చమురు మంటలు
ABN , First Publish Date - 2021-10-29T06:28:37+05:30 IST
పెట్రోధరలు మండిపోతున్నాయని గుండెలు బాదుకోవడం కంటే, ఈ దేశ పౌరుడు మిగతా అనేక విషయాల్లో రాజీపడినట్టుగానే దీనికీ సర్దుకుపోవడం ఉత్తమమని ఓ ఆర్థికవేత్త సెలవిచ్చారు. చమురు ధరలపై ఆగ్రహించినా, తన కష్టార్జితాన్ని పాలకులు...
పెట్రోధరలు మండిపోతున్నాయని గుండెలు బాదుకోవడం కంటే, ఈ దేశ పౌరుడు మిగతా అనేక విషయాల్లో రాజీపడినట్టుగానే దీనికీ సర్దుకుపోవడం ఉత్తమమని ఓ ఆర్థికవేత్త సెలవిచ్చారు. చమురు ధరలపై ఆగ్రహించినా, తన కష్టార్జితాన్ని పాలకులు దోచేస్తున్నారని ఆవేదన చెందినా, రేపోమాపో ధరలు తగ్గవచ్చునని ఆశపడినా ఆరోగ్యానికి ప్రమాదం కనుక పెట్రో భారాన్ని భరించడం, మిగిలినదానితో సర్దుకుపోవడం మంచిదని దాని అర్ధం.
పైసాపైసా కూడబెట్టుకుంటున్న సామాన్యుడిని చమురుమీద ప్రతిరోజూ కొన్ని పైసలనుంచి రూపాయలవరకూ క్రమంగా పెంచుతూ దోచేస్తున్నది ప్రభుత్వం. ఆటోలు, టాక్సీలు నడుపుతూ బతుకీడ్చేవాళ్ళకు ఇంధనం మీద రెట్టింపు వ్యయం చేయాల్సి వస్తున్నందున ఇంటికితీసుపోయే మొత్తం బాగా తగ్గిపోయింది. పెరిగిన చమురుఖర్చు అందరికడుపులూ నింపే ఫుడ్ డెలివరీ ఉద్యోగుల కడుపుకొడుతోంది. డీజిల్ రేట్ల ప్రభావం రియలెస్టేట్ రంగంమీదా ఉన్నందున ఆ మేరకు పెరిగిన ధరలను మధ్యతరగతి భరించవలసి వస్తున్నది. చమురు ధరల అడ్డగోలు పెరుగుదల పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నదని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) హెచ్చరిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో పన్నులను హేతుబద్ధీకరించకుంటే సామాన్యుడి మీద భారం అటుంచి, ఆర్థికరంగమే దెబ్బతినే అవకాశం ఉన్నదని సమాఖ్య అంటున్నది. రెండు విడతల్లో కరోనా కొట్టిన దెబ్బకు కుదేలైన పారిశ్రామికరంగం ఇటీవలే తేరుకుంటున్న స్థితిలో చమురుధరల కారణంగా ఉత్పత్తివ్యయం పెరగడం దానికీ, వినియోగదారుడికీ కూడా మేలుచేయదు.
చమురు ధరలు ఎంత పెరిగినా మోదీప్రభుత్వం పట్ల ప్రజల్లో ఏమాత్రం కోపం లేదని కేంద్రమంత్రి ఒకరు ఓ మాటన్నారు. ప్రజాగ్రహం లేదన్న నమ్మకం గట్టిగా లేకనే కాబోలు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం అధికారులతో విస్తృతస్థాయి సమావేశం జరిపి చమురుమీద మనవంతుగా ఎంత తగ్గింవచ్చునో నిర్థారించమన్నారు. ఆయన మంత్రి ఒకరు ఈమధ్యనే 95శాతం మంది ప్రజలకు పెట్రోలు, డీజిల్ తో పనిలేదని ఓ అద్భుత వ్యాఖ్య చేశారు. కానీ, చమురుధరల్లో పెరుగుదల ఆహారధాన్యాలు, పళ్ళు, కూరగాయలతో సహా ప్రతీ వస్తువు ధరనీ పెంచుతుందనీ, ప్రతి ఒక్కరిమీద ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని గుర్తించడం లేదు. మోదీ ఏలుబడిలో ఈ దేశపౌరుల సగటు ఆదాయం రెట్టింపు అయినందున చమురు ధరల పెరుగుదలలో తప్పేముందని సదరు మంత్రి ప్రశ్నిస్తున్నారు. ఆదాయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో పాలకులే చెప్పాలి. ఎన్నికలు ఎప్పుడున్నాయన్నది కాక, ప్రజల్లో అగ్రహం ఎంత ఉన్నదో తెలుసు కనుకనే యోగి ఆదిత్యనాథ్ ఇప్పటినుంచే జాగ్రత్తపడుతున్నట్టు ఉంది. కొద్దినెలల క్రితం తమిళనాడు, పశ్చిమబెంగాల్, రాజస్థాన్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయకారణాల రీత్యానే కావచ్చును కానీ, చమురుమీద కొంతపన్ను తగ్గించాయి. ఎన్నికలతో నిమిత్తం లేకుండా కూడా అన్ని రాష్ట్రాలూ ఇదే వైఖరి అనుసరించవచ్చుకదా!
చమురు ధరల పెరుగుదల మీద ప్రజలు ఎంత బాధపడినా, విపక్షాలు ఎంతమండిపడినా కేంద్ర ప్రభుత్వానికి వాటిని దారికి తెచ్చే ఉద్దేశంలేనట్టు కనిపిస్తోంది. చమురు దిగుమతుల అవసరం ఏమాత్రం లేకుండా దేశాన్ని ఇంధనవంతమైన దేశంగా గతపాలకులు నిలబెట్టివుంటే ప్రజలకు ఈ చమురు ధరల భారం తప్పివుండేది అంటూ మోదీ ఈ మధ్యనే మనసులో ఉన్నది చెప్పేశారు. ఇలా పాపాన్ని గతపాలకులమీద వేస్తూ, ఆరేళ్ళకాలంలో మోదీ ప్రభుత్వం పెట్రోలుమీద దాదాపు రెండువందల శాతం ఎక్సైజ్ డ్యూటీని అధికంగా గడించింది. గత పాలకులు డీజిల్ ను ముట్టుకోవడానికి కాస్తంత భయపడేవారు. కానీ, బీజేపీ ప్రభుత్వం దీనిమీద ఆరేళ్ళలో ఎక్సైజ్ ఆదాయం మూడింతలు పెంచుకుంది. పెట్రోలు, డీజిల్ ధరల్లో సగానికిపైగా కేంద్రరాష్ట్ర పన్నులే. క్రూడ్ ధరలు అధఃపాతాళంలో ఉన్నప్పుడు కూడా ఆ మేరకు ఈ దేశప్రజలు లబ్ధిపొందకుండా కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ పెంచి ఖజానా నింపుకుంది. చమురును జీఎస్టీ పరిధిలోకి తేవాలని ఎంతబలమైన డిమాండ్ ఉన్నా దానిని పడనీయకుండా చేసి సామాన్యుడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందే అనే రీతిలో దోచుకుంటున్నాయి.