అనుచిత నిర్ణయం

ABN , First Publish Date - 2021-12-31T07:47:28+05:30 IST

మదర్ థెరిసా డెబ్బయ్యేళ్ళక్రితం ఆరంభించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’కి విదేశీవిరాళాలు స్వీకరించే అవకాశం లేకుండా చేయడం ద్వారా నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రపంచఖ్యాతిని ఆర్జించింది...

అనుచిత నిర్ణయం

మదర్ థెరిసా డెబ్బయ్యేళ్ళక్రితం ఆరంభించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’కి విదేశీవిరాళాలు స్వీకరించే అవకాశం లేకుండా చేయడం ద్వారా నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రపంచఖ్యాతిని ఆర్జించింది. దాదాపు 140 దేశాల్లో ఆ సంస్థ ఉన్నది. మిగతా దేశాల్లో ఆ సంస్థ పేరు తెలియకపోయినా, మదర్ తెలుసు, ఆమె సేవలూ తెలుసు. క్రైస్తవ సంస్థమీద క్రిస్మస్ పర్వదినంనాడు ఈ నిర్ణయంతో మోదీ ప్రభుత్వం విరుచుకుపడి వేలాదిమంది నిరుపేదల, అభాగ్యుల పొట్టకొట్టడానికి సిద్ధపడిందని విదేశీమీడియా అంటున్నది. ‘హిందూత్వ బ్రిగేడ్‌కు ముస్లింల తరువాత క్రైస్తవులు లక్ష్యంగా మారారు, క్రైస్తవ చారిటీలపై ఇది కక్షసాధింపు’ అని విపక్షనేత చిదంబరం వంటివారు కూడా విమర్శిస్తున్నారు.


కుష్టువారినీ, కష్టాల్లో ఉన్నవారినీ, సమాజంలో అట్టడుగున ఉన్నవారినీ మీరు ముట్టుకోనప్పుడు, ఆలింగనం చేసుకున్నదీ, అన్నంపెట్టినదీ మా సంస్థేనని వికార్ జనరల్ గుర్తుచేస్తున్నారు. ఆయనే కాదు, నిస్సహాయులకు ఆపన్నహస్తం అందించే ఈ కరుణాలయం మీద పాలకులు కన్నెర్ర చేసినందుకు చాలామంది నొచ్చుకున్నారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని తమ మత, రాజకీయ ప్రయోజనాలకోసం ఆయుధంగా వాడుతున్నారన్న విమర్శలను ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టినా బాగుండేది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న ఒక సుప్రసిద్ధ సంస్థ మీద ఇలాంటి కఠిన చర్య తీసుకున్నప్పుడు కారణాలు వివరించడం మరింత ముఖ్యం. ‘కొంత ప్రతికూల సమాచారం’ అన్న ఒక్కముక్కతో ఓ పెద్ద నిర్ణయాన్ని ప్రభుత్వం సమర్థించుకోలేదు. ఆడిట్ లొసుగులు ఉన్నట్లయితే అదే మాట చెప్పవచ్చు, ఆ గోల్ మాల్ గుట్టు పరిమితులకు లోబడి కొంతమేరకైనా విప్పవచ్చు. ఎన్నో ఏళ్ళుగా విదేశీవిరాళాలు అందుకుంటూ ఏటా ఖర్చుల లెక్కలు సక్రమంగా అప్పచెబుతున్న ఈ సంస్థ ఇప్పుడు కొత్తగా చేసిన తప్పేమిటో తెలియజేయకుండా శిక్షిస్తే ఎలా? పారదర్శకత ఏమాత్రం లేని సర్కారీ చర్య సంస్థలోని వేలాదిమంది రోగులనూ, ఉద్యోగులనూ ఇబ్బందుల్లోకి నెట్టినందువల్లనే రాజకీయపక్షాలే కాదు, మనసున్నవారంతా మండిపడుతున్నారు.


ఎఫ్ సీ ఆర్ ఏ నిబంధనలను కఠినతరం చేస్తూ, ప్రభుత్వేతర సంస్థలమీద మోదీ ప్రభుత్వం కొంతకాలంగా పట్టుబిగిస్తున్న విషయం తెలిసిందే. ఏడేళ్ళకాలంలో కొన్ని వందల ఎన్జీఓలకు విదేశీనిధులు అందుకొనే హక్కులేకుండా చేసింది. దేశభద్రతకూ, ఇక్కడి ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలను నియంత్రించడం ఈ చట్టం అసలు లక్ష్యం అయితే, స్వేచ్ఛ గురించీ, హక్కుల గురించీ మాట్లాడుతున్న సంస్థలమీదనే ప్రభుత్వం దానిని ఆయుధంగా వాడటం విశేషం. గ్రీన్ పీస్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇత్యాది చాలా అంతర్జాతీయ సంస్థలు పాలకుల ఆగ్రహానికి గురైనాయి. మిషనరీస్ ఆఫ్ చారిటీస్ రాజకీయవాసనలకు ఎంతోదూరంగా, కేవలం సేవకు మాత్రమే కట్టుబడి తనపనితాను చేసుకుపోతున్న సంస్థ. చివరకు ఈ వ్యవహరంలో కూడా మమతా బెనర్జీ ప్రకటనను ఈ సంస్థ వెంటనే సరిదిద్దింది కూడా. సేవ ముసుగులో ఈ సంస్థ బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నదని గిట్టనివారు ఆరోపిస్తూనే ఉంటారు. కొందరు చిన్నస్థాయి ఉద్యోగులు డబ్బుకు కక్కూర్తిపడినందువల్ల దత్తతకు సంబంధించి ఒకటిరెండు కేసులు నమోదుకావడం వినా ఈ సంస్థ అశేషప్రజానీకం ఆదరణనే అందుకుంటోంది. ఇప్పుడు గుజరాత్ వడోదరాలో ఈ సంస్థకు చెందిన బాలికాకేంద్రంలో మతమార్పిడులు జరిగాయన్న ఆరోపణలు ఈ నిర్ణయానికి కారణం కావచ్చునని ఓ అనుమానం. జాతీయబాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్) చైర్మన్ మొన్న ఆగస్టులో ఆ కేంద్రాన్ని సందర్శించి అక్కడ బలవంతపు మతమార్పిడి జరుగుతోందని ఆరోపించడంతో స్థానిక అధికారులు పరుగునపోయి, ఏవో విచారణలు చేసి గుజరాత్ మతమార్పిడుల నిరోధక చట్టం ప్రకారం కేసులు పెట్టారని అంటారు. సదరు చైర్మన్ ఈ సంస్థ జార్ఖండ్ లో మతమార్పిడులకు పాల్పడుతున్నదని అంతకుముందు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రభుత్వం తలుచుకుంటే విదేశీనిధులు నిలిపివేయడానికీ, ఆయా సంస్థలు తమకు తాముగా గతించిపోయేట్టు చేయడానికి ఏవో మార్గాలు ఉండకపోవు. కానీ, వేలాదిమంది అభాగ్యుల జీవితాలను ప్రభావితం చేస్తున్న నిర్ణయాలు పారదర్శకంగా ఉంటే ప్రభుత్వం పరువు,  దేశం పరువుకూడా నిలబడుతుంది.

Updated Date - 2021-12-31T07:47:28+05:30 IST