నాన్ ఇంజనీరింగ్ అభ్యర్థులు వీటిపై దృష్టిపెడితే.. క్యాట్‌లో విజయం సాధించవచ్చు..!
ABN , First Publish Date - 2021-10-25T16:36:11+05:30 IST
ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న విద్యార్థులు మాత్రమే..

బేసిక్స్‌తో ఆరంభిస్తే విజయం మీదే!
ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న విద్యార్థులు మాత్రమే క్యాట్‌లో సక్సెస్ కాగలరన్న భ్రమ ఉంది. అయితే అది నిజం కాదు. ఇందులో రాణించే నాన్ ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఐఐఎంలు సైతం భిన్నత్వం కోసం ఇంజనీరింగేతర అభ్యర్థులను తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాన్ ఇంజనీరింగ్ అభ్యర్థులు క్యాట్‌లో విజయం సాధించేందుకు వేటిపై దృష్టిపెట్టాలో చూద్దాం.
ఐఐఎం అడ్మిషన్లలో ఇంజనీరింగ్ విద్యార్థులు అగ్రభాగాన ఉండేవారన్నది ఒకప్పటి మాట. ఇప్పుడా పరిస్థితి లేదు. ఐఐఎంలు సైతం వేర్వేరు డిసిప్లిన్లకు చెందిన విద్యార్థులతో క్యాంప్‌సలను నింపాలని చూస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తమ తరగతి గదుల్లో డైవర్సిటీ కోసం ఎదురు చూస్తున్నాయి. కామర్స్, ప్యూర్ సైన్సెస్, సైకాలజీ, మెడికల్ సైన్సెస్, ఫార్మసీ తదితర కోర్సులు చదివిన విద్యార్థులు ప్రస్తుతం తాము కోరుకున్న ఐఐఎం క్యాంప్సల్లోకి చేరుతున్నారన్నది యథార్థం. ఈ పరిణామాన్ని ఇంజనీరింగేతర విద్యార్థులు మొదట గుర్తించాలి.
తమకు తాము బెస్ట్ అని మొదట భావించాల్సిన అవసరం ఇంజనీరింగేతర విద్యార్థులకు ఉంది. ఆ క్రమంలో మొదట క్యాట్‌ను క్లియర్ చేసుకోవాలి. అందుకోసం క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీని పెంచుకోవాలి. ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ పెరగాలి. అలాగే మనవంతు కృషి బలంగా చేస్తే, మన వాటా ఎక్కడికీ పోదని నమ్ముకోవాలి.
లక్ష్యంలోనే లోపం ఉండకూడదు
లక్ష్యంపై మనసు పెట్టడంలోనే లోపం ఉంటే కుదరదు. ప్రాక్టీస్ కోసం క్యాట్ అనుకున్నా ఇబ్బందే. టైమ్, మనీ వృథా కావడం తప్ప మరో ప్రయోజనం లభించదు. ఐఐఎంలో సీటు నాదే అనుకుని మరీ గట్టిగా కృషి చేయాలి. అందుబాటులో ఉన్న సమయాన్ని, వనరులను సద్వినియోగం చేసుకోవాలి. టైమ్ టేబుల్ నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా పట్టుదలతో ప్రాక్టీస్ చేయాలి.
క్యాట్‌లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయన్నది మొదట తెలుసుకోవాలి. వాటిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించుకోవాలి. పరీక్ష విధానం, సిలబస్, ఒక్కో ఏరియాలో అడిగే ప్రశ్నల సంఖ్య, ప్రతి సెక్షన్‌కు ఇచ్చే సమయం తెలుసుకోవాలి. తద్వారా క్యాట్‌లో విజయసాధనకు ఏవి అవసరం, వ్యూహం ఎలా ఉండాలి, అలాగే లాజికల్ అప్రోచ్ అవగతమవుతాయి.
ప్రిపరేషన్‌ను ఎంత తొందరగా ఆరంభిస్తే అంత మంచిది. పరీక్షకు చాలా తక్కువ రోజులు ఉన్నందున అభ్యర్థులు ఆ పనిని ఇప్పటికే ఆరంభించి ఉంటారు. ఎగ్జామ్‌లోని ప్రతి ఏరియాకు సంబంధించిన ప్రాథమిక కాన్సెప్ట్‌లను మొదట అర్థం చేసుకోవాలి. పరీక్ష దగ్గర పడుతున్నందున ఎగ్జామ్‌లో ముఖ్యంగా ఆ ఏరియాలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారన్నది గమనించాలి. అదీ టెన్త్ సిలబస్‌లో వాటిని ఎలా అడిగారన్నది గుర్తు తెచ్చుకుని అక్కడితో నేర్చుకోవడం మొదలుపెట్టాలి. అప్పుడే ఆ కాన్సెప్ట్‌పై పట్టు లభిస్తుంది.
వాస్తవానికి నాలుగైదు నెలల క్రితమే ఈ పని పూర్తి చేసి ఉండాలి. అప్పుడే ఈ టెస్ట్‌కు అవసరమైనంత సమయాన్ని మీరు కేటాయించగలుగుతారు. ఎందుకంటే మరోవైపు ఆఖరు సంవత్సరం పరీక్షలు ఒకవైపు తరుముతూ ఉంటాయి. అక్కడ కోర్సును అనకొండలా పెంచుకుంటూ వెళితే అసలుకే ప్రమాదం ఏర్పడుతుంది. రెగ్యులర్ కోర్సు కరికులమ్‌కు అనుకూలంగా ఒక పక్క ప్రిపేరవుతూనే మరోవైపు క్యాట్‌పై పట్టు సాధించాలంటే ముందుస్తు ప్రిపరేషన్, అందుకు తగు వ్యూహం, సాధన అవసరమవుతాయి. అదే ఉద్యోగి అయితే క్యాట్ కోసం జాబ్‌ను విడిచిపెట్టడం కుదరదు. ఉద్యోగంలో ఉంటూ ప్రిపరేషన్ అంటే రోజుకు ఇరవై నాలుగు గంటలు, వారానికి ఏడు రోజులు ఎప్పటికీ సరిపోవు.
మాక్ టెస్టులు మస్ట్
అచ్చంగా క్యాట్ మాదిరిగా నిర్వహించే మాక్ టెస్టులకు హాజరుకావడం తప్పనిసరి. అప్పుడే సమయానికి ఉన్న ప్రాధాన్యం తెలుస్తుంది. టైమ్ మేనేజ్మెంట్పై స్పష్టమైన అవగాహన కలుగుతుంది. జాతీయ స్థాయిలో జరిగే టెస్టులైతే మరీ మంచిది. బలాలు, బలహీనతలు తెలుసుకునేందుకు తద్వారా మీ స్కోర్‌ను సాధ్యమైనంత ఎక్కువ చేసుకునేందుకు ఉపయోగపడతుంది.
ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం మరొకటి ఉంది. ఇంజనీరింగేతర నేపథ్యం ఉన్నంత మాత్రాన వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. స్ర్కాచ్ నుంచి మేథ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. బేసిక్స్‌తో మొదలు పెట్టి, వేగం పెంచుకుని, చివరకు వ్యూహం రచించుకునే స్థాయికి నాన్ మేథ్స్ వ్యక్తులు సైతం వెళ్ళవచ్చు. అదేమంత కష్టమైన లేదంటే అసాధ్యమైన వ్యవహారం ఎంతమాత్రం కాదు. వెర్బల్ విభాగం అందరికీ కష్టంగానే ఉంటుంది. అడిగిన ప్రశ్నలో ఉన్న సంక్లిష్టతను అర్థం చేసుకోవడం, తదుపరి ప్రక్రియ చివరకు సమాధానం రాబట్టడం వరకు ఇంజనీరింగ్ - నాన్ ఇంజనీరింగ్ మధ్య పెద్ద తేడా ఏమీ ఉండదు. ఫలితం తరవాత, ఐఐఎం నుంచి కాల్ వస్తే చాలు, అంతా ఒక్కటే అవుతారు. నిరంతర కృషి అంతకు మించి పట్టుదల ఉంటే ఐఐఎంలో అడుగుపెట్టకుండా, మీ కల నెరవేరకుండా ఎవ్వరూ ఆపలేరు అన్న విషయాన్ని నాన్ ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
- ఎం.నాగప్రసన్న, సీనియర్ వెర్బల్ ఫ్యాకల్టీ, టైమ్, హైదరాబాద్