'అబద్ధాల' మేనిఫెస్టో అది: మోదీ

ABN , First Publish Date - 2021-03-21T21:01:07+05:30 IST

అధికారంలోకి రావడమే ఏకైక ఉద్దేశంగా కాంగ్రెస్ అబద్ధాలతో హామీలు గుప్పిస్తోందని ప్రధాని..

'అబద్ధాల' మేనిఫెస్టో అది: మోదీ

గౌహతి: అధికారంలోకి రావడమే ఏకైక ఉద్దేశంగా కాంగ్రెస్ అబద్ధాలతో హామీలు గుప్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అసోం అభ్యున్నతకి ఒక విజన్ కానీ, సిద్ధాంతం కానీ ఆ పార్టీకి లేవని ఆరోపించారు. అసోంలోని బోకఖత్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, అసోం ప్రజలకు కాంగ్రెస్ 5 హామీలు ఇచ్చిందని, నిజానికి బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడమే కాంగ్రెస్ ఏకైక మంత్రమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తహతహలాడుతోందన్నారు. ఖాళీ ఖజానాను నింపుకోవడమే వారి లక్ష్యమని విమర్శించారు. వారికి ఎలాంటి దూరదృష్టి లేదని అన్నారు.


కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న 5 హామీలను నమ్మవద్దని ప్రధాని సూచించారు. అవన్నీ తప్పుడు వాగ్దానాలని అన్నారు. 'కాంగ్రెస్ హయాంలో అసోంలో శాంతియుత పరిస్థితి ఉండేదా అన్నదే ప్రశ్న. ఇప్పుడు ఎన్డీయే హయాంలో అసోంలో శాంతి, సుస్థిరత నెలకొంది. కాంగ్రెస్ పాలనలో అసోంను లూటీ చేయాలనే ఆలోచనే ఉండేది. ఎన్డీయే పాలనలో రాష్ట్రం అభివృద్ధిపరంగా కొత్తపుంతలు తొక్కుతోంది' అని మోదీ అన్నారు.


 ప్రపంచ ప్రఖ్యాత ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను కాంగ్రెస్ కాపాడలేకపోయేదని, బీజేపీ పాలనలో అక్రమ వేటగాళ్లను జైళ్లకు పంపిందని అన్నారు. అసోం సంస్కృతి, సంప్రదాయాలు, భాష, ఉత్సవాలు దేశానికి గర్వకారణమని అన్నారు. బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని కాపాడటానికి తమ పార్టీ కష్టించి పనిచేస్తుందని తాను భరోసా ఇస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు.


గత ఐదేళ్లలో అసోంలో అటవీ ప్రాంతం విస్తరించామని, ఒక్క చమురు, గ్యాస్ రంగంలో రూ.40,000 కోట్లు ఇన్వెస్ట్ చేశామని, అసోం దర్శన్ పేరుతో 9,000 నామ్‌గర్‌లు, ఇతర మత సంస్థల్లో మౌలిక వసతులు కల్పించామని ప్రధాని చెప్పారు. టీ కార్మికులను ఏళ్ల తరబడి కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, తాము టీ వర్కర్ల విద్య, ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. తాము వాగ్దానం చేసిన రూ.351 రూపాయల రోజువారీ వేతనం ఇవ్వలేక పోవడంపై టీ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేశారని, మరోసారి తమకు అధికారం ఇస్తే టీ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించేందుకు కృషి చేస్తామని చెప్పారు. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మూడు విడతలుగా పోలింగ్ జరుగనుంది. తొలి విడత పోలింగ్ ఈనెల 27న జరుగుతుంది. ఫలితాలు మే 2న వెలువడుతాయి.

Updated Date - 2021-03-21T21:01:07+05:30 IST