నాగభూమిలో మహాఘోరం

ABN , First Publish Date - 2021-12-07T06:09:57+05:30 IST

ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో సాయుధ బలగాలు సామాన్యపౌరులను కాల్చిచంపిన ఘటనలు అత్యంత అమానుషమైనవి. బొగ్గుగనిలో పనిపూర్తిచేసుకొని వాహనంలో ఇళ్ళకుపోతున్న కార్మికులను కాల్చిచంపేసిన సైన్యం...

నాగభూమిలో మహాఘోరం

ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో సాయుధ బలగాలు సామాన్యపౌరులను కాల్చిచంపిన ఘటనలు అత్యంత అమానుషమైనవి. బొగ్గుగనిలో పనిపూర్తిచేసుకొని వాహనంలో ఇళ్ళకుపోతున్న కార్మికులను కాల్చిచంపేసిన సైన్యం, వారిని తీవ్రవాదులుగా భ్రమపడ్డామని చెబుతోంది. కార్మికులంతా ఎంతకూ ఇంటికిచేరకపోవడంతో వారిని వెతుక్కుంటూ బయలుదేరిన గ్రామస్థులకు ఈ ఘోరం కంటపడగానే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జవాన్లపై దాడులు చేశారు, మిలటరీ వాహనాలకు నిప్పుపెట్టారు. దీనితో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైనికులు మళ్ళీ కాల్పులు జరిపి మరికొంతమందిని చంపేశారు. మొదట దేశరక్షణ, ఆ తరువాత ఆత్మరక్షణ పేరిట సైన్యం జరిపిన ఈ ఘాతుకం నాగాలాండ్‌ను మరింత రాజేసి, తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నది.


రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక దర్యాప్తు కానీ, అత్యంత దురదృష్టకరమైన సంఘటన అంటూ సైన్యం వెలిబుచ్చిన ఆవేదన కానీ, అది జారీ చేసిన ‘కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ’ ఆదేశాలు కానీ సామాన్యుల ఆవేదనను చల్లార్చగలిగేవి కాదు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి నాగాలాండ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న హార్న్ బిల్ వేడుకను బహిష్కరించి, నల్లజెండాలతో నిరసనలు తెలపాలంటూ అనేక సంస్థలు, గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. మయన్మార్‌తో అంతర్జాతీయ సరిహద్దు పంచుకున్న ఈ ప్రాంతంలో ‘సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–కంప్లాంగ్’ వర్గంలో ఒక ముఠా సంచరిస్తున్నట్టుగా ఇంటలిజెన్స్ సమాచారం ఉన్నందున గాలింపు చర్యలు చేపట్టిన సైన్యానికి అమాయక కార్మికుల వాహనం కంటబడింది. వారు ఆదేశించినమేరకు వాహనాన్ని ఆపనంతమాత్రాన, తీవ్రవాదులకూ, నిరాయుధులైన సామాన్యులకూ మధ్య తేడా పోల్చుకోలేని స్థితిలో ఆ సుశిక్షితులైన కమాండోలున్నారంటే నమ్మశక్యంగా లేదు. తాము చెప్పినట్టుగా విననందుకు, తమ ఆదేశాన్ని పాటించనందుకు వారి అహం దెబ్బతిన్నట్టు ఉంది. చేతిలో ఆయుధం, దానిని ఎలా ఉపయోగించినా ప్రశ్నించని అధికారాలు దఖలు పడ్డప్పుడు కేవలం అవమానాలూ అనుమానాల ఆధారంగా కూడా ఎదుటివారి ప్రాణాలు తీసేయవచ్చు. వాహనంలో నిజంగా తీవ్రవాదులే ఉన్నపక్షంలో సైన్యానికి ఇలా వ్యవహరించగలిగేంత సమయం ఇస్తారా అన్నదీ ప్రశ్నే.


విపక్షాలకు ఎంత చెప్పినా, ఎన్ని హామీలు ఇచ్చినా ఎలాగూ సంతృప్తి కలగదు కానీ, హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన ప్రకటన దేశప్రజలను కాకున్నా, కనీసం నాగాలాండ్ వాసులను కూడా ఊరడింపచేసేట్టుగా లేదు. ఈ దర్యాప్తులూ విచారణలూ జరిగిన ఘటన పరిణామక్రమాన్ని వివరించి, కొన్ని లోతుపాతులను వెలికితీయగలవే తప్ప, సైన్యాన్ని విమర్శించవు, సాయుధబలగాల ప్రత్యేకాధికారాల చట్టమే ఈ దుర్నీతికి కారణమని నిర్థారించవు. గుర్తింపులో ఓ చిన్నపొరబాటువల్ల అంటూ ఓ ఊచకోతను పాలకులే చిన్నపదాలమధ్య కప్పెట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు రేపు కొత్తగా తేలేది ఏముంటుంది? సైన్యానికి విశేషాధికారాలు ఇస్తున్న చట్టం వల్లనే వారు ఇలా సునాయాసంగా పొరబడగలిగే అవకాశాన్ని కూడా అందుకోగలిగారన్న వాదనలు కాదనలేనివి. అంతర్జాతీయ సరిహద్దుల్లో ప్రాణాలను ఫణంగా పెట్టి తీవ్రవాదులతోనూ, ఉగ్రవాదులతోనూ పోరాడుతున్న సైనికులపట్ల అభిమానం, గౌరవం అందరికీ ఉన్నాయి. ఈ ఘటన ఆధారంగా సైన్యం నైతికస్థైర్యాన్ని దెబ్బతీయవద్దని కొందరు హితవు చెబుతున్నారు కూడా. అది నిజమే అయినప్పటికీ, ఈశాన్యరాష్ట్రాల్లో అశాంతిని అదుపులోకి తెచ్చే లక్ష్యంతో వచ్చిన ఏఎఫ్ఎస్‌పీఎ సైన్యాన్ని హద్దులు దాటేందుకు కూడా వీలుకల్పించింది. అమాయకుల ఊచకోతలు, మహిళలపై అకృత్యాలు జరిగిపోతూనే ఉన్నాయి. బస్సుకోసం వేచిచూస్తున్న పదిమంది జనాన్ని ఇరవైయేళ్ళక్రితం ఇలా కాల్చివేసినందునే మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల పదహారేళ్ళపాటు ఈ విశేషాధికారాల చట్టానికి వ్యతిరేకంగా నిరాహారదీక్ష చేసింది. కేంద్రం దిగిరాలేదు కానీ, మేఘాలయకు మూడేళ్ళక్రితమే దీనినుంచి విముక్తి లభించింది. నాగాలాండ్‌లో ఈ నెలాఖరువరకూ దీని అమలును పొడిగిస్తూ జూన్‌లో ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రత్యేక కమాండో బృందానికి రక్షణకవచంలాగా నిలిచిన ఈ చట్టాన్ని దాటి సామాన్యులపై కాల్పులు జరిపినందుకు దానిని శిక్షించగలిగిననాడు నాగాలాండ్ వాసులకు కాస్తంతైనా ఉపశమనం కలుగుతుంది.

Updated Date - 2021-12-07T06:09:57+05:30 IST