బెంగాల్‌కు స్వాతంత్ర్యం కావాలి: జేపీ నడ్డా

ABN , First Publish Date - 2021-04-25T21:12:01+05:30 IST

దేశంలో కోవిడ్ పరిస్థితిని అదుపు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వంపై మమత విరుచుకుపడుతున్నారు. మరి అదే కోవిడ్‌పై ప్రధానమంత్రి సమావేశానికి పిలిస్తే ఎందుకు వెళ్లలేదు? ఆమెను ఎవరు ఆపారు?

బెంగాల్‌కు స్వాతంత్ర్యం కావాలి: జేపీ నడ్డా

కోల్‌కతా: మమతా బెనర్జీ దౌర్జన్యం నుంచి విముక్తులు కావాలని పశ్చిమ బెంగాల్ ప్రజలు కోరుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. బెంగాల్‌లోని మాణిక్చక్‌లో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


‘‘మమతా బెనర్జీ.. బెంగాల్ ప్రజలకు ఎవరికీ భయపడబోరు. మీ దౌర్జన్యం నుంచి వాళ్లు విముక్తులు కావాలనుకుంటున్నారు. వాళ్లు స్వాతంత్ర్యం కోరుకుంటున్నారు. వచ్చే 7వ, 8వ విడత పోలింగ్‌లో కమలం వైపు మరింత మొగ్గు చూపబోతున్నారు. బెంగాల్‌లో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనే’’ అని నడ్డా అన్నారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘దేశంలో కోవిడ్ పరిస్థితిని అదుపు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వంపై మమత విరుచుకుపడుతున్నారు. మరి అదే కోవిడ్‌పై ప్రధానమంత్రి సమావేశానికి పిలిస్తే ఎందుకు వెళ్లలేదు? ఆమెను ఎవరు ఆపారు? ఆమె అహంకారమే కదా ప్రధాని సమావేశానికి హాజరు కాకుండా అడ్డుకున్నది? బెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం చేరువ కావకపోవడానికి కూడా ఇదే కారణం. బెంగాల్‌కు ప్రధానికి మధ్య అడ్డంకి మమత అహంకారమే’’ అని విమర్శలు గుప్పించారు.

Updated Date - 2021-04-25T21:12:01+05:30 IST