైన ఆదివారం ఉదయం వలర్మతితోపాటు మనుమరాలు ఆరతి ప్రచారానికి బయల్దేరింది. ప్లాస్టిక్‌తో తయారైన రెండాకులను చేతపట్టుకుని దారిలో కనబడే ఓటర్ల వద్ద నిలిచి ‘అంకుల్‌: ఆంటీ!’ అని పిలుస్తూ ‘మా బామ్మను ఓ సారి గెలిపించారు. ఆ నమ్మకంతోనే రెండోసారి పోటీ చేస్తోంది. ఓటేసి గెలిపించండి!’ అంటూ అభ్యర్థించింది. చిలుకపలుకుల్లా మాట్లాడుతున్న ఆరతి మాటలను విని మహిళా ఓటర్లు మురిసిపోయారు. ఆరతి భుజం తట్టి మీ బామ్మకు తప్పకుండా ఓటేస్తామని హామీ ఇచ్చారు. వెంటనే ఆరతి ‘చాలా థాంక్స్‌ ఆంటీ’ అంటూ మహిళలతో కరచాలనం చేసింది. ఇదే రీతిలో వలర్మతి, ఆమె మనుమరాలు గంటకుపైగా ప్రచారం కొనసాగించింది. మార్గమధ్యంలో వీరిరువురూ ఓ టీకొట్టులో ప్రచారం చేసి స్థానికులతో కలిసి టీ తాగారు. ఆ దుకాణానికి వద్దకు వచ్చిన కస్టమర్లకు కరపత్రాలను ఇచ్చి రెండాకుల గుర్తుకు ఓటేయ్యండంటూ ప్రచారం చేశారు.

Updated Date - 2021-03-22T16:28:42+05:30 IST