స్ఫూర్తి నిలిచింది

ABN , First Publish Date - 2021-08-10T09:03:52+05:30 IST

విశ్వక్రీడల సంరంభం ముగిసింది. ప్రత్యక్షంగా ప్రేక్షక సమూహాల హడావిడి, ఆనందోత్సాహాలు ఏవీ లేకపోయినా క్రీడాస్ఫూర్తి మాత్రం ఉవ్వెత్తున ఎగిసి ప్రపంచంలోని...

స్ఫూర్తి నిలిచింది

విశ్వక్రీడల సంరంభం ముగిసింది. ప్రత్యక్షంగా ప్రేక్షక సమూహాల హడావిడి, ఆనందోత్సాహాలు ఏవీ లేకపోయినా క్రీడాస్ఫూర్తి మాత్రం ఉవ్వెత్తున ఎగిసి ప్రపంచంలోని ఆటల ప్రేమికులందరినీ అలరించింది. ఎప్పటి మాదిరిగానే విజేతల ఆనందోత్సాహాలు, పరాజితుల కన్నీటిఛాయలు ఆ సంరంభాన్నంటే సాగాయి. అయితే ఆరంభానికి ముందు ఎన్నో సందేహాలు...సందిగ్ధతలు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఈ మెగా ఈవెంట్‌ ఏమిటంటూ స్వదేశంలోనే నిరసనలు. మరో ఐదురోజుల్లో పోటీలు ముగుస్తాయనగా, విషక్రిమి వీరవిహారం ఎక్కువ కావడంతో, ఈవెంట్‌ అర్ధంతరంగా రద్దు కూడా కావొచ్చంటూ నిర్వాహక కమిటీ అధిపతే ప్రకటించడం వంటి అవాంతరాలన్నింటినీ టోక్యో వేదిక అధిగమించింది.


పక్షంరోజుల పాటు క్రీడాభిమానులను విశేషంగా అలరించాయి టోక్యో ఒలింపిక్స్‌. ప్రారంభ, ముగింపు వేడుకలు వర్ణ శోభితంగా గత క్రీడలకు ఏమాత్రం తీసిపోకుండా జరిగాయి. ఆటల ద్వారా విశ్వమంతా ఏకం కావాలన్న ఒలింపిక్‌ స్ఫూర్తిని ఈ కఠిన పరిస్థితుల్లోనూ చాటిచెప్పి జపాన్‌ జయహో అనిపించుకుంది. విశ్వక్రీడల్లో మున్నెన్నడూ లేని రీతిలో భారత పతాకం సమున్నతంగా ఎగిరింది. ఊహించని స్వర్ణంతో మురిపించడమే కాదు, మన క్రీడాకారులు దేశ ప్రజానీకాన్ని హర్షాతిశయంలో ముంచెత్తారు. ఓ స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తం ఏడు పతకాలు సాధించి టోక్యో వేదికన భారత్‌ 48వ స్థానంలో నిలిచింది. పదమూడేళ్ల క్రితం బీజింగ్‌లో షూటర్‌ అభినవ్‌ బింద్రా వెదజల్లిన స్వర్ణ కాంతిని మరిపిస్తూ హరియాణాకు చెందిన 23 ఏళ్ల జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా బంగారు పతకాన్ని ముద్దాడడం ఈమారు భారత్‌ సాధించిన అతిపెద్ద విజయం. బల్లెంను బహుదూరం విసిరి భళిరా అనిపించుకున్న నీరజ్‌ వందేళ్లలో భారత్‌కు అథ్లెటిక్స్‌లో తొలిసారి పతకాన్ని అందించిన వీరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అథ్లెటిక్స్‌లో భారత్‌ ఒలింపిక్‌ పతకం సాధించాలన్న మిల్కాసింగ్‌ మాటను నిజం చేశాడు. రెజ్లర్‌ రవికుమార్‌ దహియా రజత పతకంతో సత్తా చాటగా, తెలుగుకిరణం కరణం మల్లీశ్వరి తర్వాత ఇన్నేళ్లకు వెయిట్‌లిఫ్టింగ్‌లో మెరిసి భారత్‌కు మరో పతకాన్నందించిన క్రీడాకారిణిగా మీరాబాయి చాను రికార్డు సృష్టించింది. మన మణిపూస పీవీ సింధు వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ తన ప్రతిభ చాటుకుని కాంస్యం దక్కించుకుంది. అసోం బాక్సర్‌ లవ్లీనా, రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా కూడ కాంస్య పతకాలతో మెరిశారు. హాకీలో పురుషుల జట్టు అమోఘమైన పోరాటపటిమ చూపి నలభై ఒక్క ఏళ్ల తర్వాత భారతావనిని పతకంతో అలంకరించింది. మహిళా హాకీ జట్టు కాంస్యాన్ని చేజార్చుకున్నా స్థైర్యంగా ప్రతిభ చాటుకోవడం స్ఫూర్తిదాయకం. మున్ముందు క్రీడల్లో మరిన్ని పతకాలు భారత్‌ అందిపుచ్చుకోగలదనే ఆశలకు పాదులు పరుస్తున్న శుభ పరిణామాలు ఇవన్నీ. ఇక, పతకాలు సాధించడం ఖాయమనుకున్న అంతర్జాతీయ అథ్లెట్లు కూడా అత్యుత్తమ ప్రదర్శనతో అలరించారు. అమెరికా స్ర్పింటర్‌, 35 ఏళ్ల అలిసన్‌ ఫెలిక్స్‌ పదకొండో పతకంతో తన దేశానికి చెందిన దిగ్గజ అథ్లెట్‌ కార్ల్‌ లూయిస్‌ అత్యధిక ఒలింపిక్‌ పతకాల రికార్డును దాటడం, యూఎస్‌ స్టార్‌ స్విమ్మర్‌ క్యాలెబ్‌ డ్రెస్సెల్‌ కొలనులో ఐదు స్వర్ణాలు కొల్లగొట్టడం, 34 ఏళ్ల జమైకా అథ్లెట్‌ షెల్లీ అన్‌ఫ్రేజర్‌ రెండు పతకాలు నెగ్గడం టోక్యోలో హైలైట్‌. మాతృత్వంతో పటుత్వం ఏమాత్రం తగ్గదని నిరూపిస్తూ ఫెలిక్స్‌, ఫ్రేజర్‌ పతకాలు సాధించి టోక్యోలో స్ర్తీశక్తిని చాటారు. 


టోక్యోలో ఏడు పతకాలు గెలవడం మహాఘనతగా మనం భావిస్తున్నా, మిగతా దేశాలతో పోలిస్తే సాధించాల్సింది చాలా ఉందన్న విషయం అవగతమవుతోంది. క్రీడాకారులు స్వశక్తితో పోరాడి పతకాలు గెలుచుకొస్తే, అప్పుడు పోటీలు పడి మరీ బహుమానాలు ప్రకటిస్తూ... క్రీడలను మేమే ప్రోత్సహిస్తున్నామని చెప్పుకోవడం తప్ప మన ప్రభుత్వాలు చేసేదేముంది? మనకు సరైన క్రీడావిధానం ఉంటే.. అంతర్జాతీయ వేదికపై పరాభవాల పరంపర తప్పుతుంది. ప్రాథమిక స్థాయి నుంచి పైస్థాయి వరకు సరైన వసతులు, శిక్షణ సంస్థలు లేకపోవడంతోపాటు అసలు పాఠశాలల్లో క్రీడల ఊసే లేకపోవడం మన వెనుకంజకు ప్రధాన కారణం. మన దేశంలో క్రీడల గురించి తెలియనివాళ్లు, ఏనాడూ ఒక్క ఆట కూడా ఆడని వాళ్లు క్రీడాసంఘాల బాధ్యతలు చూస్తుంటారు. ఇలాంటి లోపాలను అధిగమించి సంస్థాగత క్రీడావ్యవస్థను పటిష్ఠం చేస్తేనే మరింత మంది ఒలింపిక్‌ విజేతలు అవతరిస్తారు.

Updated Date - 2021-08-10T09:03:52+05:30 IST