కొత్త నియంత్రణలు

ABN , First Publish Date - 2021-02-26T06:28:19+05:30 IST

సామాజిక మాధ్యమాలు అసత్యప్రచారానికి వేదికలవుతున్నాయంటూ రైతు ఉద్యమం నేపథ్యంలో ఇటీవల తాడెత్తున మండిపడిన కేంద్రప్రభుత్వం...

కొత్త నియంత్రణలు

సామాజిక మాధ్యమాలు అసత్యప్రచారానికి వేదికలవుతున్నాయంటూ రైతు ఉద్యమం నేపథ్యంలో ఇటీవల తాడెత్తున మండిపడిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు వాటినీ, ఓటీటీ వేదికలనూ నియంత్రించేందుకు కొత్త నియమావళిని తీసుకువచ్చింది. ట్విట్టర్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ఇత్యాదివి విదేశీ పెట్టుబడులు తెచ్చుకోవచ్చు, మా దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ, అబద్ధాలకూ అసత్యాలకూ ఊతం అందిస్తే మాత్రం ఊరుకొనేది లేదని కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ ఘాటుగా హెచ్చరించారు. హద్దులు దాటిన స్వేచ్ఛకు అడ్డుకట్టవేస్తున్నట్టు చెప్పుకుంటున్న కేంద్రప్రభుత్వం ఈ కఠినమైన కొత్త నిబంధనలతో సోషల్‌ మీడియాను పూర్తిగా తన గుప్పిట్లో ఉంచుకో చూస్తున్నదని కొందరి విమర్శ. 


అభ్యంతరకరమని గుర్తించిన కంటెంట్‌ను కొద్దిగంటల్లోనే తొలగించాల్సిన బాధ్యత ఇప్పుడు సామాజిక మాధ్యమాలమీద పడింది. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం కలిగించే వ్యాఖ్యలుగా పరిగణించినవాటిని ఇరవైనాలుగ్గంటల్లో తీసియడంతో పాటు, సదరు వ్యాఖ్యలను తొలుత పోస్టుచేసినది ఎవరో గుర్తించాల్సిన బాధ్యత కూడా వాటిదే. కొన్ని రకాల పోస్టుల విషయంలో ఆయా సంస్థలకు ఇంతకాలం ఉన్న మినహాయింపులు పోయి, ఇకపై అవి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అన్నింటినీ కనిపెట్టుకొని ఉండాల్సిందే. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే సోషల్‌ మీడియా సంస్థలకు ప్రత్యేకించిన వ్యవస్థలున్నాయి. ఇప్పుడు ప్రత్యేక అధికారి నియామకం, ఫిర్యాదు పరిష్కారానికి నిర్దిష్ట కాలాన్ని నిర్ణయించడం వంటి అదనపు చర్యలను ప్రభుత్వం విధించింది. సామాజిక మాధ్యమాలు ప్రభుత్వ వ్యవస్థలకు జవాబుదారీగా ఉండటానికి కంప్లయన్స్‌ అధికారులు, నోడల్‌ పర్సన్లు ఉపకరిస్తారు. చట్టాన్ని వేయికళ్ళతో కాపలాకాస్తున్న సీబీఐ వంటి సంస్థలకు దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని సవాలుచేస్తున్న వారి సమాచారాన్ని అడగ్గానే అందివ్వడానికి అహర్నిశలూ పనిచేసే కొత్త వ్యవస్థలు తోడ్పడతాయి. 


పక్షం రోజుల క్రితమే సామాజిక మాధ్యమాలమీద ప్రభుత్వం మరోమారు తాడెత్తున మండిపడింది. రైతు ఉద్యమం నేపథ్యంలో సాగుతున్న అసత్యప్రచారాలకు అడ్డుకట్టవేయాలనీ, విద్వేషపూరిత ట్వీట్లు చేస్తున్నవారందరి ఖాతాలూ రద్దుచేయాలని తాము ఆదేశించినప్పటికీ, సదరు సంస్థ పాక్షికంగానే ఆ పని నిర్వర్తించడం ప్రభుత్వానికి నచ్చలేదు. ఖలిస్థాన్‌, పాకిస్థాన్‌ లింకులున్న ఖాతాలంటూ కేంద్రప్రభుత్వం చూపినవాటిలో అత్యధికం తొలగించిన ట్విట్టర్‌ అంతటితో ఊరుకోక భారతప్రభుత్వ ఆదేశాలు చట్టవిరుద్ధం, భావప్రకటనాస్వేచ్ఛకు విఘాతం అంటూ కటువైన వ్యాఖ్యలు చేయడం పాలకులకు ఆగ్రహం కలిగించాయి. ఆ తరువాతే ఐటీమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ నిండుసభలో ఈ సంస్థలను పేరుపేరునా ప్రస్తావిస్తూ బుద్ధిగా వ్యాపారం చేసుకోండి కానీ, ప్రైవసీ ముసుగులో దేశద్రోహాన్ని అనుమతించకండి అని హెచ్చరించారు. 


స్వేచ్ఛ ముసుగులో సోషల్‌ మీడియా అత్యధికంగా దుర్వినియోగమవుతోందని ప్రభుత్వం నమ్మకం. లక్షలూ కోట్లకన్నా భారత ప్రజలు గోప్యతకే ప్రాధాన్యం ఇస్తారనీ, వారి నమ్మకాన్ని వమ్ముచేయరాదని సుప్రీంకోర్టు వాట్సాప్‌పై దాఖలైన ఒక కేసులో వ్యాఖ్యానించింది. సదరు సంస్థలు వినియోగదారుల సమాచారాన్ని పంచుకొనేందుకు అంగీకరించేది లేదని కేంద్ర తరఫు న్యాయవాది కూడా అన్నారు. ఏ వ్యాఖ్యలు దేశసమగ్రతకు, సార్వభౌమాధికారానికి విఘాతమో, ఏవి విదేశాలతో మన సత్సంబంధాలను దెబ్బతిస్తాయో ఎవరు ఎలా నిర్ణయిస్తారన్న వివాదాన్ని అటుంచితే, ఒక అభ్యంతరకర పోస్టును తొలిసారిగా పోస్టుచేసింది ఎవరో చెప్పమని ప్రభుత్వం అడగటమంటే ప్రైవసీనీ ప్రశ్నిచడమేననీ, తాము పకడ్బందీగా పాటించే ఎండ్‌ టు ఎండ్‌ విధానాన్ని బలహీనపరచడమేనని వాట్సాప్‌ వంటివి అంటున్నాయి. ఇక అవి పాత వాదనలకు స్వస్తిచెప్పి, కొత్త నియమావళికి అనుగుణంగా పరిపూర్ణంగా పరివర్తన చెందకపోతే శిక్షలకూ నిషేధాలకూ గురికాకతప్పదు.

Updated Date - 2021-02-26T06:28:19+05:30 IST