పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయే వాళ్లు తెలుసుకోవాల్సిన విషయాలివి.. 2021 ఇండియా రౌండప్..!

ABN , First Publish Date - 2021-12-28T17:51:05+05:30 IST

ఏ పోటీ పరీక్షల్లోనైనా కరెంట్‌ అఫైర్స్‌ నుంచి కచ్చితంగా కొన్ని ప్రశ్నలు వస్తాయి. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభ్యర్థులకు పట్టు ఉన్నప్పుడే ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలరు

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయే వాళ్లు తెలుసుకోవాల్సిన విషయాలివి.. 2021 ఇండియా రౌండప్..!

ఏ పోటీ పరీక్షల్లోనైనా కరెంట్‌ అఫైర్స్‌ నుంచి కచ్చితంగా కొన్ని ప్రశ్నలు వస్తాయి. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభ్యర్థులకు పట్టు ఉన్నప్పుడే  ఈ ప్రశ్నలకు  సమాధానాలు గుర్తించగలరు. 2020లో వివిధ రంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో వచ్చిన నూతన ఆవిష్కరణలు, ఆర్థిక రంగ వృద్ధి, పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించిన సమాచారాన్ని ఇస్తున్నాం..


16వ ప్రవాసీ భారతీయ దివస్‌

16వ ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని జనవరి 9న వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సదస్సు నినాదం ‘ఆత్మ నిర్భర భారత్‌ కోసం కృషి’. ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తుంది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు దేశంతో అనుబంధాన్ని మరింత పెంపొదించడానికి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కృషి చేస్తోంది


టాయ్‌ ఫెయిర్‌

ఇండియా టాయ్‌ ఫెయిర్‌ 2021ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రదర్శనను నిర్వహించారు. బొమ్మల ఉత్పత్తితో ముడిపడి ఉన్నభారతీయ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేందుకు అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో వాటి వాటా పెంచేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది.


కెన్‌-బెట్వా నదుల అనుసంధానం

కెన్‌-బెట్వా నదుల అనుసంధాన కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ నదుల అనుసంధానం వల్ల బుందేల్‌ఖండ్‌తోపాటు మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుంది. దాదాపు 10 లక్షల హెక్టార్లకు సాగునీరు, 62 లక్షల మందికి తాగునీరు అందుతాయి. ఈ అనుసంధాన ప్రక్రియలో కెన్‌ నది నుంచి బెట్వాకు నీరు తరలిస్తారు.


నేషనల్‌ అర్బన్‌ డిజిటల్‌ మిషన్‌

దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో డిజిటల్‌, మౌలిక వసతులను రూపొందించడంతోపాటు, ప్రస్తుతం ఉన్న వాటిని మెరుగుపరిచే లక్ష్యంతో భారత ప్రభుత్వం నేషనల్‌ అర్బన్‌ డిజిటల్‌ మిషన్‌ని ప్రారంభించింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా నగరాల్లో ప్రస్తుతం అమలవుతున్న వివిధ డిజిటల్‌ కార్యక్రమాలన్నింటినీ ఒకే పరిధిలోకి తీసుకువస్తారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌  ఆఫ్‌ సైన్సెస్‌, స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ డిజిటల్‌ మిషన్‌ను అభివృద్ధి చేశారు.


దేశ రాజధానికి కొత్త చట్టం

జాతీయ రాజధాని ప్రాంతం, ఢిల్లీ చట్టం-1991కి సవరణలు చేసి భారత ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. జాతీయ రాజధాని ప్రాంతం, ఢిల్లీ (సవరణ) బిల్లు-2021ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఈ కొత్త చట్టాన్ని రూపొందించింది. 1991 నాటి చట్టంలోని సెక్షన్‌ 21, 24, 33, 44లని సవరించింది. ఈ చట్టం ద్వారా ఢిల్లీ శాసనసభ, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారాలు, బాధ్యతల అంశాలకు సంబంధించి మార్పులు తీసుకువచ్చింది. ప్రభుత్వం అనే పదం వచ్చినప్పుడల్లా దానిని లెఫ్టినెంట్‌  గవర్నర్‌గా పరిగణించాలని ఈ చట్టం నిర్వచిస్తోంది. ఢిల్లీ శాసన సభ చేసే చట్టాలు, జారీ చేసే అధికారాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఉంటాయి.


యూనిక్‌ ల్యాండ్‌ పార్సెల్‌ గుర్తింపు సంఖ్య 

భారత ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రత్యేక ల్యాండ్‌ పార్సెల్‌ గుర్తింపు సంఖ్య పథకాన్ని ప్రారంభించింది. 2022 నాటికి  దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ల్యాండ్‌ పార్సెల్‌ గుర్తింపు సంఖ్యను భూమికి ఆధార్‌గా అభివర్ణిస్తున్నారు. ఇందులో మొత్తం 14 అంకెలతో కూడిన ఐడీ ఉంటుంది. సర్వే చేసిన భూభాగాన్ని గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ పథకాన్ని డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డుల ఆధునికీరణ కార్యక్రమంలో చేర్చారు. ల్యాండ్‌ బ్యాంక్‌ అభివృద్ధికి తోడ్పడటంతోపాటు, భూ రికార్డులను తాజా సమాచారంతో అప్‌డేట్‌ చేయడానికి ఇది తోడ్పడుతుంది.


‘ఈ-కోర్ట్స్‌’ సర్వీసెస్‌ మొబైల్‌ యాప్‌

భారత సుప్రీంకోర్టు ఈ-కోర్ట్స్‌ సర్వీసెస్‌ మొబైల్‌ యాప్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా కోర్టుల్లో నడుస్తున్న కేసుల స్థితిగతులను తెలుసుకోవచ్చు. తెలుగుతోపాటు 14 ప్రధాన భారతీయ భాషలలో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ ద్వారా కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసులతోపాటు సాధారణ ప్రజలు కూడా కేసుల వివరాలు తెలుసుకోవచ్చు.


అరుదైన వ్యాధులపై జాతీయ విధానం- 2022

అరుదైన వ్యాధులకు సంబంధించి జాతీయ విధానాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆవిష్కరించారు. ఈ నూతన విధాన ముఖ్య ఉద్దేశం వ్యాధుల చికిత్సకు అయ్యే వ్యయాలను తగ్గించడం,  పరిశోధనలు పెంచడం, ఔషధాలను తయారు చేయడం. రాష్ర్టీయ ఆరోగ్య భీమా నిధి కింద అరుదైన వ్యాధుల బారిన పడినవారికి రూ.20 లక్షల వరకు వైద్య సహాయం  అందించనున్నారు.


రక్షిత అంబులెన్స్‌

రక్షణ పరిశోధన అభివృద్థి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ ఇటీవల రక్షిత పేరుతో బైక్‌ అంబులెన్స్‌ను  రూపొందించింది. దీనిని కేంద్ర రిజర్వు పోలీసు దళాలకు డీఆర్‌డీవో  అందజేసింది. మారుమూల, ఇరుకు ప్రాంతాల్లో అత్యవసర సేవలు అందించడానికి ఈ బైక్‌ అంబులెన్స్‌ ఉపయోగపడుతుంది.


ఈ-చావనీ పోర్టల్‌

కేంద్ర రక్షణ శాఖ ఈ-చావనీ పోర్టల్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్‌ బోర్డుల్లో నివసిస్తున్న ప్రజలకు ఆన్‌లైన్‌ ద్వారా పౌర సేవలు అందించడానికి ఈ పోర్టల్‌ ఉపయో గపడుతుంది. ఈ-గవ్‌, భారత్‌ ఎలక్ర్టానిక్స్‌ లిమిటెడ్‌, డైరెక్టరేట్‌ జనరల్‌ డిఫెన్స్‌ ఎస్టేట్‌, నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.


గ్రామ్‌ ఉజాలా

కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో  గ్రామ్‌ ఉజాలా కార్యక్రమాన్ని బిహార్‌లోని అర్రాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఎల్‌ఈడీ బల్బులను అతి తక్కువ ఖర్చు, మూడేళ్ల వారంటీతో గ్రామీణ వినియోగదారులకు అందజేస్తారు. ఈ పథకాన్ని ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీస్‌ లిమిటెడ్‌ ద్వారా రూపొందించారు. ఈ కార్యక్రమం రెండో విడతను ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించారు.


దేశీయ రక్షణ పరిశ్రమలకు ఊతం

దేశీయ ఆయుధ పరిశ్రమకు ఊతమిచ్చే విధంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 108 రకాల రక్షణ ఉపకరణాల దిగుమతులపై నిషేధం విధించే ప్రతిపాదనకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది.  నిషేధం విధించిన జాబితాలో రాడార్లు, ట్యాంకు ఇంజన్లతోపాటు అధునాతన కార్వెట్‌ యుద్ధ  నౌకలు కూడా ఉన్నాయి.


ట్రీ సిటీ ఆఫ్‌ ద వరల్డ్‌

మొక్కల పెంపకం, సంరక్షణ, ఆరోగ్యకర వాతావరణం... ఈ మూడు అంశాల ప్రాతిపదికన ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ- అర్బర్‌ డే ఫౌండేషన్‌  63 దేశాలకు చెందిన 119 నగరాలను ట్రీ సిటీ ఆఫ్‌ ద వరల్డ్‌ టైటిల్‌కు పరిగణనలోకి తీసుకుంది. 51 నగరాలు ఈ టైటిల్‌కు ఎంపికయ్యాయి. ఇందులో భారతదేశం నుంచి ఈ టైటిల్‌ సాధించిన ఒకే ఒక్క నగరం హైదరాబాద్‌.


పార్లమెంట్‌ భవనానికి 100 సంవత్సరాలు

భారత పార్లమెంట్‌ భవనానికి ఫిబ్రవరి 12 నాటికి వందేళ్లు పూర్తయ్యాయి. బ్రిటిష్‌ పాలకుల నుంచి నేటి వరకు అనేక చర్చలకు, చట్టాల రూపకల్పనలకు ఈ భవనం వేదికగా నిలిచింది. బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన ఈ భవనానికి ఎడ్విన్‌ లుటియెన్స్‌ రూపకర్త. 1921 ఫిబ్రవరి 12న దీనికి శంకుస్థాపన చేశారు. 1927 జనవరి 18న ఆనాటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌ ఈ భవనాన్ని ప్రారంభించారు. చారిత్రక చర్చలు, బ్రిటిష్‌ నుంచి అధికార మార్పిడి, రాజ్యాంగ రూపకల్పన వంటి అంశాలకు ఇది వేదికైంది.


చౌరీ చౌరా సంఘటనకు వందేళ్లు

స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక చారిత్రాత్మక ఘటనగా నిలిచిన చౌరీ చౌరా సంఘటన జరిగి ఫిబ్రవరి 4 నాటికి వందేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వందేళ్ల ఉత్సవాలను ప్రారంభించారు. 1922, ఫిబ్రవరి 4న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లాలోని చౌరీ చౌరాలో ఈ ఘటన జరిగింది. గాంధీజీ నేతృత్వంలో సహాయ నిరాకరణోద్యమం జరుగుతున్న సమయమది. చౌరీచౌరా  పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా నిరసన తెలుపుతున్న ప్రజలపై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ప్రజలు తిరగబడి పోలీస్‌ స్టేషన్‌ని తగులబెట్టారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులు మరణించారు. ఇది జరిగిన కొన్నిరోజుల్లోనే గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు.


ఎం.బాల లత

సివిల్స్ మెంటార్

Updated Date - 2021-12-28T17:51:05+05:30 IST