‘నేను సైతం....’ ఏదో ఒకటి చేయాలన్న ఆకాంక్ష మీకు ఉందా..? అయితే మీకోసమే ఇది..!

ABN , First Publish Date - 2021-10-25T16:05:06+05:30 IST

‘నేను సైతం....’ ఏదో చేయాలన్న ఆకాంక్ష..

‘నేను సైతం....’ ఏదో ఒకటి చేయాలన్న ఆకాంక్ష మీకు ఉందా..? అయితే మీకోసమే ఇది..!

సేవాభిలాషులకు ఆప్షన్‌.. సోషల్‌ వర్క్‌


వరదలు లేదంటే మరోరకం బాధితులకు సహాయం అందిస్తున్న ఫొటోలు మీడియాలో, సామాజిక మాధ్యమల్లో కనిపించినప్పుడు మనలో సానుభూతి ఉప్పొంగుతుంది. ‘నేను సైతం....’ ఏదో చేయాలన్న ఆకాంక్ష కలుగుతుంది. ఒక్క ఇమేజ్‌ కూడా ఎన్నో కథలు చెబుతుంది. ఆ కథేంటో అన్న ఉత్సుకత కలిగిస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సింపుల్‌గా ‘సోషల్‌ వర్క్‌’ గా చెప్పవచ్చు. దీని పూర్వపరాలు, అవకాశాలు ఇతర అంశాలు తెలుసుకుందాం.


సోషల్‌ వర్క్‌ అనేది పూర్తిగా ఒక వృత్తి. సమాజానికి సేవ అందించాలనే వ్యక్తులకు ముఖ్యంగా అందులో ఆనందాన్ని వెతుక్కునే లక్షణం ముఖ్యం. సహాయం కోసం అర్రులు చాస్తున్న జనాలపై సానుభూతి ఉండాలి. అలాంటివారికి ఎలా సహాయపడగలమా అనే ఆలోచన ధోరణి ఉండాలి. ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని సాధ్యమైనంత మేర సహకారం అందించే గుణం ఉండాలి. అలాంటి వ్యక్తులు మాత్రమే ఎంచుకోదగ్గ ప్రొఫెషన్‌ సోషల్‌ వర్క్‌.


విధులు

- సహాయం కోరే వ్యక్తులకు సహకరించాలి. 

- దారుణమైన పరిస్థితుల్లో ఉండి, సహాయం కోరి వచ్చే క్లయింట్లకు తోడ్పాటును అందించాలి. 

- పిల్లలపై అమానుషం, మానసికంగా తలెత్తే సమస్యలతో సతమతమయ్యే వ్యక్తుల విషయంలో వెంటనే స్పందించాలి. 

- సైకో థెరపీ సేవలు

- దివ్యాంగులు, సీరియస్‌గా అస్వస్థతకు గురైన వ్యక్తులకు సేవలు

- సహకారం అందించే గ్రూపులు, కమ్యూనిటీ సంస్థలు, పాలసీ మేకర్లకు సహకారం అందించే వ్యవహారాలు, సామాజిక పరిస్థితులను మెరుగుపర్చే కార్యక్రమాల రూపకల్పన, ప్రత్యక్షంగా పాల్గొనడం వంటి చర్యల్లో నిమగ్నం కావాలి.  


నేపథ్యాలకు మించి

దాతృత్వం అలాగే సామాజిక సేవ(సోషల్‌ వర్క్‌)పై ఒక ఎన్‌జీవో ఇటీవల సర్వేను నిర్వహించింది. 14 నుంచి 20 ఏళ్ళ లోపు వయస్కులు 500 మందిని కలిసినప్పుడు బైటపడిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అకడమిక్‌ నేపథ్యం దాతృత్వం, సోషల్‌ వర్క్‌పై నేరుగా ఎలాంటి ప్రభావం చూపటం లేదు. వేర్వేరు కోర్సులు చేసిన వ్యక్తులంతా ఈ రెంటిపై ఆసక్తి కనబరిచారు. కుటుంబం, సన్నిహితుల ప్రభావానికి తోడు వ్యక్తిగతంగా ఏదో చేయాలన్న ఆసక్తి వారిని ఈ రెంటివైపు నెడుతోంది. అలాగే ఎన్‌జీవో(స్వచ్చంధ సంస్థ)లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని కూడా భావిస్తున్నారు. పారదర్శకత, విశ్వసనీయత, జవాబుదారీతనం కూడా వాటికే ఎక్కువని కూడా మెజారిటీ యువత అభిప్రాయపడింది. అఫ్‌కోర్స్‌, కొందరు ఎన్‌జీవోల పాత్రపై సంశయాలను వ్యక్తం చేయలేకపోలేదు. 


సాధారణంగా సోషల్‌వర్క్‌పై కొన్ని అపోహలు ఉంటాయి. అయితే దీనికి అర్థం, పరమార్థం ఉంది. సోషల్‌ వర్క్‌ అంటే ఫ్రీగా ఉన్న సమయంలో చేసుకునే పని అనుకుంటారు. అయితే అది వాస్తవం కాదు. లక్షిత గ్రూపు లేదంటే సంబంధిత వ్యక్తులకు ప్రయోజనం కలిగించే ప్రొఫెషన్‌. ఇతరులకు సహాయం చేయడంలోనే వ్యక్తిగతంగానూ, ప్రొఫెషనల్‌గానూ ఎదిగే అవకాశం ఉంటుంది. 


కోర్సుగా

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు సోషల్‌ వర్క్‌లో ఇమిడిపోవచ్చు. అయితే సోషల్‌ వర్క్‌ను బ్యాచిలర్‌ స్థాయిలో అందించే విద్యా సంస్థలు ఉన్నాయి. యూనివర్సిటీలు దీన్ని ఎమ్మే సోషల్‌ వర్క్‌, మాస్టర్‌ సోషల్‌ వర్క్‌గా కూడా అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన వర్సిటీలకుతోడు మరికొన్ని ప్రధాన సంస్థలు

- టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌

- డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ

- డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, ఢిల్లీ యూనివర్సిటీ, న్యూఢిల్లీ

- కాలేజ్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, నిర్మల్‌ నికేతన్‌, ముంబై

- మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, చెన్నై

- డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌, కాలికట్‌ యూనివర్సిటీ


ఎంఎస్‌డబ్ల్యులో స్పెషలైజేషన్‌ విషయానికి వస్తే, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌, క్రిమినాలజీ అండ్‌ కరెక్షన్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఫ్యామిలి అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌, అర్బన్‌ అండ్‌ రూరల్‌ కమ్యూనిటీ, ఇండస్ట్రియల్‌ రిలేషన్‌ అండ్‌ లేబర్‌ వెల్ఫేర్‌ వంటివి ఉంటాయి. పీజీ తరవాత పీహెచ్‌డీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. 


ఉపాధి

ఆరంభంలో తక్కువ ఉన్నప్పటికీ అనుభవంతో మంచి మొత్తాలు అందుతాయి. కార్పొరేట్‌ రంగంలో మంచి వేతనాలు లభిస్తాయి. వివిధ సేవలు అందించే ఎన్‌జీవోలు, ఆసుపత్రులు, క్లినిక్కులు, ఎడ్యుకేషన్‌, మానవ హక్కుల సంస్థలు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. సోషల్‌ వర్కర్‌, లేబర్‌ వెల్ఫేర్‌ స్పెషలిస్ట్‌, టీచర్‌, సోషల్‌ సెక్యూరిటీ అధికారి, క్రిమినాలజీ స్పెషలిస్ట్‌, కౌన్సెలర్‌ వంటి పోస్టులు లభిస్తాయి. అనుభవంతో సొంతంగా స్వచ్చంధ సంస్థలు స్థాపించుకోవచ్చు. 
Updated Date - 2021-10-25T16:05:06+05:30 IST