సైనిక్‌ స్కూళ్లలో ప్రవేశానికి ఇలా సిద్ధం కండి..!

ABN , First Publish Date - 2021-11-01T15:55:52+05:30 IST

దేశవ్యాప్తంగా ఉన్న..

సైనిక్‌ స్కూళ్లలో ప్రవేశానికి ఇలా సిద్ధం కండి..!

దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో ఆరోతరగతి, తొమ్మిదోతరగతి ప్రవేశాలకు ఉద్దేశించిన ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎస్ఎస్ఈఈ) 2022 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. తొమ్మిదోతరగతిలో ప్రవేశానికి బాలురు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సైనిక పాఠశాలల పరిధుల్లోని స్థానిక విద్యార్థులకు 67 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 33 శాతం సీట్లకు దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడవచ్చు. ప్రతి సైనిక పాఠశాలలో ఆరోతరగతిలో 10 శాతం/ గరిష్ఠంగా 10 సీట్లను బాలికలకు ప్రత్యేకించారు. 


సైనిక దళాల్లోని ఓపెన్‌ ఆఫీసర్‌ క్యాడర్‌ పోస్టుల మధ్య ప్రాంతీయ అసమానతలను నివారించాలని, అదేవిధంగా విద్యాపరంగా, శారీరకంగా, మానసికంగా బాలలను తీర్చిదిద్దాలనే ప్రధాన ఆశయంతో దేశంలో సైనిక్‌ స్కూళ్ల వ్యవస్థకు నాంది పలికారు. జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఈ ఆలోచన మొగ్గ తొడిగింది. బోధనతోపాటు దేశ సైనిక వ్యవస్థకు ఉపయోగపడేలా మిలిటరీ శిక్షణను కూడా ఇవ్వడం ఈ స్కూళ్ల ప్రత్యేకత. తద్వారా చదువు పూర్తయిన విద్యార్థులు సైనిక దళాల్లో వివిధ స్థాయుల్లో చేరి దేశ సేవకు తమ వంతు సహకారం అందించగలుగుతారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక్‌ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో రెండు ఆంధ్రప్రదేశ్‌లోని కోరుకొండ, కలికిరిలో నిర్వహిస్తున్నారు. 


అర్హత 

- ప్రస్తుతం అయిదోతరగతి చదువుతున్న బాలురు, బాలికలు ఆరోతరగతి ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి 2022 మార్చి 31 నాటికి పది నుంచి పన్నెండేళ్ల మధ్య వయసు ఉండాలి. అంటే 2010 ఏప్రిల్‌ 1 నుంచి 2012 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి.

ఈ విద్యా సంవత్సరంలో ఎనిమిదోతరగతి చదువుతున్న బాలురు తొమ్మిదోతరగతి ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి 2022 మార్చి 31 నాటికి 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అంటే 2007 ఏప్రిల్‌ 1 నుంచి 2009 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి. 


ఏఐఎస్‌ఎస్‌ఈఈ వివరాలు: దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. అన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలే అడుగుతారు. సమాధానాలను పెన్సిల్‌తో ఓఎంఆర్‌ పత్రంమీద గుర్తించాలి. రుణాత్మక మార్కులు లేవు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే ఒక్కో అంశంలో కనీసం 25 శాతం, మొత్తమ్మీద 40 శాతం మార్కులు రావాలి. 


ఆరోతరగతి ఎంట్రెన్స్‌: పరీక్ష సమయం రెండున్నర గంటలు. మొత్తం మార్కులు 300. ఇందులో మేథమెటిక్స్‌ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి 3 మార్కులు కేటాయించారు. ఇంటెలిజెన్స్‌, లాంగ్వేజ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అంశాలనుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. ఆంగ్ల మాధ్యమంతోపాటు అభ్యర్థి ఎంచుకొన్న ప్రాంతీయ భాషలో(తెలుగు, హిందీ, ఉర్దూ తదితర భాషలు) ప్రశ్నలు ఇస్తారు.


తొమ్మిదోతరగతి ఎంట్రెన్స్‌: దీనిని ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. మొత్తం మార్కులు 400. మేథమెటిక్స్‌ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. ఇంటెలిజెన్స్‌, ఇంగ్లీష్‌, జనరల్‌ సైన్స్‌, సోషల్‌ సైన్స్‌ అంశాల నుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు నిర్దేశించారు.


సైనిక్‌ స్కూల్స్‌తో  ప్రయోజనాలెన్నో...

- సైకిల్‌ యాత్రలు, పర్వాతారోహణ, ట్రెక్కింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌ వంటి సాహస కృత్యాల్లో శిక్షణ

- హాకీ, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, గుర్రపు స్వారీ, ఈత, స్వ్కాష్‌, టెన్నిస్‌, జిమ్నాస్టిక్స్‌, బాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌ వంటి క్రీడల్లో ప్రోత్సాహం

- డిబేట్స్‌, పబ్లిక్‌ స్పీకింగ్‌, ఎస్సే రైటింగ్‌ వంటి కో కరిక్యులర్‌ వంటివాటిలో నైపుణ్యాల పెంపుదల

- ఎన్‌సిసిలో శిక్షణ

- దేశంలోని రక్షణ శాఖ సంస్థల సందర్శన

- ఏటా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఎడ్యుకేషనల్‌ ట్రిప్స్‌

- రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణులు, పాలనవేత్తలు, ఉపాధ్యాయులతో బోధన


రిఫరెన్స్‌ బుక్స్‌

సైనిక్‌ స్కూల్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌: ఉపకార్‌

జవహర్‌ నవోదయ విద్యాలయ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌: అరిహంత్‌

రాష్ట్రీయ మిలిటరీ స్కూల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌: ఉపకార్‌


తెలుగు రాష్ట్రాల సైనిక పాఠశాలలు - సీట్లు

- కలికిరి సైనిక పాఠశాలలో ఆరో తరగతిలో బాలురకు 95 సీట్లు, బాలికలకు 10 సీట్లు ఉన్నాయి. తొమ్మిదో తరగతిలో 10 సీట్లు ఉన్నాయి. 

- కోరుకొండ సైనిక పాఠశాలలో ఆరో తరగతిలో బాలురకు 80, బాలికలకు 10 సీట్లు ఉన్నాయి. తొమ్మిదో తరగతిలో 30 సీట్లు ఉన్నాయి. 


ముఖ్య సమాచారం

ఏఐఎస్‌ఎస్ఈఈ తేదీ: 2022 జనవరి 9

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, అనంతపురం, గుంటూరు, కడప, కలికిరి, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం

వెబ్‌సైట్‌: aissee.nta.nic.in

Updated Date - 2021-11-01T15:55:52+05:30 IST