జగన్-షర్మిల మధ్య తీవ్ర ఘర్షణ.. ఇక అన్నతో అమీతుమీ?

ABN , First Publish Date - 2021-12-26T06:10:44+05:30 IST

దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ అనుభవిస్తున్న మానసిక క్షోభ పగవాడికి కూడా ఎదురవకూడదు. క్రిస్మస్‌ సందర్భంగా రాజశేఖరరెడ్డి కుటుంబసభ్యులు అందరూ ఇడుపులపాయకు చేరుకుని పండుగ జరుపుకుంటారు...

జగన్-షర్మిల మధ్య తీవ్ర ఘర్షణ.. ఇక అన్నతో అమీతుమీ?

దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ అనుభవిస్తున్న మానసిక క్షోభ పగవాడికి కూడా ఎదురవకూడదు. క్రిస్మస్‌ సందర్భంగా రాజశేఖరరెడ్డి కుటుంబసభ్యులు అందరూ ఇడుపులపాయకు చేరుకుని పండుగ జరుపుకుంటారు. ఎప్పటి నుంచో వస్తున్న ఈ పద్థతి ఇప్పుడు చెల్లాచెదురైంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ క్రిస్మస్‌కు కూడా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల గురువారానికి ఇడుపులపాయకు చేరుకున్నారు. అయితే గురువారం రాత్రి ఇడుపులపాయ అతిథిగృహంలో జరిగిన సంఘటనతో వైఎస్‌ కుటుంబంలోని అంతఃకలహాలు బట్టబయలయ్యాయి. గురువారం రాత్రి అతిథిగృహంలోనే బస చేసిన రాజశేఖరరెడ్డి కుటుంబసభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అన్న జగన్మోహన్‌రెడ్డి, చెల్లి షర్మిల మధ్య ఘర్షణ జరిగి మాటామాటా పెరిగింది. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన షర్మిల గురువారం రాత్రికి రాత్రి అతిథి గృహం నుంచి బయలుదేరి హైదరాబాద్‌ చేరుకున్నారు. కన్నకూతురు కోపంగా వెళ్లిపోవడంతో తల్లి విజయమ్మ కూడా అదేరోజు రాత్రి ఇడుపులపాయలోని తన గృహానికి వెళ్లిపోయారు. జగన్మోహన్‌రెడ్డి మాత్రమే అతిథిగృహంలో బస చేశారు. ఈ విభేదాల ప్రభావం మరుసటి రోజు శుక్రవారం ఉదయం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించే సమయంలో కూడా కనిపించింది. జగన్మోహన్‌రెడ్డి మందీమార్బలంతో తండ్రి సమాధి వద్ద నివాళులర్పించగా, విజయమ్మ మాత్రం కేవలం ఒకరిద్దరు బంధువులతో కలిసి భర్త సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఆమె పరిస్థితి చూసిన వారికి కడుపు తరుక్కుపోకుండా ఉండదు. కన్నబిడ్డలు జగన్‌, షర్మిల గొడవపడడంతో విజయమ్మ ఒంటరిగా మిగిలిపోయారు. కుమార్తె షర్మిలకు అన్యాయం జరుగుతోందని తెలిసినా కొడుకు జగన్‌రెడ్డిని నిలదీయలేని నిస్సహాయత ఆమెది. రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడు గౌరవ మర్యాదలు అందుకున్న విజయమ్మ ఇప్పుడు అందరూ ఉండి, అన్నీ ఉండి కూడా ఒంటరిగా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. మరోవైపు రాజశేఖరరెడ్డి గారాల తనయ షర్మిల తనకు అన్యాయం చేస్తున్న సోదరుడు జగన్‌రెడ్డికి ఎలా గుణపాఠం చెప్పాలా అని మథనపడుతున్నారు. గురువారం రాత్రి అన్నాచెల్లెళ్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడానికి ఆస్తుల వివాదమే కారణంగా తెలుస్తోంది. కుటుంబ ఆస్తులన్నీ పిల్లలు ఇద్దరికీ సమానంగా దక్కుతాయని జీవించి ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డి చెప్పేవారన్నది షర్మిల వాదన. తన హఠాన్మరణాన్ని ఊహించని రాజశేఖరరెడ్డి ఆస్తుల పంపకం విషయమై రాతకోతలు జరపలేదు. ఈ కారణంగానే తోడబుట్టినవారి మధ్య గొడవలు మొదలయ్యాయి. గురువారం రాత్రి ఈ ఆస్తుల వ్యవహారం అన్నాచెల్లెళ్ల మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా షర్మిల తనకు తలనొప్పిగా మారిందని జగన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణలో రాజకీయపార్టీని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించిన ఆయన, చెల్లిని నిలువరించే ప్రయత్నం చేసి విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్తిలో వాటా గురించి షర్మిల ప్రస్తావించగా జగన్‌రెడ్డి ఆమెపై విరుచుకుపడినట్టు తెలిసింది. ‘తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టి నాకు తలనొప్పి తెచ్చావు. అది చాలక ఆస్తుల్లో సమాన వాటా కావాలని గొడవ చేస్తున్నావు. ఇలా అయితే ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు. ఏం చేసుకుంటావో చేసుకో పో!’ అని ఆయన చెల్లిపై మండిపడ్డట్టు విశ్వసనీయ సమాచారం. షర్మిల కూడా వెనక్కి తగ్గకుండా అన్నతో అదేస్థాయిలో వాగ్యుద్ధానికి దిగారు. ‘నాకు న్యాయం ఎలా జరగదో నేనూ చూస్తాను!’ అంటూ ఆమె అప్పటికప్పుడు అతిథి గృహం నుంచి బయటికొచ్చి రోడ్డుమార్గంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. తన కళ్ల ముందే ఇద్దరు బిడ్డలు కలహించుకుంటున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన విజయమ్మ, కూతురి కారులోనే ఎక్కి ఇడుపులపాయలోని తన ఇంటి వద్ద దిగిపోయారు. ఈ కారణంగానే శుక్రవారం ఉదయం కుమారుడి వెంట వెళ్లకుండా విజయమ్మ ఒంటరిగానే భర్త సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఏకాకిలా కనిపించారు. ఇడుపులపాయ అతిథిగృహం సాక్షిగా అన్నాచెల్లెళ్ల మధ్య జరిగిన గొడవ భవిష్యత్తులో ఏ పరిణామాలకు దారితీస్తుందో తెలియక రాజశేఖరరెడ్డి బంధువర్గం ఆందోళన చెందుతోంది.


దెబ్బ కొడితేనే దారికా..?

పట్టుదల విషయంలో షర్మిల.. తన తండ్రి నోట్లో నుంచి ఊడిపడ్డ మనిషే. జగన్మోహన్‌రెడ్డి గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఈ నేపథ్యంలో తోడబుట్టినవారి మధ్య జరిగిన గొడవ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై ప్రభావం చూపుతుందా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఆర్థికంగా ఎక్కడో ఉన్న జగన్‌రెడ్డికి ఇప్పుడు అధికారం కూడా తోడైనందున రాజకీయంగా సోదరుడిని బలహీనపరిస్తే తప్ప ఆస్తుల్లో తన వాటా తనకు దక్కదని షర్మిల అభిప్రాయపడుతున్నట్టు చెబుతున్నారు. సోదరుడితో గొడవ పడి హైదరాబాద్‌ చేరుకున్న షర్మిల.. శుక్రవారం రోజంతా ఒంటరిగా, ముభావంగా ఉండిపోయారని తెలిసింది. జగన్‌రెడ్డి వైఖరి కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇబ్బందులకు గురైన రాజశేఖరరెడ్డి కుటుంబసభ్యులు అందరూ షర్మిలకు అండగా ఉన్నారు. మరోవైపు తండ్రి వివేకానందరెడ్డి హత్యకు కారకులైన వారికి శిక్ష పడాలని కోరుకుంటూ ఆయన ఏకైక కుమార్తె డాక్టర్‌ సునీత ఎక్కని గడప, తట్టని తలుపు లేదు. వివేకా హత్యలో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి, ఆయన తండ్రి భాస్కరరెడ్డికి ప్రమేయం ఉందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి ఆ ఇరువురికీ అండగా ఉంటున్నారు. ఈ పరిణామాన్ని రాజశేఖరరెడ్డి కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీబీఐ దర్యాప్తు చివరిదశకు చేరుకున్నప్పటికీ అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం కనిపిస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రజల హృదయాలలో నిలిచి ఉన్న రాజశేఖరరెడ్డి కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడటం విషాదమే. ఎటువంటి కుటుంబమైనా ఆ కుటుంబ పెద్దను హఠాత్తుగా కోల్పోయినప్పుడు ఇలాగే ఛిన్నాభిన్నమవుతుందేమో! రాజశేఖరరెడ్డి బతికి ఉన్నంతకాలం భాస్కరరెడ్డి కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన గానీ, సాహసం గానీ చేయలేకపోయింది. తమ రాజకీయ ఎదుగుదలకు వైఎస్‌ వివేకానందరెడ్డి అడ్డుగా ఉన్నారని భావించిన వాళ్లు ఆయనను హత్య చేయించారని కూడా ప్రచారంలో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజశేఖరరెడ్డి సొంత కుటుంబసభ్యులందరూ జగన్‌రెడ్డికి పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు సొంత చెల్లి షర్మిల కూడా అన్నతో తెగతెంపులకు సిద్ధపడుతోంది. జగన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నానాటికీ పెరుగుతున్నందున ఇదే అదనుగా ఆయనను రాజకీయంగా దెబ్బ కొట్టాలన్న ఆలోచన కూడా షర్మిల చేస్తున్నట్టు చెబుతున్నారు. తెలంగాణ రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న షర్మిల ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. రాజకీయపార్టీ నిర్వహణకు డబ్బు అవసరం. ఈ పరిస్థితుల్లో కుటుంబపరంగా తనకు దక్కాల్సిన ఆస్తిని కూడా ఇచ్చేది లేదని సోదరుడు జగన్‌రెడ్డి తెగేసి చెప్పడంతో షర్మిలకు ఎటూ పాలుపోని పరిస్థితి ఎదురైంది. తల్లి విజయమ్మ మద్దతు తనకే ఉన్నప్పటికీ ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందున ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా? అని షర్మిల మథనపడుతున్నారు. ఈ క్రమంలో తనకు కావాల్సిన వారితో మంతనాలు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డిని రాజకీయంగా అస్థిరపరిస్తే తప్ప అతను లొంగి రాడని ఒకరిద్దరు ఆమెకు సలహా ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ సలహాను షర్మిల స్వీకరిస్తారో లేదో తెలియదు. ఒకవేళ ఆమె కూడా అదే అభిప్రాయానికి వస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఇబ్బందులు తప్పవు. ఆయన మీద నమోదైన ఈడీ కేసులలో రేపో మాపో విచారణ మొదలు కానుంది. ఈ కేసులలో ఆయనకు శిక్షపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే భార్య భారతీరెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని జగన్‌రెడ్డి తలపోస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం రాత్రి ఇడుపులపాయ అతిథిగృహంలో జరిగిన పరిణామాలతో తోడబుట్టిన వారి మధ్య అంతరం పెరిగిపోయినందున భారతీరెడ్డి ముఖ్యమంత్రి కాకుండా షర్మిల అడ్డుకునే ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు. రాజశేఖరరెడ్డి వారసురాలిగా తమ తల్లి విజయమ్మను తెర మీదకు తీసుకురావాలని షర్మిలపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితులలో అధికారం లేకపోతే తనకు ఆస్తుల్లో న్యాయంగా రావాల్సిన వాటా దక్కబోదని షర్మిల కూడా అభిప్రాయపడుతున్నట్టు చెబుతున్నారు. తెలంగాణ రాజకీయాల గురించి మరచిపోయి ఆమె ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల వైపు చూడటం మంచిదని రాజశేఖరరెడ్డి సన్నిహితులు కొందరు ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ ప్రభావం చూపిస్తే తెలంగాణ రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించి ఆంధ్రప్రదేశ్‌లో సోదరుడు జగన్‌రెడ్డికి పోటీగా పార్టీ పెడతారా లేదా అన్నది వేచిచూడాలి. 

దివంగత రాజశేఖరరెడ్డి కుటుంబ పెద్దగా, ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకోగా ఆయన కుమారుడు ఈ రెండు విషయాల్లోనూ విఫలమయ్యారని చెప్పవచ్చు. ఆస్తులను మాత్రమే ప్రేమించే వారి నుంచి కుటుంబసభ్యులకైనా, ప్రజలకైనా నిజమైన మానురాగాలు లభించవు.


కక్ష సాధింపే నిత్యకృత్యం!

ఇడుపులపాయ వ్యవహారాలను కాసేపు పక్కనపెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు వద్దాం. ప్రభుత్వాధి నేతలు ఎవరైనా ప్రతి ఒక్కరికీ నిర్దుష్టమైన ఎజెండా ఉంటుంది. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ఇప్పటికీ ఆయన ప్రభుత్వ ఎజెండా ఏమిటో అంతుపట్టడం లేదు. 


ఇప్పటివరకు జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే ఆయన ప్రభుత్వం నిర్దేశించుకున్న ఎజెండా.. ‘కక్ష తీర్చుకోవడం, పగ సాధించడం’గానే కనిపిస్తోంది. అయితే తన ఎజెండా అమలులో జగన్‌రెడ్డి పేదలను కవచంగా వాడుకోవడం విశేషం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజలచే, ప్రజల ద్వారా అన్నట్టుగా జగన్‌రెడ్డి అమలు చేస్తున్న కక్ష సాధింపులకు కూడా పేదప్రజల కోసం, పేదలచే, పేదల ద్వారా అని నిర్వచనం తొడుగుతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన కొంతమందిపై పగతో రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలను అమాంతం తగ్గించారు. ఇది వాస్తవం కాగా, పేద ప్రజలకు వినోదం అందుబాటులోకి తీసుకురావడం కోసమే టికెట్ల ధరలను తగ్గిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ప్రజలు కోరుకుంటున్నారు గానీ సినిమా టికెట్ల ధరలు తగ్గించాలని ఎవరూ ఆందోళన చేయలేదు. కొంత మంది హీరోలు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ, అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారని ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి బయోపిక్‌గా నిర్మించిన ‘పాదయాత్ర’ చిత్రానికి ఎన్నికలకు ముందు హైప్‌ క్రియేట్‌ చేసి మొదటి టికెట్‌ నాలుగు లక్షలకు పైగా అమ్మినప్పుడు జగన్‌ అండ్‌ కోకు దోపిడీ గుర్తుకురాకపోవడం వింతగా ఉంది. నిజానికి డిమాండ్‌ను బట్టి ధరలను నిర్ణయించడం ఒక్క సినిమారంగానికే పరిమితం కాదు. ప్రభుత్వాలు కూడా పండుగ సీజన్‌లలో బస్‌చార్జీలు, రైలుచార్జీలను పెంచుతున్నాయి కదా? ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి పనికిమాలిన విషయాలను తెర మీదకు తీసుకురావడం జగన్‌ సర్కారుకు అలవాటుగా మారింది. పేదప్రజలు తాగే మద్యం ధరలను అమాంతం పెంచేసి చీప్‌లిక్కర్‌ అంటగట్టిన జగన్‌రెడ్డి, అదేమంటే మద్యపానాన్ని ప్రోత్సహించకూడదనే ధరలు పెంచినట్టు చెప్పుకున్న ఘనుడు. రాష్ట్రంలో సిమెంట్‌, ఇసుక ధరలు అమాంతం పెరిగిపోయి సొంత ఇళ్ల నిర్మాణం ప్రజలకు భారంగా మారింది. పొరుగు రాష్ర్టాలతో పోల్చితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రజలపై మోయలేని భారం పడుతున్నప్పటికీ ఈ విషయాల గురించి ఆలోచించని జగన్‌ ప్రభుత్వం, సినిమా టికెట్ల ధరలు తగ్గించడం ద్వారా పేదలు దోపిడీకి గురికాకుండా కాపాడుతున్నామని పోజులు కొడుతోంది. తమాషా ఏమిటంటే, జగన్‌ అండ్‌ కో ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచుతూ కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ప్రజల్ని దోచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సినిమా పెద్దలకు లైసెన్స్‌ ఇచ్చిందనుకోవాలా? ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం థియేటర్లను నిర్వహించలేమని చెబుతూ ఆంధ్రప్రదేశ్‌లో పదుల సంఖ్యలో థియేటర్లను మూసివేస్తున్నారు. ఈ కారణంగా జగన్‌ ప్రభుత్వం తాను వాడుకునే పేదలకు వినోదం కూడా అందుబాటులో లేకుండా చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన హీరోల సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్లలో తనిఖీల పేరిట వేధింపులకు గురిచేస్తున్నారు. ఇంతకంటే పైశాచికత్వం మరొకటి ఉంటుందా? జగన్‌రెడ్డికి నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే తన కుటుంబానికి చెందిన భారతి సిమెంట్‌ కంపెనీ ఉత్పత్తి చేసే సిమెంట్‌ను తక్కువ ధరలకు పేదలకు సరఫరా చేయవచ్చు కదా? నిజానికి ఏ రాష్ట్రంలోనైనా విద్య, వైద్యం కోసం ప్రజలు అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజుల భారం మోయలేనంతగా ఉంటోంది. వాటిని నియంత్రించడం సాధ్యం కాదు గనుక సినిమా వాళ్లపై జగన్‌రెడ్డి తన అధికార జులుం ప్రదర్శిస్తున్నారు. సినిమాను నెలకో, రెండు నెలలకో ఒకసారి చూస్తారు. అది కూడా తప్పనిసరి కాదు. ఇతర నిత్యావసరాలు అలా కాదే! సినిమా చూడకుండా కూడా ఉండవచ్చు. వంటనూనెల ధరలు పెరిగాయని వంట చేసుకోకుండా ఉండలేము కదా? రాష్ట్రంలో ఏ సమస్యా లేనట్టుగా అధికారులు కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లిందే తడవుగా సినిమా థియేటర్లలో ప్రతిరోజూ తనిఖీలు చేస్తూ వేధిస్తున్నారు. ఏ రంగంలోనైనా కొద్దోగొప్పో లోటుపాట్లు లేకుండా ఉండవు. అంతెందుకూ, తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నిర్మించుకున్న ప్యాలెస్‌లో ఉల్లంఘనలు లేవా?


ప్రశ్నిస్తే పిచ్చోడే..!

అధికారం చేతిలో ఉందని సినిమారంగాన్ని వేధిస్తూ ఇప్పుడు జగన్‌రెడ్డి వినోదం పొందుతూ ఉండవచ్చు. రేపు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కొత్త ప్రభుత్వం వచ్చి మీ మీద పగతో సిమెంటు ధరలను బస్తా 30 రూపాయలకే అమ్మాలని నిర్ణయిస్తే భారతి సిమెంట్‌ను మూసుకోవలసిన పరిస్థితి రాదా? ఒక్కో రంగంపై పగబట్టి వాటిని విధ్వంసం చేయడానికా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? సిమెంటు ఉత్పత్తికి అవసరమైన సున్నపురాయి, లేటరైట్‌ వంటి ఖనిజాలు జాతీయసంపద. ప్రజలందరికీ చెందిన ఖనిజాన్ని వాడుకుని ఉత్పత్తి చేసే సిమెంటుకు మాత్రం మీ ఇష్టం వచ్చిన ధర నిర్ణయించుకుంటారా? భారీ బడ్జెట్‌తో నిర్మించే చిత్రాలకు మాత్రం టికెట్లను అధికధరకు విక్రయించకూడదా? ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించిన హీరో నాని నటించిన చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్‌’ని ప్రదర్శిస్తున్న థియేటర్లను మాత్రమే ఇబ్బందులకు గురిచేయడం పేదల కోసమేనా? అదేమి విచిత్రమో గానీ రాష్ట్రంలో జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారికి వేధింపులు తప్పడం లేదు. అదేదో సినిమాలో ‘కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్లు, నన్ను పిచ్చోడన్నారు నాయాళ్లు’ అని పాడినట్టుగా జగన్‌ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపిన వారిపై పిచ్చివాడు అన్న ముద్ర కూడా వేస్తున్నారు. గతంలో, ప్రభుత్వం మాస్కులు కూడా సరఫరా చేయడం లేదు అన్నందుకు డాక్టర్‌ సుధాకర్‌పై పిచ్చివాడన్న ముద్ర వేశారు. తాజాగా సొంత పార్టీ వాడైనప్పటికీ ప్రభుత్వ వ్యవహారాలు బాగా లేవన్నందుకు సుబ్బారావు గుప్తా అనే ఆయనను కూడా పిచ్చివాడని అన్నారు. అంతటితో ఆగకుండా ఆయనను కొట్టారు. ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి ఏం చేస్తున్నాడు అని ఎవరైనా అడిగితే ‘అప్పు చేసి పంచి పెడతాడు, అదేమన్నవారిని దంచికొడతాడు’ అని చెప్పుకోవచ్చు. నిద్ర లేచిన దగ్గర నుంచి ఎవరిని వేధించాలా అని మాత్రమే జగన్‌రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నించిన హీరో నాని హైదరాబాద్‌లో నివసిస్తున్నారు గనుక సరిపోయింది గానీ అదే ఆంధ్రప్రదేశ్‌ వాసి అయి ఉంటే ఆయనను కూడా పిచ్చివారని ప్రచారం చేసేవారు. లేకపోతే ఏదో ఒక కేసులో ఇరికించేవారు. జగన్‌ ప్రభుత్వ అవాంఛనీయ చర్యల వల్ల సినిమారంగం కుదేలవుతోంది. అదే జరిగితే జగన్‌కు గిట్టని హీరోలు మాత్రమే కాదు- పరిశ్రమపై ఆధారపడి బతికే లక్షలాది మంది ఉపాధి కోల్పోతారు. థియేటర్లు మూతపడితే వాటిలో పనిచేసే వారు ఉపాధి కోల్పోరా? వారిని ప్రభుత్వం ఆదుకుంటుందా? తిరుమలలో ఉదయాస్తమాన సేవ పేరిట ఒక్క టికెట్‌ ధరను ఏకంగా కోటి రూపాయలుగా నిర్ణయించి దేవదేవుడిని ధనికు లకు మాత్రమే సన్నిహితం చేసిన జగన్‌రెడ్డి పేదల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. జగన్‌రెడ్డి సినీ పరిశ్రమపై కత్తి దూస్తున్నప్పటికీ పరిశ్రమ పెద్దలు చేతులు కట్టుకుని వినయంగా వేడుకోవడానికే పరిమితం అవుతున్నారు. వేరే హీరో సినిమా ఫ్లాపయితే సంబరాలు చేసుకునే అభిమానులు కూడా ఎక్కడున్నారో కనబడడం లేదు. పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని సినిమాల్లో డైలాగులు చెప్పే మహానుభావులు ప్రభుత్వం తమపై కత్తి దూస్తున్నా మౌనంగా ఉండటం క్షంతవ్యం కాదు. మీ టైం వచ్చే వరకు పారితోషికాన్ని తగ్గించుకోండి, అంతేగానీ జగన్‌రెడ్డి వంటి వారికి తలవంచితే మీరు హీరోలుగా కాదు జీరోలుగా మిగిలిపోతారు. ఈ విషయం అలా ఉంచితే జగన్‌రెడ్డికి చెందిన రోత పత్రిక శుక్రవారం నాటి సంచికలో ఒక వింత జరిగింది. జస్టిస్‌ ఎన్వీ రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనప్పుడు కూడా ఇవ్వనంత ప్రాధాన్యాన్ని ఆయన తన స్వగ్రామం పొన్నవరంలో పర్యటించిన సందర్భంగా ఇచ్చారు. విచిత్రంగా తెలంగాణ ఎడిషన్‌లో కూడా జస్టిస్‌ రమణ ఫొటోను మొదటి పేజీలో ప్రచురించారు. ఈ మార్పు ఏ మార్పునకు సంకేతమో ఎవరికైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్‌!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-12-26T06:10:44+05:30 IST