హిందూ మేథావులు, సాధువులకు ఆలయాల నిర్వహణ అప్పగింత.. బీజేపీ మేనిఫెస్టో

ABN , First Publish Date - 2021-03-23T01:42:39+05:30 IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ సోమవారంనాడు ...

హిందూ మేథావులు, సాధువులకు ఆలయాల నిర్వహణ అప్పగింత.. బీజేపీ మేనిఫెస్టో

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ సోమవారంనాడు విడుదల చేసింది. హిందూ ఆలయాల నిర్వహణ హిందూ మేథావులు, సాధువులకు అప్పగిస్తామని పార్టీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. మేథావులు, సాధువులతో ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి నిర్వహణా బాధ్యతలను అప్పగిస్తామని తెలిపింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, వీకే సింగ్ చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


బలవంతంగా కానీ, ప్రలోభ పెట్టి కానీ మత మార్పిడులు చేయకుండా కఠినమైన మతమార్పిడి నిరోధక చ్టటాన్ని తీసుకువస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. తమిళనాడులోని శరణార్ధుల శిబిరాల్లో జీవిస్తున్న శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం కల్పించేందుకు సిఫారసు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో 50 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని, రైతుల తరహాలో మత్స్యకారులకు ఏటా రూ.6,000 సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. సులభతర వాణిజ్యంలో దక్షిణాదిలోనే తమిళనాడును నెంబర్-1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మేనిఫెస్టో పేర్కొంది. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెడతామని, అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని, స్వచ్ఛమైన మంచినీటిని పైప్‌లైన్ల ద్వారా ఉచితంగా ప్రతి ఇంటికి అందిస్తామని, ఎలక్ట్రానిక్ రేషన్ కార్డు ఓటర్లందరికీ తమిళనాడు పీడీఎస్ ద్వారా సరకులను నేరుగా ఇంటికే అందజేస్తామని మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది.

Updated Date - 2021-03-23T01:42:39+05:30 IST