టీఎంసీ దిగ్గజాలను చేర్చుకున్నా లాభపడని బీజేపీ

ABN , First Publish Date - 2021-05-02T21:52:37+05:30 IST

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని

టీఎంసీ దిగ్గజాలను చేర్చుకున్నా లాభపడని బీజేపీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్ర నేతలు పాల్గొన్నారు. మరోవైపు టీఎంసీ నుంచి ప్రముఖ నేతలను చేర్చుకున్నారు. అయినప్పటికీ బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. ప్రముఖులను బరిలో దించినప్పటికీ టీఎంసీ కోటల్లోకి కన్నెత్తి చూడటం సాధ్యం కాలేదు. టీఎంసీకి రాజీనామా చేసి, అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరినవారిలో అత్యధికులకు టిక్కెట్లు ఇచ్చినప్పటికీ బీజేపీ ప్రయోజనం పొందలేకపోయింది. 


మమత బెనర్జీ మంత్రివర్గంలో అటవీ శాఖ మంత్రిగా పని చేసిన రాజీబ్ బెనర్జీ ఈ ఏడాది జనవరిలోనే బీజేపీలో చేరారు. ఆయన తన ప్రత్యర్థి, టీఎంసీ అభ్యర్థి కల్యాణ్ ఘోష్ కన్నా దాదాపు 4 వేల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. హౌరా మాజీ మేయర్ రతిన్ చక్రబొర్తి టీఎంసీ నుంచి ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన షిబ్‌పూర్ స్థానంలో టీఎంసీ నేత మనోజ్ తివారీ కన్నా ఆరు వేల ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. 


బీసీసీఐ మాజీ చీఫ్ జగ్‌మోహన్ దాల్మియా కుమార్తె బైశాలి దాల్మియా బీజేపీ అభ్యర్థిగా బాలీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమె టీఎంసీ అభ్యర్థి రాణా ఛటర్జీ కన్నా సుమారు ఏడు వేల ఓట్ల తేడాతో వెనుకబడ్డారు. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే ప్రబిర్ కుమార్ ఘోసల్ బీజేపీలో చేరి, ఉత్తరపర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు, టీఎంసీ అభ్యర్థి కాంచన్ ములిక్ కన్నా వెనుకబడి ఉన్నారు. 


యాక్టర్ రుద్రనీల్ ఘోష్ కూడా టీఎంసీ నుంచి బీజేపీలో చేరారు. రుద్రనీల్ భవానీపూర్ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ కన్నా 10 వేల ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. 


Updated Date - 2021-05-02T21:52:37+05:30 IST