ఉత్తుత్తి యుద్ధం!

ABN , First Publish Date - 2021-06-27T06:04:06+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లోని రాజకీయ నాయకుడు మళ్లీ నిద్ర లేచాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏడేళ్లకు ఆయన కాంగ్రెస్‌ నాయకులకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు....

ఉత్తుత్తి యుద్ధం!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లోని రాజకీయ నాయకుడు మళ్లీ నిద్ర లేచాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏడేళ్లకు ఆయన కాంగ్రెస్‌ నాయకులకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమను కూడా కోనసీమలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని గతంలో ప్రకటించిన కేసీఆర్‌, ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇప్పుడు నిప్పులు చెరగడం మొదలెట్టారు. అదే సమయంలో మూడురోజుల పాటు జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ మయసభలను ఆవిష్కరింపజేశారు. అంతేనా, ప్రగతి భవన్‌లో ఆదివారంనాడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ నాయకుల ముఖం చూడ్డానికి కూడా ఏడేళ్లుగా ఇష్టపడని కేసీఆర్‌, శుక్రవారం అడిగిందే తడవుగా భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌ రెడ్డి తదితరులను కలవడానికి అంగీకరించారు. వారు కోరినట్టుగా... పోలీసు కస్టడీలో చనిపోయిన దళిత మహిళ మరియమ్మ కుటుంబానికి ఇల్లు, కుమారుడికి ఉద్యోగం, పదిహేను లక్షల నగదు, కుమార్తెలకు పది లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించడానికి అంగీకరించారు. దీంతో ఇన్నేళ్ల తర్వాత కేసీఆర్‌ ప్రజాస్వామ్యవాదిగా మారడానికి కారణం ఏమిటా? అని రాజకీయ పరిశీలకులు ఆరా తీస్తున్నారు. రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడు 360 డిగ్రీస్‌లో వైఖరి మార్చుకుని కొత్తరూపాన్ని ప్రదర్శించడం కేసీఆర్‌కు కొత్తేమీ కాదు. ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మంత్రులను ఉసిగొల్పుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డిని తిట్టించడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు సవాలుగా మారిన భారతీయ జనతాపార్టీని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ నాయకులకు కోరిందే తడవుగా అపాయింట్‌మెంట్‌ ఇచ్చి గౌరవించారు. ఈ మార్పులన్నీ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను దృష్టిలో పెట్టుకుని కాదుకదా? అన్న సందేహం సహజంగానే కలుగుతుంది. ఈటలను ఎప్పటినుంచో దూరం పెట్టిన కేసీఆర్‌, తాజాగా మంత్రివర్గం నుంచి కూడా బర్తరఫ్‌ చేసి ఆయనపై భూకబ్జా కేసులు పెట్టించారు. దీంతో రాజేందర్‌ కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా బీజేపీలో చేరిపోయి హుజూరాబాద్‌లో జరగబోయే ఉపఎన్నికలో తన సత్తా చూపించాలని నిర్ణయించుకున్నారు. ఈటల రాజేందర్‌ తెలంగాణ రాష్ట్రసమితికి దూరమయ్యారో లేదో, అప్పటివరకూ నిరాదరణకు గురవుతున్న హరీశ్‌రావ్‌ వంటి వారు కేసీఆర్‌కు సన్నిహితమైపోయారు. పార్టీకి చెందిన సీనియర్లు ఎవరూ ఈటల వైపు చూడకుండా కేసీఆర్‌ ఈ ఎత్తుగడ వేసి ఉంటారు. కొంతకాలంపాటు మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ప్రగతిభవన్‌కు దూరంగా ఉంచిన హరీశ్‌రావును మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాకుండా ఈటలపై వేటు వేసిన నాటి నుంచి సమీక్షా సమావేశాల్లో తన పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారు. అంతేనా, చాలాకాలంగా నిరాదరణకు గురవుతున్న కడియం శ్రీహరి వంటి వారిపై కూడా కేసీఆర్‌కు ప్రేమ పుట్టుకొచ్చింది. గతంలో వరంగల్‌ ఎప్పుడు వెళ్లినా కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఇంట్లోనే భోజనం చేస్తూ వచ్చిన కేసీఆర్‌, తాజా పర్యటనలో మాత్రం కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి విందారగించారు. తనకు అవసరమైనప్పుడు అక్కరకొచ్చే వాళ్లను నెత్తిన పెట్టుకోవడం, మోజు తీరగానే వారిని విసిరికొట్టడం కేసీఆర్‌కు అలవాటేనని తెలంగాణ సమాజం చాలా రోజుల కిందటే గ్రహించింది.


ఆగిన పట్టాభిషేకం... ఏమిటి కారణం?

కేసీఆర్‌ ఏం చేసినా రాజకీయ పరమార్థం ఉంటుంది. ప్రస్తుత మార్పులను కూడా ఆ కోణంలోనే చూడాలి. కొంతకాలం క్రితం తన బదులు కుమారుడైన కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్‌ తలపోశారు. గత మే నెలలోనే కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరిగింది. తన కుమారుడు ముఖ్యమంత్రి అయ్యాక ఇబ్బందులు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో కొంతమంది సీనియర్‌ నాయకులను కేసీఆర్‌ డంప్‌లో పడేశారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదుగానీ, జూన్‌ నెల కూడా ముగుస్తున్నా కేటీఆర్‌ మాత్రం ముఖ్యమంత్రి కాలేదు. ఇప్పుడు హుజూరాబాద్‌కు ఉపఎన్నిక జరగనున్నందున అది పూర్తయ్యేవరకు కేటీఆర్‌కు నిరీక్షణ తప్పదు. హుజూరాబాద్‌లో పార్టీ అభ్యర్థి విజయం సాధించని పక్షంలో కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్‌ బలంగా నిర్ణయించుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చకపోవడానికి ఎంపీ సంతోష్‌కుమార్‌ తెర వెనుక నడిపిన మంత్రాంగమే కారణమని తెలంగాణ రాష్ట్రసమితి నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. అంతఃపురంలో ఏదో గూడుపుఠాణీ జరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ ఈటల రాజేందర్‌ ఇప్పుడు కేసీఆర్‌కు ప్రధాన టార్గెట్‌గా మారారు. దీంతో పాతవే అయినా తెలంగాణ సెంటిమెంటు వంటి అంశాలను ఆయన మళ్లీ తెర మీదకు తెస్తున్నారు. దాదాపు ఏడాది క్రితమే టెండర్లు పిలిచిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేసీఆర్‌ అండ్‌ కో ఇప్పుడు హడావిడి చేస్తున్నారు. నిజానికి రాయలసీమ ఎత్తిపోతల పనులు అరకొరగానే సాగుతున్నాయి. ఆ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు ఇంతవరకు బిల్లుల రూపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. కేంద్రప్రభుత్వ అనుమతి లేనందున ఆ పథకానికి రుణం ఇవ్వడానికి ఆర్థికసంస్థలు కూడా ముందుకు రావడం లేదు. అయినా దివంగత రాజశేఖర రెడ్డిని నరరూప రాక్షసుడు అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో తిట్టించారు. తన తండ్రిని అంతటి పరుష పదజాలంతో దూషిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాత్రం నోరు విప్పడం లేదు. తెలంగాణ ప్రభుత్వంలోని వారు ఎంత రెచ్చగొట్టినా తాము రెచ్చిపోబోమని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు తేల్చి చెప్పారు. దీంతో రెండు రాష్ర్టాల మధ్య రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట సాగుతున్న దూషణభూషణలన్నీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగం కాదు కదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. వారు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే తాము కృష్ణానది దిగువ, ఎగువల్లో బ్యారేజీలు నిర్మించి నీటిని వాడుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా ప్రతిపాదిత ప్రాజెక్టులకు సర్వే నిర్వహించవలసిందిగా అధికారులను ఆదేశించింది. కేంద్రప్రభుత్వ ఆమోదం లేకుండా నిర్మించే ఏ ప్రాజెక్టుకు కూడా ఇకపై ఆర్థికసంస్థలు రుణసహాయం చెయ్యవు. కొత్త ప్రాజెక్టులు కట్టడానికి తెలంగాణ దగ్గర డబ్బు లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వద్ద అంతకంటే లేదు. అయినా తమ ముఖ్యమంత్రులు పొరుగు రాష్ట్రంతో రాజీ పడకుండా ప్రాజెక్టులు కట్టేస్తున్నారని ఆయా ప్రాంతాల ప్రజలు భావించేలా చేయడమే ప్రస్తుత రాద్ధాంతంలోని పరమార్థం అయి ఉండొచ్చు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌లో పలువురు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. తెలంగాణలో కూడా ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ అండ్‌ కో చేస్తున్న దూషణల వల్ల రాయలసీమలో జగన్‌ రెడ్డికి ఎంతో కొంత ప్రయోజనం చేకూరే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో కుటుంబ సమేతంగా తన ఇంటికి ఆహ్వానించి సత్కరించి మరీ ఆతిథ్యం ఇచ్చిన జగన్‌ రెడ్డితో కేసీఆర్‌ తలపడుతున్నారని తెలంగాణ ప్రజలు భావిస్తే ఆయన లక్ష్యం కూడా నెరవేరుతుంది. తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసం తాను రాజీపడబోనని ప్రజలు నమ్మాలని కేసీఆర్‌ భావిస్తుంటారు. మంత్రులు తన తండ్రిని దూషించడంపై తెలంగాణలో సొంత పార్టీ ప్రారంభిస్తున్న వైఎస్‌ షర్మిల తీవ్ర అభ్యంతరం చెప్పారు గానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి మాత్రం కిమ్మనడం లేదు. కేసీఆర్‌, జగన్‌ మధ్య సఖ్యత నిజంగా చెడిందని చెప్పలేం. వారి మధ్య అన్నదమ్ముల అనుబంధం కొనసాగుతూనే ఉంది. కేసీఆర్‌ను ఎదిరిస్తే జగన్‌ రెడ్డికి తెలంగాణలో ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తున్న కేసీఆర్‌ అండ్‌ కోను ప్రతిఘటించడం ఎందుకు అని జగన్‌ రెడ్డి అనుకుంటున్నారేమో తెలియదు. ఏదిఏమైనా రాజశేఖర రెడ్డిని తెలంగాణ ప్రజల ముందు మళ్లీ విలన్‌గా నిలబెట్టడం ద్వారా తెలంగాణలో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న షర్మిలను దెబ్బతీయొచ్చన్నది కేసీఆర్‌ అండ్‌ కో వ్యూహం అయి ఉండవచ్చన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. షర్మిల పార్టీ వల్ల తమకు ఎంతో కొంత నష్టం జరుగుతుందని టీఆర్‌ఎస్‌ నాయకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆమె కేసీఆర్‌ను ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ ప్రతి విమర్శ చేయడం లేదనీ, విమర్శించినప్పుడల్లా స్పందించడం ద్వారా ఆమెను పెద్ద నాయకురాలిగా చేయడం తమకు ఇష్టం లేదని టీఆర్‌ఎస్‌ ముఖ్యుడొకరు చెప్పారు. దీన్నిబట్టి ఈటల రాజేందర్‌తో పాటు షర్మిలను కూడా దృష్టిలో పెట్టుకునే కేసీఆర్‌ తాజా రాజకీయ ఎత్తుగడకు తెర తీశారని చెబుతున్నారు. కాంగ్రెస్‌ నాయకులను కలుసుకోవడం ద్వారా హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ శ్రేణులలో అయోమయం సృష్టించి వారిని తమ వైపునకు తిప్పుకోవాలన్న ఆలోచనతోనే అడిగిన వెంటనే ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్‌ నాయకులకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ ‘బీ టీమ్‌’ అని తాము చెబుతున్నది ఇప్పుడు రుజువవుతోందని బీజేపీ నాయకులు ప్రచారం చేయడం మొదలెట్టారు. హుజూరాబాద్‌లో పోరు మొత్తం ఈటలకు, టీఆర్‌ఎస్‌కు మధ్య మాత్రమే కేంద్రీకృతం కావాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ, కాంగ్రెస్‌ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేని పక్షంలో దుబ్బాకలోవలె టీఆర్‌ఎస్‌కే నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్‌ ఓటు అంటేనే తెలంగాణ రాష్ట్రసమితి వ్యతిరేక ఓటు. కాంగ్రెస్‌ పార్టీ పోటీలో లేదని ఓటర్లు భావిస్తే వారు కేసీఆర్‌కు వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇక షర్మిల తన తండ్రి వైఎస్‌ఆర్‌ పేరిట పార్టీ పెడుతున్నందున, రాజశేఖర్‌ రెడ్డిని తెలంగాణ సమాజం ముందు విలన్‌గా నుంచోబెట్టడం ద్వారా తెలంగాణలో ఆమెకు స్థానం లేకుండా చేయాలన్నది టీఆర్‌ఎస్‌ వ్యూహంగా చెబుతున్నారు.


ఊరక రారు..

‘ఊరక రారు మహానుభావులు’ అన్నట్టుగా ప్రగతిభవన్‌ లేదా ఫాంహౌస్‌కే పరిమితమయ్యే కేసీఆర్‌, తాజాగా జరిపిన జిల్లాల పర్యటనల వెనుక కూడా పరమార్థం ఉంది. రాజకీయంగా అవసరం అనుకుంటే తప్ప కేసీఆర్‌ కాలు బయటపెట్టరు. హైదరాబాద్‌లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారిని సైతం ఆయన కలుసుకోరు. అటువంటిది జిల్లా కలెక్టర్‌, ఎస్పీల కార్యాలయాలకు నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించడానికి తిరిగారంటే పరమార్థం లేకుండా ఎందుకుంటుంది? ఈ సందర్భంగా కేసీఆర్‌ యథావిధిగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. ప్రపంచంలోకెల్లా గొప్ప ఆసుపత్రి కెనడాలో ఉందనీ, వరంగల్‌లో 33 అంతస్థులతో నిర్మిస్తున్న ఆసుపత్రి ఆ స్థాయిలో ఉంటుందని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. నిజానికి ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ ఆసుపత్రి అమెరికాలోని మయో క్లినిక్‌. దాని వార్షికబడ్జెట్‌ మన తెలుగు రాష్ర్టాల వార్షిక బడ్జెట్‌ కంటే ఎక్కువ అని అంటారు. ర్యాంకింగ్‌లో నాలుగో స్థానంలో ఉన్న కెనడాలోని జనరల్‌ ఆసుపత్రి వంటి దాన్ని వరంగల్‌లో నిర్మిస్తానని, ఆ ఆస్పత్రి ఎలా ఉందో చూసి రావడానికి కెనడా వెళ్లాలని అధికారులకు కేసీఆర్‌ సూచించారు. అంతేనా, ఏడాదిన్నరలోపే సదరు బృహత్తర ఆసుపత్రి నిర్మాణం పూర్తిచేయాలని కూడా ఆయన ఆదేశించారు. హైదరాబాద్‌లో ఐదేళ్ల క్రితం ప్రారంభించిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు కానీ వరంగల్‌లో 33 అంతస్థుల ఆసుపత్రి ఏడాదిన్నరలో పూర్తి చేస్తానంటే నమ్మాలా? ఏదైనా ప్రపంచస్థాయిలో నిర్మించాలని కేసీఆర్‌ తలపోస్తుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థికపరిస్థితి అందుకు సహకరిస్తుందా అని ఆయన ఆలోచించరనుకుంటా! వెళ్లిన చోటల్లా ఒక మయసభను నిర్మించి వస్తుంటారు. గతంలో పాతబస్తీని ఇస్తాంబుల్‌ చేస్తాననీ, కరీంనగర్‌ను లండన్‌ చేస్తాననీ, హైదరాబాద్‌ను ఇంకేదో చేస్తానని చెప్పిన మాటలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. తెలుగు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నవారు తాము చేస్తామని చెబుతున్నవన్నీ ప్రపంచానికే ఆదర్శంగా ఉంటాయని ప్రకటిస్తుంటారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటాయి. కేసీఆర్‌ మదిలో ఆవిష్కృతమైన పలు ప్రతిపాదనలు కార్యరూపం కూడా దాల్చలేదు. అయినా హుజూరాబాద్‌ గండం గట్టెక్కడానికి అప్పటి వరకూ మాయామహళ్లు నిర్మిస్తూనే ఉంటారు. ఉపఎన్నికలు ఎక్కడ జరిగినా, ఫలితాల తర్వాత తానే స్వయంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానని చెప్పడం కేసీఆర్‌కు అలవాటే. గతంలో హుజూర్‌నగర్‌కు జరిగిన ఉపఎన్నిక సందర్భంగా కూడా ఇలాగే చెప్పారు. కానీ ఇంతవరకు ఆ నియోజకవర్గం ముఖం కూడా చూడలేదు. 


జీసస్‌ చెప్పారట!

ఇదే వరంగల్‌ పర్యటన సందర్భంగా కరోనా వైరస్‌ గురించి కేసీఆర్‌ చాలా తేలికగా మాట్లాడారు. తనకు కూడా కరోనా సోకిందని... పారాసిటమాల్‌, డోలో వేసుకుంటే తగ్గిపోయిందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడ్డం అత్యంత అభ్యంతరకరం. కరోనా వైరస్‌ దేశంలోకి ప్రవేశించినప్పుడు కూడా గత ఏడాది కేసీఆర్‌ ఇలాగే మాట్లాడారు. ఆ తర్వాత ఏం జరిగిందో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనం చూశాం. రెండవ దశలో వైరస్‌ మరింతగా వ్యాపించడం వల్ల ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలింది. కేసుల సంఖ్యను, మరణాలను తక్కువ చేసి చూపించినంత సులువు కాదు కరోనాను నివారించడం అని కేసీఆర్‌ ఎప్పుడు తెలుసుకుంటారో! కరోనా వైరస్‌ ఏమీ చేయదని, మీడియా వార్తల వల్ల ప్రజలు భయానికిలోనై ఎక్కువగా చనిపోయారని కూడా ముఖ్యమంత్రి ఒక పిట్టకథ సాయంతో చెప్పుకొచ్చారు. అదే నిజమైతే, తనకు కరోనా వైరస్‌ సోకినప్పుడు ఇదే కేసీఆర్‌ ఎందుకంతలా భయపడ్డారో చెప్పాలి. డాక్టర్లను రెండు వారాల పాటు ఫాంహౌస్‌కే పరిమితం చేసి తనవద్దే ఉంచుకోవడం ఎందుకో? ఇంజెక్షన్‌ చేయించుకోవాలన్నా కేసీఆర్‌ వణికిపోతుంటారు. ఆయన చేతికి కాన్యులా పెట్టడానికి డాక్టర్లు నానా అవస్థా పడ్డారు. ఇది వాస్తవం. తనకు నెగెటివ్‌ రిపోర్టు వచ్చే వరకు అంతగా హైరానా పడిన కేసీఆర్‌... ఇప్పుడు కరోనా వైరస్‌ను తేలిక చేసి మాట్లాడటం బాధ్యతారాహిత్యం కాదా? ప్రాణాలకు ముప్పు లేనప్పుడు తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎందుకు పెట్టారో చెప్పగలరా? ప్రజలను నవ్వించడానికి ఏది పడితే అది మాట్లాడే ముందు తాను ముఖ్యమంత్రిని అన్న విషయం కేసీఆర్‌ గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కూడా గత ఏడాది ప్రారంభంలో కరోనా గురించి ఇలాగే చులకనగా మాట్లాడారు. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న దశలో, గత ఏడాది మార్చి 25వ తేదీన అధికారుల వద్ద ఆయన అన్న మాటలు తెలిస్తే ఎవరికైనా కళ్లు తిరుగుతాయి. కరోనా వ్యాప్తి పెరుగుతోందని అధికారులు చెప్పే ప్రయత్నం చేయగా, ‘కరోనా వైరస్‌ లేదూ ఏమీ లేదు. నేను రాత్రి జీసస్‌తో మాట్లాడాను. అసలు వైరస్‌ లేదు. భయపడవద్దు అని జీసస్‌ చెప్పారు’ అని జగన్‌ రెడ్డి అనడంతో అధికారులు అవాక్కయ్యారు. ముఖ్యమంత్రిపై జీసస్‌ ప్రభావం ఇంతలా ఉంటుందనీ, తాను జీసస్‌తో మాట్లాడాననే స్థితికి ఆయన చేరుకున్నారని తాము ఊహించలేదని ఆ సమయానికి అక్కడే ఉన్న అధికారి ఒకరు చెప్పారు. అయినా అధికారులు కల్పించుకుని, ‘మీరు చెప్పింది నిజమే కావచ్చు. కానీ, కరోనా వైరస్‌ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ప్రకటించారు’ అని సీఎంతో అన్నారు. దీంతో ఉగ్రుడైన జగన్‌, ‘నాకు చెప్పకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారు?’ అని ఊగిపోయారట. తాను దైవదూతనని అప్పుడప్పుడూ ఆయన అధికారుల వద్ద అంటూ ఉంటారట. బహుశా అందుకే కాబోలు జగన్‌ రెడ్డి మూతికి మాస్కు కూడా పెట్టుకోరని మరో అధికారి చమత్కరించారు. గతంలో పదవీ విరమణ చేసిన ఒక ఐఏఎస్‌ అధికారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరాలనుకుని జగన్‌ రెడ్డిని కలిశారు. ఆ సందర్భంగా జగన్‌ రెడ్డి మాట్లాడుతూ, తాను ప్రతిరోజూ రాత్రి 12 గంటలకు దివంగత రాజశేఖర రెడ్డితో చర్చిస్తానని చెప్పుకొచ్చారట! ఎప్పుడో చనిపోయిన రాజశేఖర రెడ్డితో మాట్లాడ్డం ఏమిటా? అని ఆశ్చర్యపోయిన సదరు అధికారి మళ్లీ అటువైపు తిరిగి చూడలేదట! ఈ అనుభవాన్ని ఆయనే స్వయంగా తన సన్నిహితులతో పంచుకున్నారు. ఏదేమైనా కరోనా వైరస్‌ గురించి తేలికగా మాట్లాడ్డం తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఫ్యాషన్‌గా మారింది. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడంలో ప్రజలు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లనే వైరస్‌ వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు, వైద్యులు ఒకవైపు మొత్తుకుంటుండగా ‘అబ్బే కరోనా లేదు గిరోనా లేదు’ అని ప్రచారం చేయడం ఏమిటి? తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు తమదైన ఎజెండాలతో ముందుకు సాగుతున్నారు. పగ, ప్రతీకారమే జగన్‌ రెడ్డి ఎజెండా కాగా... ఈటల రాజేందర్‌ను రాజకీయంగా సమాధి చేయడమే ప్రస్తుతానికి కేసీఆర్‌ ఎజెండా! హుజూరాబాద్‌ ఉపఎన్నిక జరిగే వరకూ రాయలసీమ ఎత్తిపోతల పథకం వంటివి తెరమీదకు వస్తూనే ఉంటాయి. కేసీఆర్‌ అధికారబలాన్ని ఎదుర్కోవడానికే ఈటల రాజేందర్‌ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు. 


జగన్‌ ఉంటేనే తెలంగాణకు మేలట!

అవతల వాడి బలహీనతే అప్పుడప్పుడూ మన బలం అవుతుంది. తెలంగాణలో పెట్టుబడులు పెరుగుతుండగా ఆంధ్రప్రదేశ్‌లో పలు సంస్థలు తమ ప్రతిపాదనలను విరమించుకుంటున్నాయి. పరిశ్రమల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి పెద్దగా ఆసక్తి ఉన్నట్టు కనిపించడం లేదు. పెట్టుబడులకు అనువైన వాతావరణం సృష్టించకపోవడం వల్లనే రిలయన్స్‌, ట్రైటాన్‌ వంటి సంస్థలు తమ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ట్రైటాన్‌ కంపెనీ ఇప్పుడు తెలంగాణలోని జహీరాబాద్‌ వద్ద ఎలక్ర్టిక్‌ వాహనాలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకుంది. తమ రాష్ట్రం నుంచి ఈ కంపెనీ వెళ్లిపోవడానికి ఎవరు కారణమో నీలిమూక ఆత్మపరిశీలన చేసుకోవాలి. తిరుపతిలో పెట్టుబడుల ప్రతిపాదనను రిలయన్స్‌ సంస్థ ఉపసంహరించుకుంది. నిజానికి తిరుపతి వద్ద సదరు పెట్టుబడి పెట్టడానికి రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ అంత సుముఖత వ్యక్తంచేయలేదు. అయితే గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనపై ఒత్తిడి తెచ్చి మరీ ఒప్పించారు. ఆ సంస్థకు కేటాయించిన భూమిలో కొంత వివాదంలో పడింది. దీంతో ముఖేష్‌ అంబానీ తాజా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం నుంచి వెళ్లిపోవద్దని కోరుతూ అంబానీకి ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది. లేఖ రాసి సరిపెట్టకుండా ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి ముఖేష్‌ అంబానీని కలిసి ఉంటే ఫలితం ఉండేది. మొన్న ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, నిన్న ట్రైటాన్‌.. ఇలా కంపెనీలన్నీ క్యూ కట్టి వెళ్లిపోవడం రాష్ర్టానికి తీవ్ర నష్టం చేస్తుంది. పెట్టుబడిదారులలో ఆంధ్రప్రదేశ్‌ పట్ల నెగెటివ్‌ అభిప్రాయం ఏర్పడుతుంది. ఫలితంగా భవిష్యత్తులో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారు. ఈ పరిస్థితి తెలంగాణకు కలసివస్తోంది. ప్రభుత్వం పెద్దగా ప్రయత్నం చేయకుండానే ట్రైటాన్‌ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అభివృద్ధికి జగన్‌ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారని సోషల్‌ మీడియాలో ప్రచారమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ అభివృద్ధికి ఢోకా ఉండదని ఎన్నికలకు ముందే కేసీఆర్‌ పార్టీ ముఖ్యుల వద్ద చెప్పారు. అంతా ఆయన అంచనా ప్రకారమే జరుగుతోంది. అంటే జగన్‌ రెడ్డిని కేసీఆర్‌ బాగానే స్టడీ చేశారన్న మాట. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి సుదీర్ఘ కాలం ఉండాలని కూడా కేసీఆర్‌ కోరుకుంటున్నారట. అదే నిజమైతే జగన్‌ పైన, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి పైన మంత్రులు చేస్తున్న మాటల దాడి ఉత్తుత్తిదేనని అనుకోవాలి. జగన్‌కు రాజకీయంగా నష్టం జరిగే పని కేసీఆర్‌ అండ్‌ కో చేయబోరు అని భావించవచ్చు. అంతా ఉభయ కుశలోపరి వ్యవహారమే!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Read more