కేరళ మహిళలకు భలే తాయిలాలు
ABN , First Publish Date - 2021-03-21T07:15:11+05:30 IST
కేరళలో ఎన్నికల వేళ ప్రతిపక్ష యూడీఎఫ్ మహిళలకు తాయిలాలను ప్రకటించింది. ‘‘40-60ఏళ్ల గృహిణులకు నెలకు రూ.2వేల పింఛను ఇస్తాం

తిరువనంతపురం, మార్చి 20: కేరళలో ఎన్నికల వేళ ప్రతిపక్ష యూడీఎఫ్ మహిళలకు తాయిలాలను ప్రకటించింది. ‘‘40-60ఏళ్ల గృహిణులకు నెలకు రూ.2వేల పింఛను ఇస్తాం. అసంఘటితరంగంలోని మహిళలకు ఆరు నెలల ప్రసూతి సెలవులను మంజూరు చేస్తాం. గిరిజన మహిళలకు ప్రసవానికి 6 నెలల ముందు నుంచీ నెలకు రూ.3వేల చొప్పున అందజేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలకు మాతృమూర్తులకు రెండేళ్ల వయసు సడలిస్తాం. మహిళా ఎంట్రప్రెన్యూర్లకు రూ.10లక్షల వడ్డీలేని రుణాన్ని ఇస్తాం. శబరిమలైకు మహిళలందరికీ అనుమతిస్తామన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో చెలరేగిన హింసను చల్లబరుస్తాం’’ అని వెల్లడించింది.
గృహిణులకు పింఛన్: లెఫ్ట్ ఫ్రంట్
మహిళా ఓటర్లకు భారీగా గాలం వేస్తూ గృహిణులందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు కేరళలోని వామపక్ష కూటమి హామీ ఇచ్చింది. సమాజంలోని వివిధ వర్గాలకు ఇస్తున్న పెన్షన్ మాత్రం నెలకు రూ.1600 నుంచి రూ.2500కు పెంచుతున్నట్లు మేనిఫెస్టోను విడుదల చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎ.విజయరాఘవన్, సీపీఐ కార్యదర్శి కనం రాజేంద్రన్ ప్రకటించారు. యువతకు ఐదేళ్లలో 40 లక్షల దాకా ఉద్యోగాలు కల్పిస్తామని, ఐదేళ్లలో రాష్ట్రంలో 15,000 స్టార్ట్‌పలు ప్రారంభిస్తామని కూడా అందులో వాగ్దానం చేశారు. ఐటీ, ఫార్మా, బయోటెక్, ఎలకా్ట్రనిక్స్ రంగాల్లో రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెడతామన్నారు.