హసీనా వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-20T08:25:49+05:30 IST

బంగ్లాదేశ్‌లో వారం రోజులుగా హిందువులపై దాడులు, అకృత్యాలు జరుగుతున్నాయి. మైనారిటీలపై దాడులను నియంత్రించే విషయంలో పొరుగుదేశం చక్కగానే వ్యవహరిస్తున్నదనీ...

హసీనా వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌లో వారం రోజులుగా హిందువులపై దాడులు, అకృత్యాలు జరుగుతున్నాయి. మైనారిటీలపై దాడులను నియంత్రించే విషయంలో పొరుగుదేశం చక్కగానే వ్యవహరిస్తున్నదనీ, అయినప్పటికీ, భారతహైకమిషన్‌ అధికారులు అక్కడి ప్రభుత్వంతో త్వరలోనే చర్చలు జరుపుతారని హోంశాఖ సహాయమంత్రి మంగళవారం ఓ మాటన్నారు. హిందువులపై దాడికి పాల్పడినవారిని వదిలేదిలేదనీ, కఠినాతికఠినంగా శిక్షిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన షేక్‌ హసీనా మంగళవారం కూడా తమ హోంమంత్రిని ఈ విషయంలో మరోమారు స్పష్టంగా ఆదేశించారు. 


బెంగాలీ హిందువులు దుర్గాపూజ జరుపుకుంటున్న సందర్భంలో కొన్ని శక్తులు ఈ మతఘర్షణలకు కుట్రపన్నినమాట నిజం. కుమిల్లా నగరం సమీపంలోని దుర్గాదేవి పూజామండపంలో ఖురాన్‌కు అవమానం జరిగిందన్న ఆరోపణతో రేగిన ఈ హింస అతివేగంగా చాలా ప్రాంతాలకు విస్తరించింది. దశాబ్దాలుగా హిందూ ముస్లింలు ప్రశాంతంగా బతుకుతున్న గ్రామాలు కూడా నేలమట్టమై, ఆలయ విధ్వంసాలు, హత్యలూ అకృత్యాలూ జరిగిపోయాయి. ప్రస్తుతం పరిస్థితి కాస్తంత అదుపులో ఉన్నట్టు కనిపిస్తున్నా, ఏ క్షణాన ఏమైనా జరగవచ్చునన్న భయంలో మైనారిటీ హిందువులు ఉన్నారు. నిప్పురేగిన వెంటనే బంగ్లాదేశ్‌ ప్రధాని ‌షేక్‌ హసీనా ఢాకాలోని ఓ హిందూదేవాలయంలో భక్తులను ఉద్దేశించి మంచి మాటలు చెప్పారు. విద్వేషాలకు, హింసకు కారకులైనవారిని వెంటాడి వేటాడతామన్న హామీ కచ్చితంగా ఊరట కలిగించేదే. మెజారిటీ హింసను పాలకులు చూసీచూడనట్టు వదిలేస్తున్న పాడుకాలంలో ఒక చిన్నదేశం పాలకురాలినుంచి ఇంత ఘాటైన మాటలు రావడం, మైనారిటీలకు బలమైన హామీ లభించడం ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ కలిగించేవే.


ఈ హామీతో పాటుగానే ఆమె భారతదేశాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. తమ దేశంలోని హిందువుల భద్రతను భారతదేశ నాయకులతో ముడిపెట్టారామె. మతతత్వంపై పోరాటానికి పొరుగుదేశం కూడా సహకరించాలనీ, బంగ్లాదేశ్‌కూ, ఆదేశంలోని హిందువులకూ కీడు చేసే ఏ పనీ చేయకుండా భారత్‌లో అధికారంలో ఉన్నవారు జాగ్రత్తపడాలన్నది ఆ వ్యాఖ్యల సారాంశం. తమదేశంలోని హిందువుల భద్రత భారతదేశ నాయకుల వ్యవహారశైలిపై ఆధారపడివుంటుందని హెచ్చరిస్తున్నారు ఆమె. తన పౌరుల భద్రతకు హామీ పడుతున్నట్టు పైకి కనిపిస్తూనే తనదేశంలో జరుగుతున్నదానికి పొరుగుదేశం వ్యవహారశైలితో లంకెపెడుతున్నారు. గతంలో హోంమంత్రి అమిత్‌ షా సహా అనేకమంది బీజేపీ నాయకులు అక్రమవలసల పేరిట పొరుగుదేశంపై కఠినవ్యాఖ్యలు చేసినప్పటికీ, బంగ్లా ప్రభుత్వం బహిరంగంగా మాట్లాడిందేమీ లేదు. ఇప్పుడు హసీనా భారతదేశం తన పరిస్థితులను సరిదిద్దుకోవాలనీ, మైనారిటీ వ్యతిరేక ధోరణులు, దాడులపై దృష్టిపెట్టాలనీ చెబుతున్నారు. అవామీలీగ్‌ పార్టీ సెక్యులర్‌ అనీ, మతరాజకీయాలకు దూరంగా ఉంటుందనీ అంటారు. కానీ, ఇప్పుడు ఆ పార్టీకి చెందిన నాయకులు కూడా హిందువులపై జరుగుతున్న దాడుల్లో పాల్గొన్నారని విమర్శలు వచ్చాయి. భారతదేశంలో పాలకుల హిందూత్వ విధానాలు, మైనారిటీలపై జరిగిన వరుస దాడులు బంగ్లాదేశ్‌లో తీవ్రచర్చకు దారితీశాయనీ, మరీ ముఖ్యంగా ఇక్కడి పౌరసత్వ సవరణ చట్టం అక్కడ తీవ్ర ప్రభావాన్ని వేసిందనీ అంటారు. భారత్‌లో మైనారిటీలకు రక్షణలేకుండా పోతున్నదన్న భావన విస్తృతంగా వ్యాపించడంతో బంగ్లాదేశీ నాయకులు కూడా గతంలో మాదిరిగా అక్కడి హిందువుల పక్షాన గట్టిగా నిలబడలేకపోతున్నారట. బీజేపీ పాలిత సరిహద్దు రాష్ట్రాల్లోని మత రాజకీయాలు, నాయకుల వ్యాఖ్యలు పొరుగుదేశాన్ని మరింతగా ప్రభావితం చేస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు కొత్తేమీ కాదు. ఏడుదశాబ్దాల క్రితం దాదాపు ముప్పైశాతం ఉన్న అక్కడి హిందూజనాభా ఇప్పుడు మూడోవంతుకు పడిపోయింది. ఇప్పుడు మిగిలినవారిని తరిమికొట్టాలన్న మతతత్వశక్తుల ఆలోచనను పరిస్థితులు సులభం చేస్తున్నాయి. హసీనా ఆ వ్యాఖ్యలను ఆత్మరక్షణకో, ఎదురుదాడికో చేసినప్పటికీ, భారతపాలకులు వాటిని సానుకూలంగా స్వీకరించగలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇరుదేశాలూ తమ మైనారిటీల భద్రతకు కట్టుబడితే పరిస్థితుల్లో మార్పువస్తుంది.

Updated Date - 2021-10-20T08:25:49+05:30 IST