బెంగాల్ విజయానంతరం పీకే సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2021-05-02T21:45:54+05:30 IST

ఎన్నికల వ్యూహకర్తగా పలు రాష్ట్రాల్లో ఆయా రాజకీయ పార్టీలకు సంచలన విజయాలను..

బెంగాల్ విజయానంతరం పీకే సంచలన ప్రకటన

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్తగా పలు రాష్ట్రాల్లో ఆయా రాజకీయ పార్టీలకు సంచలన విజయాలను సాధించిపెట్టిన ప్రశాంత్ కిషోర్ తాజాగా మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి తాజాగా అసాధారణ విజయాన్ని కట్టబెట్టారు. దీంతో సహజంగానే ఆయన తదుపరి వ్యూహరచన ఏ రాష్ట్రంలో ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. అయితే అందరి ఊహలకు భిన్నంగా ఆయన సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల వ్యూహకర్తగా తాను వైదొలగాలని అనుకుంటున్నట్టు ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రకటించారు.


''ఇప్పుడు చేస్తున్న పనినే కొనసాగించాలని నేను అనుకోవడం లేదు. ఇప్పటికే చాలా చేశాను. నేను బ్రేక్ తీసుకునే సమయం వచ్చింది. జీవితంలో ఇంకేదో చేయాలి. ఈ రంగం నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను'' అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. తిరిగి రాజకీయాల్లో చేరుతారా అనే ప్రశ్నకు ''నేను విఫల రాజకీయనాయకుడిని. ప్రస్తుతం వెనక్కి వెళ్తున్నాను. ఏం చేయాలనేది చూడాలి'' అని పీకే సమాధానమిచ్చారు.


బెంగాల్ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఏకపక్షంగా వచ్చినట్టు కనిపిస్తున్నప్పటికీ, హోరాహోరీ పోరు జరిగిందన్నారు. ''చాలా ఆటుపోట్లు చవిచూశాం. ఎన్నికల కమిషన్  బీజేపీ ఎక్స్‌టెన్షన్‌గా పక్షపాతంతో వ్యవహరించి మా ప్రచారాన్ని చాలా క్లిష్టం చేసింది. అయితే మేము మాత్రం గట్టి నమ్మకంతో పనిచేశాం. అనుకున్న దాని కంటే టీఎంసీని ఎక్కువ సీట్లలో ప్రజలు గెలిపించారు'' అని కిషోర్ అన్నారు. ప్రధాని పాపులారిటీకి అర్ధం బీజేపీ అన్ని ఎన్నికల్లో గెలుస్తుందని కాదని వ్యాఖ్యానించారు.


దాచి ఉంచుకోండి...

ఈ ట్వీట్‌ను అందరూ దాచి ఉంచుకోండి...అంటూ ప్రశాంత్ కిషోర్ గత డిసెంబర్ 21న బీజేపీకి ఓ ట్వీట్‌లో సవాలు చేశారు. పశ్చిమబెంగాల్‌వో బీజేపీ రెండంకెల సీట్లు కూడా దాటదని, తన జోస్యం నిజం కాకుంటే ట్విట్టర్ నుంచి వైదొలగుతానని ఆయన సవాలు చేశారు. దీనికి బీజేపీ నేత కైలాష్ విజయవర్గీయ కౌంటర్ కూడా ఇచ్చారు. బెంగాల్‌లో బీజేపీ సునామీ నడుస్తోందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దేశం ఒక పోల్ స్ట్రాటజిస్ట్‌‌కు దూరమవుతుందని తిప్పికొట్టారు.

Updated Date - 2021-05-02T21:45:54+05:30 IST