JEEలో మెయిన్, అడ్వాన్స్‌డ్ రెండు రాయాలా?
ABN , First Publish Date - 2021-10-11T16:31:41+05:30 IST
నేను ఎంపీసీతో..
ఎన్విరాన్‌మెంటల్ జాగ్రఫీ చదవాలనుకుంటున్నా
నేను ఎంపీసీతో ఇంటర్ చేసి ఇప్పుడు బీబీఏ చదువుతున్నాను. ఎన్విరాన్‌మెంటల్ జాగ్రఫీ చదవాలనుకుంటున్నాను. డిగ్రీ తరవాత ఎమ్మెస్సీ జాగ్రఫీ చేయవచ్చా? లేదా సంబంధిత పీజీ ఏదైనా చేయవచ్చా తెలుపగలరు?
- బాలకృష్ణ వర్మ, సత్తుపల్లి
మీరు పదో తరగతి తరవాత జాగ్రఫీ చదవలేదు. కాబట్టి జాగ్రఫీలో పీజీ చేసే అవకాశాలు తక్కువ. అయితే ఏ డిగ్రీ చేసినవారైనా ఎన్విరాన్‌మెంట్, సస్టయినబుల్ డెవలప్‌మెంట్‌లో పీజీ చేయవచ్చు. ఎంఐటీవలర్డ్ పీస్, నలంద, స్వరాజ్ యూనివర్సిటీ, తెరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్, భువనేశ్వర్‌లోని జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఈ కోర్సు ఉంది. సైన్స్ నుంచి మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేషన్‌కు మారిపోయారు. అక్కడి నుంచి ఎన్విరాన్‌మెంట్ స్టడీస్ గురించి ఆలోచిస్తున్నారు. ఇంత భిన్నమైన చదువులు ఉంటే కెరీర్‌లో అంతగా నిలకడ ఉండకపోవచ్చు. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
జేఈఈలో మెయిన్, అడ్వాన్స్‌డ్ రెండు రాయాలా?
మా బంధువుల అమ్మాయికి ఓవర్సీస్ సిటిజన్‌షి్‌ప ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డు ఉంది. ప్రస్తుతం ఇక్కడ సీబీఎ్‌సఈలో 12వ తరగతి చదువుతోంది. తను జేఈఈలో మెయిన్, అడ్వాన్స్‌డ్ రెండు రాయాలా? ఒక్క అడ్వాన్స్‌డ్ రాస్తే సరిపోతుందా?
- ఎం.వైష్ణవి, సికింద్రాబాద్
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నేరుగా రాయడం సాధ్యం కాదు. ప్రస్తుతానికి జేఈఈ మెయిన్‌లో టాప్ రెండున్నర లక్షల మందిని మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తున్నారు. మెయిన్‌లో ర్యాంకుతో ఎన్‌ఐటీ , ఐఐఐటీ, ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న ఇంజనీరింగ్ సంస్థల్లో చేరవచ్చు. అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్‌తో ఐఐటీల్లోకి తోడు ఇంకొద్ది సంస్థల్లో చేరవచ్చు. పూర్తి వివరాల కోసం www.jeemain.nic.in వెబ్‌సైట్ చూడొచ్చు.
కమర్షియల్ పైలెట్ శిక్షణ సంస్థలు ఎక్కడ?
మా అమ్మాయి కామర్స్‌తో ఇంటర్ చదువుతోంది. కానీ ఇప్పుడు కమర్షియల్ పైలెట్ కోర్సు చదువుతా అంటోంది. దీనికి శిక్షణ ఇచ్చే సంస్థలు ఎక్కడ ఉన్నాయి?
- కావ్య, విజయవాడ
కమర్షియల్ పైలెట్ లైసెన్స్ రావాలంటే మేథ్స్, ఫిజిక్స్‌లతో ఇంటర్ పూర్తిచేసి ఉండాలి. తను ఇంటర్‌లో ఈ సబ్జెక్టులు తీసుకోలేదు. కాబట్టి ప్రస్తుత చదువును కొనసాగిస్తూనే సొంతగా ఈ రెండు సబ్జెక్టులకు కోచింగ్ తీసుకుని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్’(nios.ac.in) ద్వారా 12వ తరగతి పరీక్షలు రాసి పాస్ కమ్మని చెప్పండి. కాకపోతే ఒకేసారి రెండు కోర్సులు చేసినట్లు అవుతుంది.
భారతదేశంలోనూ, విదేశాల్లోనూ ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. అయితే ఈ కోర్సు చాలా ఖర్చుతో కూడుకున్నది. మీ ఆర్థిక స్థోమతను అనుసరించి నిర్ణయం తీసుకోండి. సీఏఈ ‘ఆక్స్‌ఫర్డ్ ఏవియేషన్ అకాడమి’, ‘ఫ్లైటెక్ ఏవియేషన్ అకాడమి’, ‘హెచ్‌ఏఎల్ ప్రవర ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్’, ‘ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమి’(ప్రభుత్వ సంస్థ), ముంబైలోని ‘అకాడమి ఆఫ్ కార్‌వర్ ఏవియేషన్’ తదితరాలు ఉన్నాయి.
మీక్కూడా ఏవైన సందేహాలు ఉంటే ఈ కింది అడ్రస్‌కు లేఖ పంపవచ్చు..
చిరునామా: వివరాలు ఇవిగో, కేరాఫ్ ఎడ్యుకేషన్ డెస్క్, ఆంధ్రజ్యోతి,
ప్లాట్ నెం.76, రోడ్ నెం.70, అశ్వినీ ఎన్‌క్లేవ్, హుడా హైట్స్,
జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్-500 033