AP: ఉన్న ఉద్యోగులకు కనీస వేతనాల్లేవ్.. కానీ 956 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ABN , First Publish Date - 2021-10-21T15:46:17+05:30 IST
ఉన్న ఉద్యోగులకు కనీస..

అమరావతి(ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలికా ఉన్నత పాఠశాలల్లోని(కేజీబీవీ) కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు కనీస వేతన స్కేలు ఇస్తామన్న హామీని అమలు చేయని ప్రభుత్వం.. ఈ పాఠశాలల్లో మళ్లీ కొన్ని కొత్త పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీచేస్తోంది. కేజీబీవీల్లో కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు 2018లో జీతాలు పెంచారు. రూ.14వేలు ఉన్న జీతాన్ని రూ.22వేలు చేశారు. రూ.20వేలు జీతం ఉండే హెడ్‌మాస్టర్‌కు రూ.25వేలు చేశారు. తర్వాత 2019 ఫిబ్రవరిలో ప్రభుత్వం జీవోనెం.24ను విడుదల చేసింది.
వీరందరికీ కనీస టైమ్ స్కేల్ ఇవ్వాలని స్పష్టం చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరందరికీ కనీసవేతన స్కేలు ఇస్తామని శాసనమండలిలో వాగ్దానం చేసింది. ఏడాదికి రూ.132కోట్లు మాత్రమే అదనంగా ఖర్చవుతుందని తెలిపింది. టైమ్‌స్కేల్ వర్తింపచేస్తే రూ.22వేలు ఉన్న జీతం రూ.29వేలు అవుతుంది. హెడ్‌మాస్టర్లకు కూడా కొంత పెరుగుతుంది. అయితే ఇప్పటివరకూ దీన్ని అమలు చేయలేదు.
గిరిజన ప్రాంతాల్లో బాలికలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ పాఠశాలలను ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం 352 కేజీబీవీ పాఠశాలలున్నాయి. వీటిల్లో సగం చోట్ల ఆరు నుంచి పదో తరగతి వరకు ఉండగా, కొన్నిచోట్ల ఇంటర్ కూడా బోధన చేస్తున్నారు. హామీ మేరకు వారికి కనీస టైమ్ స్కేల్ అమలుచేయని ప్రభుత్వం.. ఇప్పుడు కొత్తగా 389 సీఆర్‌టీ, 569 పీజీటీ పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. వీటిని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీచేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్ర స్థాయిలోనే ఈ పోస్టులను భర్తీచేస్తామని తెలిపింది.