ఉత్తరాఖండ్‌ విషాదం

ABN , First Publish Date - 2021-10-21T06:25:25+05:30 IST

భారీవరదలతో ఉత్తరాఖండ్‌ అతలాకుతలమైపోతున్నది. ఆగకుండా మూడురోజులు కురిసిన వర్షాలతో రాష్ట్రం రూపురేఖలు ఒక్కసారిగా తారుమారైపోయాయి....

ఉత్తరాఖండ్‌ విషాదం

భారీవరదలతో ఉత్తరాఖండ్‌ అతలాకుతలమైపోతున్నది. ఆగకుండా మూడురోజులు కురిసిన వర్షాలతో రాష్ట్రం రూపురేఖలు ఒక్కసారిగా తారుమారైపోయాయి. మృతుల లెక్కలు ఏ రోజుకారోజు సవరించుకోవలసిన స్థాయిలో ప్రకృతి ప్రకోపం ఉన్నది. రాష్ట్రంలోని 13జిల్లాల్లో పదిజిల్లాలు అత్యంత భారీ వర్షాలతో అతలాకుతలమైనాయి. పన్నెండేళ్ళక్రితం ఇదే అక్టోబరు మాసంలో 24 గంటల్లో కురిసిన అతి భారీ వర్షం రికార్డు ఇప్పుడు 20గంటల్లోనే చెరిగిపోయిందని అంటున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు గతకాలపు రికార్డులను ఈ మారు తిరగరాశాయి. నైనితాల్‌ సరస్సు ఈ స్థాయిలో పొంగి చుట్టుపక్కల ప్రాంతాలను ఇంతలోతున ముంచివేయడం స్థానికులు ఎన్నడూ చూడలేదట. 


ఈ వర్షాలు, వరదలు మిగల్చిన ప్రాణనష్టం, ఆస్తినష్టం అపారమైనవి. వరద ఉధృతికి వంతెనలు కొట్టుకుపోయాయి, కొండచరియలు విరిగిపడి ఇళ్ళు నేలమట్టమైనాయి, కార్లతో సహా పలువాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్ళలోకి పీకలోతుగా చేరిన నీళ్ళలో మునిగి కష్టపడి కూడబెట్టుకున్న విలువైన వస్తుసామగ్రి ఎందుకూ కొరగాకుండా పోయింది. ఈ భారీ ఉత్పాతం రాష్ట్ర పర్యాటకరంగానికి కీలకమైన చార్‌ధామ్‌యాత్రమీద విశేష ప్రభావం చూపింది. యాత్రలు నిలిచిపోవడంతో పాటు, వీటికోసం దేశంలోని చాలాప్రాంతాలనుంచి వచ్చి చిక్కుకున్నవారినీ, రిసార్టుల్లో ఉన్నవారినీ  అధికారయంత్రాగం ‍సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది. పర్యావరణ ప్రేమికుల నిరసనలను సైతం ఖాతరుచేయకుండా చార్‌ధామ్‌ యాత్రను సులభతరం చేయడంకోసం నిర్మిస్తున్న అత్యంత పటిష్ఠమైన హైవే సైతం ఈ ఉత్పాతం వల్ల తీవ్రంగా దెబ్బతిన్నది. 


ఉత్తరాఖండ్‌, కేరళలు భారీవర్షాలను ఎదుర్కొంటూ, రాజధాని ఢిల్లీ ఉదయాన చలితో వొణుకుతూ, అనంతరం వేడెక్కుతూ, దేశఈశాన్యం మాత్రం పొడిగానూ, వేడిగానూ ఉంటూ ఈ అక్టోబర్‌ మాసంలో మనం విచిత్ర వాతావరణ స్థితిగతులను చూస్తున్నాం. రుతుపవనాల నిష్క్రమణలో జాప్యం, అరేబియా సముద్రంలోనూ, బంగాళాఖాతంలోనూ ఒకేమారు అల్పపీడనాలు ఏర్పడటం వంటి అంశాలు ఈ పరిస్థితికి కారణాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ సెప్టెంబరు రెండోవారానికల్లా పూర్తికావాల్సింది పోయి, అక్టోబరు తొలివారాన్ని కూడా దాటడం, దాని కారణంగా దక్షిణాదిప్రాంతాలు అధికవర్షాలు ఎదుర్కోవడం చూశాం. ఉత్తరాఖండ్‌లో ప్రకృతిప్రకోపాలు కొత్తేమీ కాదు కానీ, వాతావరణంలో విపరీతమైన మార్పులు వాటితీవ్రతను మరింత పెంచుతున్నాయి. మేఘాలు ఒక్కసారిగా బద్దలై వరదలు ఉప్పొంగడం వంటివి ఇటీవల ఎక్కువైనాయి. వాతావరణ మార్పు, పర్యావరణపరిరక్షణ వంటి మాటలు సర్వసాధారణంగా పాలకులకు నచ్చవు కానీ ఉష్ణమండల దేశంగా మనం ఈ అంశంమీద దృష్టిపెట్టకతప్పదు. సముద్రజలాల సగటువేడి క్రమంగా హెచ్చుతున్న తరుణంలో, అత్యంత బలహీన తుపానులు కూడా బలపడి ఊహించనిస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. బంగాళాఖాతంలోనూ, అరేబియా సముద్రంలోనూ గత కొద్దిరోజులుగా వరుస సైక్లోన్లు ఏర్పడుతున్నాయి. ఇలా రెండువైపులా ఒకేమారు ఉత్పాతాలు చుట్టుముట్టడంతో దేశం ప్రాణనష్టంతో పాటు ఆర్థికంగా ఎంతో దెబ్బతింటున్నది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉత్తరాఖండ్‌ చవిచూస్తున్నటువంటి ఉపద్రవాలను ముందే పసిగట్టగలిగే వ్యవస్థల రూపకల్పనమీద ప్రత్యేక దృష్టిసారించగలిగితే కనీసం ప్రాణనష్టాన్ని నివారించడం సాధ్యపడుతుంది. ఇంకాచెప్పాలంటే, దేశంలోని ప్రతీ రాష్ట్రమూ నగరమూ కూడా అధునాతన హెచ్చరిక వ్యవస్థలతో సంసిద్ధం కావాల్సిన రోజులు వచ్చేశాయి. ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొచ్చి కొద్దిగంటల్లోనే నగరాలన్నింటినీ ముంచేస్తున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం. ఉత్తరాఖండ్‌ ఇటీవలే మంచుచరియలు విరిగిపడిన కారణంగా ఓ భారీ జలప్రళయాన్ని చవిచూసింది. రెండు జలవిద్యుత్‌ ప్రాజెక్టులు ధ్వంసం కావడంతోపాటు, డ్యాములు, రోడ్లు, బ్రిడ్జిలు, ఇళ్ళు తదితరం కొట్టుకుపోయాయి. వాతావరణమార్పు అక్కడి ప్రకృతి సహజసిద్ధమైన ప్రక్రియలను దెబ్బతీసింది. హిమాలయాలు అధికంగా కరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు రాజకీయనాయకుల లాలూచీ వల్ల అవసరం లేకున్నా పుట్టుకొస్తున్న భారీ ప్రాజెక్టులు, వాటికోసం జరుగుతున్న పేలుళ్ళు, మానవ కార్యకలాపాలు ఈ సున్నితమైన ప్రాంతాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. అభివృద్ధి పేరిట సాగుతున్న విధ్వంసాన్ని అదుపులో పెట్టుకోకపోతే ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంటుంది.

Updated Date - 2021-10-21T06:25:25+05:30 IST