సభ... సంస్కారం!

ABN , First Publish Date - 2021-11-21T07:14:01+05:30 IST

‘మీనాయకుడిని సభకు తీసుకురండి నాకు చూడాలని ఉంది’. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్య ఇది...

సభ... సంస్కారం!

‘మీనాయకుడిని సభకు తీసుకురండి నాకు చూడాలని ఉంది’. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్య ఇది. చంద్రబాబు ప్రాతినిధ్యంవహిస్తున్న కుప్పం మున్సిపాలిటీని గెలుచుకున్న అంతులేని ఆనందంలో ఆ వ్యాఖ్యలు చేసిన జగన్‌రెడ్డి ఆ మరుసటి రోజే తన ఎమ్మెల్యేలతో చంద్రబాబును నిండుసభలో పరాభవించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. మహామహులు ఎందరో ఎన్నికల్లో ఓడిపోయారు. ఎవరి విషయమో ఎందుకు ఇదే జగన్‌రెడ్డి తండ్రి దివంగత రాజశేఖర్‌ రెడ్డి 1996లో కడప లోక్‌సభ నుంచి పోటీ చేసి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా 5,445 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు తిప్పికొడితే 30 వేల ఓట్లు కూడా లేని కుప్పం మున్సిపాలిటీని గెలుచుకున్నందుకే ఇంతలా విర్రవీగాలా? అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. అయితే పగ ప్రతీకారాలను ఇష్టపడే జగన్‌రెడ్డిలోని మరో కోణాన్ని కుప్పం గెలుపు ఆవిష్కరించింది. ఫలితంగా తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎటువంటి భావాలను కూడా తన ముఖంలో వ్యక్తంచేయని చంద్రబాబు నాయుడు ఏకంగా విలేకరుల సమావేశంలోనే భోరున విలపించారు. శుక్రవారం శాసనసభలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి కొంతమంది అధికార పార్టీ శాసనసభ్యులు చేసిన వ్యాఖ్యలు ఆనాటి కౌరవ సభలో జరిగిన సన్నివేశాలను గుర్తుచేస్తున్నాయి. ఆనాడు అంతులేని పుత్రవాత్సల్యంతో నిండుసభలో ద్రౌపదీ వస్ర్తాపహరణం జరుగుతున్నప్పటికీ ధ్రుతరాష్ర్టుడు నివారించలేదు. పగ ప్రతీకారాలతో రగిలిపోయిన దుర్యోధనుడు తమ్ముళ్లను ప్రోత్సహించాడు. ఇప్పుడు చంద్రబాబు విలపిస్తున్న విషయం తెలిసి కూడా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సహచర ఎమ్మెల్యేలను ప్రోత్సహించారు. పైగా పైశాచిక ఆనందం పొందారు. అహంకారపూరిత నవ్వులు చిందించారు. నాలుగున్నర దశాబ్దాలుగా తనకు తోడునీడగా ఉంటున్న సహధర్మచారిణి భువనేశ్వరిని అవమానించడాన్ని తట్టుకోలేని చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా విలపించారు. మహాభారతంలో తాను ఏకవస్త్రనని మొరపెట్టుకున్నప్పటికీ దుశ్శాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకొని కౌరవసభకు ఈడ్చుకు వెళ్లాడు. జూదంలో ధర్మరాజు ‘తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా’ అన్న ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే ఆమె వస్ర్తాపహరణకు పూనుకున్నారు. ఈనాటి శాసనసభలో ఆ మాత్రం వేడుకునే అవకాశం కూడా లేని భువనేశ్వరిని అత్యంత హేయమైన రీతిలో అవమానించారు. సహధర్మచారిణి శీలాన్ని శంకించే విధంగా నిందలు వేసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఉండిపోయారు. నాడు ద్రౌపదిని శ్రీకృష్ణుడు ఆదుకున్నాడు. ఇప్పుడు భువనేశ్వరికి ఉపశమనం కలిగించడానికి ఏ శ్రీకృష్ణుడూ రాలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే శ్రీకృష్ణులు. వరాలిచ్చినా, దండించినా వారే చేయాలి. గతంలో తమిళనాడు శాసనసభలో కూడా ప్రతిపక్షంలో ఉన్న జయలలితను నిండు సభలో అవమానించారు. వస్ర్తాపహరణకు ప్రయత్నించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తమిళ ప్రజలు ఆమెను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మహాభారతంలో గానీ, తమిళనాడులో గానీ, ఆంధ్రప్రదేశ్‌లో గానీ పురుష అహంకారానికి మహిళే బలైంది. దుర్యోధనుడికి గర్వభంగం జరిగింది. జయలలితను అవమానించిన కరుణానిధి అధికారం కోల్పోయారు. ఇప్పుడు చంద్రబాబు సతీమణిని అవమానించిన జగన్‌రెడ్డి ఎటువంటి పర్యవసానాలను ఎదుర్కొంటారో తెలియదు. రాయలసీమ జిల్లాలను భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తి పలువురు మృతి చెందినప్పటికీ ఆ విషయం పట్టించుకోవాల్సిన అధికారపక్షం గానీ, ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి గానీ చంద్రబాబును అవమానించడానికే ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అక్కచెల్లెమ్మలు అని పలికే జగన్‌రెడ్డి తమ వాళ్లు నిందలు వేసిన భువనేశ్వరి కూడా వాళ్లలో ఒకరని ఎందుకు అనుకోవడం లేదు? కౌరవసభలో పాండవులకు పరాభవం జరిగినా అంతిమ విజయం వారినే వరించింది. అధర్మం తాత్కాలికంగా మాత్రమే గెలుస్తుంది. కుప్పంలో అధికార పార్టీ ఎలా గెలిచిందో, అందుకోసం ఏం చేసిందో జగన్‌రెడ్డికి తెలియదా? అంతోటి విజయానికే ఇంతటి మిడిసిపాటు అవసరమా? జరుగుతున్న పరిణామాలను చూస్తున్న తర్వాత కూడా తమది గౌరవ సభ అని, తమను తాము గౌరవ సభ్యులు అని అధికారపార్టీ సభ్యులు చెప్పుకోగలరా? ప్రశ్నించే వారిని శిక్షించడానికి మాత్రమే సభాహక్కులు ఉంటాయా? భువనేశ్వరికి ఎలాంటి రక్షణా ఉండదా? పౌరులకు లేని హక్కులు వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ఎందుకు ఉండాలి? వ్యక్తిగత వ్యవహారాలను చర్చించడానికి, ఇళ్లలోని మహిళలను అవమానించడానికే శాసనసభ పరిమితం అవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చంద్రబాబును పరాభవించడానికి భువనేశ్వరిపై నిందలు వేయాలా? లోకేశ్‌కు, దివంగత మాధవరెడ్డికి డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని కొంత మంది సభ్యులు కోరడం దురహంకారం కాదా? లోకేశ్‌ పుట్టుకపై సందేహాలు రేకెత్తించడం ద్వారా ఏం సాధించాలను కుంటున్నారు? అధికారంలో ఉన్నవారిపై ప్రతిపక్షంలో ఉన్న వారు ఇలాంటి ఆరోపణలే చేస్తే సహించగలరా? చంద్రబాబును అవమానించిన వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో చరిత్ర. బయట కనిపించిన ప్రతి స్ర్తీని చెరబట్టాలనుకునే వారు కూడా భువనేశ్వరిపై నిందలు వేయడమా? చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే 1983 జనవరిలో లోకేశ్‌ జన్మించాడు. అప్పటికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు కూడా. దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి తెలుగుదేశం రాజకీయాల్లో కూడా లేరు. గ్రామస్థాయి నాయకుడు మాత్రమే. అసలు మాధవరెడ్డి పూర్వాపరాల గురించి ఇంత వివరణ ఇవ్వవలసి రావడం దురదృష్టకరం. అయినా నోరు ఉంది గదా అని మంద బలమున్న సభలో ఏది పడితే అది మాట్లాడొచ్చా? చంద్రబాబు మనసు గాయపడడానికి కారణమైన అంబటి రాంబాబుపై గతంలో ఎంత మంది మహిళలు ఫిర్యాదు చేయలేదు? మాధవరెడ్డి పేరును మొదటిసారి ప్రస్తావించిన వల్లభనేని వంశీ చరిత్ర ఎవరికి తెలియదు? ఏడు పదుల వయసులో పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా, పన్నెండేళ్లకు పైగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తిని అధికారం ఉంది కదా అని పరాభవిస్తారా? ఇంత జరిగినా వివిధ మాధ్యమాలలో అధికార పార్టీని సమర్థిస్తూ మాట్లాడిన వారిని ఎలా అర్థం చేసుకోవాలి? 


అదీ జగన్‌ నైజం!

కుటుంబసభ్యులను నిజంగా ప్రేమించే వాళ్లెవరూ చంద్రబాబుకు జరిగిన అవమానాన్ని సహించరు. మావాళ్లను అంటే ఆ మాత్రం స్పందన ఉండదా అని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తమ వాళ్ల చర్యను సమర్థించుకోవడాన్ని బట్టి ఆయనేమిటో అర్థం చేసుకోవచ్చు. అంబటి రాంబాబుకు, ఒక మహిళకూ జరిగిన సంభాషణ ఆధారంగా తెలుగుదేశం వైపు నుంచి ఎవరో అరగంట చాలా అని వ్యాఖ్యానించడాన్ని, రాజకీయాలతో సంబంధం లేని భువనేశ్వరిపై నిందలు వేయడాన్ని ఒకే గాటనకట్టి చెల్లుకు చెల్లు అని సమర్థించుకోవడం ద్వారా జగన్‌రెడ్డి తానేమిటో చెప్పుకొన్నారు. మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన వారిని మందలించకపోగా ముఖ్యమంత్రిగా సమర్థించడం జగన్‌కే చెల్లుతుంది. సిగ్గుపడాల్సిన విషయాలలో కూడా బరితెగించి మాట్లాడే తెగింపు శాసనసభ్యులకు వచ్చిందంటే అందుకు ఆయన మాత్రమే బాధ్యుడు. రాజకీయంగా పైచేయి సాధించడం వేరు! గౌరవసభను ‘కౌరవసభ’గా మార్చడం వేరు! సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డిని తెలుగుదేశం వాళ్లే హత్య చేసి ఉంటారని జగన్‌రెడ్డి ఇప్పటికీ చెప్పడం ద్వారా ఆయన ఎటువంటి వాడో, నిందితుల తరఫున ఆయన ఎంతలా వకాల్తా పుచ్చుకుంటున్నదీ తెలియడం లేదా? వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు దస్తగిరి తన వాంగ్మూలంలో ‘ఫలానా వాళ్లు హత్య చేశారు! ఫలానా వాళ్లు చేయించారు!’ అని చెప్పడం, దాని ఆధారంగా శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బుకాయిస్తున్నారు అంటే నేరంలో ఆయనకు కూడా ప్రమేయం ఉందా? అన్న అనుమానం రాకుండా ఉంటుందా? సీబీఐ విచారణ తుది దశకు చేరుకున్న సమయంలో ‘వివేకానంద రెడ్డి మా చిన్నాన్న! అవినాశ్‌ రెడ్డి మరో చిన్నాన్న కొడుకు! ఒక చిన్నాన్నను మరో చిన్నాన్న కొడుకు ఎందుకు చంపిస్తాడు? మా వేలితో మా కన్ను పొడుచుకుంటామా?’ అని చెప్పడానికి జగన్‌రెడ్డి ఎవరు? అలాంటప్పుడు హంతకులు ఎవరో ఆయనకు తెలుసా? తెలిస్తే సీబీఐ వాళ్లకు ఎందుకు చెప్పడం లేదు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కేసు గురించి ప్రకటనలు చేయకుండా ఆయనను నిలువరిస్తూ హైకోర్టు నుంచి గ్యాగ్‌ ఆర్డర్‌ తెచ్చుకున్న జగన్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా వివేకా హత్యతో అవినాశ్‌కు సంబంధం లేదని ఎలా చెబుతారు? ఆ అధికారం ఆయనకు ఉందా? అలా మాట్లాడడం దర్యాప్తును ప్రభావితం చేయడం అవదా? తన కుటుంబంలో చిచ్చుపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. సొంత చెల్లిని దూరం చేసుకున్నది ఆయన కాదా? తల్లి విజయమ్మ కూడా అంటీముట్టనట్టు ఉంటున్నది నిజం కాదా? రాజశేఖర్‌ రెడ్డి పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి జగన్‌తో పాటు హాజరైన విజయమ్మ మధ్యలోనే వెళ్లిపోవడానికి ప్రయత్నించగా జగన్‌ వారించడం నిజం కాదా? అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ న్యాయం జరగదు అని భావించిన వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత హైకోర్టును ఆశ్రయించడం నిజం కాదా? దివంగత రాజశేఖర్‌ రెడ్డి కుటుంబాన్ని దూరం చేసుకున్నది జగన్‌ మాత్రమే! తండ్రి తరఫు వారికంటే వరుసకు సోదరుడు అయిన అవినాశ్‌రెడ్డి కుటుంబమే ముఖ్యమని అనుకుంటున్నది ఆయన మాత్రమే! శత్రుదుర్బేధ్యమైన పులివెందులలోని అంతఃపురంలో చీలికలు తేవడం అన్యులకు సాధ్యమా జగన్‌రెడ్డీ? తల్లిని, చెల్లిని కూడా ఆదరించని ఆయన తాను శత్రువుగా భావించే చంద్రబాబును, ఆయన భార్యనూ గౌరవిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. అటు పాలనాపరంగా, ఇటు రాజకీయంగా జగన్‌రెడ్డి చర్యల వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ తలవంచుకోవాల్సిన దుస్థితి దాపురించింది. క్రమశిక్షణకు, విలువలకు మారుపేరైన ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులపై నిందారోపణలు చేయడం దుస్సాహసమే అవుతుంది. ఎన్టీఆర్‌ దాదాపు ఏడేళ్లు అధికారంలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబసభ్యులు ఎవరూ అధికారులతో మాట్లాడే సాహసం కూడా చేసేవారు కాదు. ప్రభుత్వ కార్యక్రమాలలో ఎక్కడా పాల్గొనేవారు కాదు. ఇంకా చెప్పాలంటే ఆయన కుమారులు, కుమార్తెలు ఎలా ఉంటారో కూడా చాలామందికి తెలియదు. అధికారం వీరభోజ్యం అని ఇప్పుడు జగన్‌రెడ్డి భావించినట్టుగా ఆనాడు ఎన్టీఆర్‌ భావించలేదు. అలాంటి ఆయన కుమార్తెపై దారుణమైన నిందలు వేసినవారు ఫలితం అనుభవించకపోరు. కోపం ఉంటే దాన్ని చంద్రబాబుకే పరిమితం చేయాలి గానీ ఏ పాపం చేయని భువనేశ్వరిని ఈ రొచ్చులోకి లాగడం మహాపాపం. భువనేశ్వరికి క్షోభ కలిగించింది ఎవరైనా, కనీసం సంస్కారం ఉన్న వాళ్లయినా ‘క్షమించు తల్లీ!’ అని కోరుకుంటే ఆమెకు కొంతైనా ఉపశమనం లభిస్తుంది.


తల దించుకోవాల్సింది ఎవరు?

రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలను, ఆటుపోట్లను చవిచూసిన చంద్రబాబు నాయుడు చిన్నపిల్లాడిలా విలపించడాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. బాధపడ్డారు. కులద్వేషంతోనో, మరో ద్వేషంతోనో రగిలిపోతున్న అతి కొద్దిమంది మాత్రం పైశాచిక ఆనందం పొందారు. సంస్కారం, నైతిక విలువలను ఏ కోశానా అలవర్చుకోని వాళ్లు మరుగుజ్జులుగానే మిగిలిపోతారు. కౌరవసభగా మారిన శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా అడుగుపెట్టనని, ముఖ్యమంత్రిగానే మళ్లీ అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేసి సభ నుంచి చంద్రబాబు నిష్క్రమించిన తర్వాత కూడా కొంతమంది తమ వ్యాఖ్యల ద్వారా తమ వికృత మనస్తత్వాలను బయటపెట్టుకున్నారు. కట్టుకున్న భార్యను అవమానించినందుకు చంద్రబాబు సభ నుంచి కన్నీళ్లతో నిష్క్రమించి ఉండవచ్చును గానీ నిజానికి ఆ పరిస్థితికి కారకులైన వారే సిగ్గుతో తలదించుకోవాలి. చంద్రబాబు రాజకీయాలతో ఎవరైనా విభేదించవచ్చు గానీ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను గానీ, విభజిత ఆంధ్రప్రదేశ్‌ను గానీ ఆయన తలెత్తుకునేలానే చేశారు. ఆంగ్లభాషపై ఆయనకు పెద్దగా పట్టు లేకపోయినా అంతర్జాతీయ నాయకులను, కంపెనీలను రాష్ర్టానికి రప్పించగలిగారు. పరిపాలన అనే పెద్ద పెద్ద విషయాల గురించి తెలియని వాళ్లు చంద్రబాబును అవహేళన చేస్తుండవచ్చు గానీ రాజశేఖర్‌ రెడ్డి వంటి వారు సైతం ఆంతరంగిక సంభాషణల్లో ఆయన పనితీరును ప్రశంసించిన వారే. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆయనను కలసిన ఒక పారిశ్రామికవేత్త ‘మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం రాష్ర్టానికి అవసరం’ అని ప్రశంసించే ప్రయత్నం చేయగా ‘చంద్రబాబును కించపరచవద్దు. ఆయన విజన్‌ ఆచరణీయం. చంద్రబాబు మొదలుపెట్టిన అన్ని కార్యక్రమాలను నేను పూర్తిచేస్తాను. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది’ అని వైఎస్‌ బదులిచ్చారు. చంద్రబాబు విలపించడం చూసి కొంతమంది వికృతానందం పొందిఉండవచ్చు గానీ గత ఎన్నికల్లో ఆయనను ఓడించడం వల్ల జరిగిన, జరుగుతున్న అనర్థం ఏమిటో చాలామంది ఇప్పటికే గుర్తించారు. విలేకరుల సమావేశంలో భోరున విలపించడం వల్ల ఆయనకు సానుభూతి లభించవచ్చు. అదే సమయంలో ఆయన బలహీనుడయ్యాడన్న భావన కూడా కలగవచ్చు. అయితే ప్రతి సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంలో చంద్రబాబు దిట్ట. జగన్‌రెడ్డి వంటివారి క్రూర రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ఆయన అనుభవం కూడా సరిపోలేదు. ఫలితమే అలా బరస్ట్‌ అయ్యారు. ఎప్పుడూ స్టోన్‌ఫేస్‌తో భావాలు తెలియకుండా గంభీరంగా ఉండే చంద్రబాబు ఇలా విలపించడం ఏమిటా అన్న సందేహం చాలా మందిలో కలిగినట్టుగానే నాకూ వచ్చింది. అదే విషయాన్ని ఆయనను అడగ్గా.. ‘‘అధికారంలో ఉండాలనుకున్నది ప్రజలకు ఏదో చేద్దామనే గానీ.. నాకోసం, నా కుటుంబం కోసం కాదు. నా భార్యను అంత దారుణంగా అవమానించడాన్ని తట్టుకోలేకపోయాను. ఏ ప్రజల కోసం నేను తపనపడ్డానో ఆ ప్రజలే నన్ను వద్దనుకున్నప్పుడు నేనెందుకు మాటలు పడాలి? గౌరవం కోల్పోవాలి? అందుకే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. వచ్చే ఎన్నికల్లో నేను ప్రజలను ఒకటే అడుగుతాను. మీకు నా అవసరం ఉంది అనుకుంటే గెలిపించుకోండి. వద్దనుకుంటే మీ ఇష్టం’’ అని చెబుతానని అన్నారు. ఒడిదుడుకులు లేని రాజకీయ నాయకుడు ఉండడు. 2014 ఎన్నికల్లో జగన్‌రెడ్డి పార్టీ సైతం ఓడిపోలేదా? అరాచకం మొదలైనప్పుడు బాధ కలగడం సహజం. దాడులు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. దారుణ అవమానాలు ఎదురైనప్పుడు కన్నీరు ఉబికి వస్తుంది. ఆ తర్వాత అదే కన్నీరు గుండెమంటను ఆర్పుతుంది. తర్వాత దశలో గుండెదిటవు చేసుకుని పోరాటానికి సిద్ధమవుతారు. చంద్రబాబు కంట వెలువడిన కన్నీరు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దుస్థితికి నిదర్శనంగానే చూడాలి. కుటుంబవిలువలు, అనుబంధాలు తెలియని వారికి సున్నితత్వం ఉండదు. ఆయన విలపించడాన్ని కూడా డ్రామాగా అభివర్ణించిన కుసంస్కారులు మన మధ్య ఉండటం విచారకరం. చంద్రబాబును పరాభవించిన వారిని సమర్థించే వారు ఎవరైనా తమకూ కుటుంబాలు ఉన్నాయన్న విషయం గుర్తు తెచ్చుకోవాలి. సంస్కారహీనులు రాజ్యమేలితే ఏం జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇంత జరిగిన తర్వాత కూడా అధికార పార్టీకి చెందిన కొంతమంది చేసిన వ్యాఖ్యలు, మద్దతు ముసుగులో కొంతమంది పెట్టిన సోషల్‌ మీడియా పోస్టులు చూసిన తర్వాత ఇంత ఉన్మాదంగా ఎందుకు మారిపోయారో అన్న సందేహం కలగక మానదు. జరిగిన దానికి బాధపడాల్సింది చంద్రబాబు కాదు, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడటానికి కారణమైన ఒక రకం మనుషులు, ఏం జరుగుతున్నా నోరు విప్పని మేధావులు బాధపడాలి! ‘‘ఓటు వేసే ముందు ఆ నాయకుడు మంచివాడా కాదా చూడండి అని ఇప్పటిదాకా చెప్పేవాడిని. ఈసారి ఓటు వేసే ముందు వాడు మనిషికి పుట్టాడా లేదా కనుక్కుని ఓటువేయండి అని ఇప్పుడు చెబుతున్నాను’’ అని కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. చంద్రబాబు భావిస్తున్నట్టు మరోసారి ముఖ్యమంత్రి అవడం వల్ల ఆయన జీవితాశయం ఏమీ నెరవేరదు. ప్రస్తుత వయసు రీత్యా మరో పర్యాయం మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయగలరు. ఆ తర్వాత శరీరం ఏ మేరకు సహకరిస్తుందో తెలియదు. ఇంతోటి దానికి అవమానాలు భరించాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన సేవలు కావాలనుకుంటే ప్రజలే గెలిపించుకోవాలి. ఎవరో అన్నట్టుగా ఇప్పుడు ఏడవాల్సింది చంద్రబాబు కాదు, అనర్హులను అందలం ఎక్కించిన ప్రజలే. ప్రతిపక్ష నాయకుడి సతీమణికే శాసనసభ రక్షణ కల్పించనప్పుడు అది గౌరవసభ ఎలా అవుతుంది? వరదల్లో కొట్టుకుపోయిన ప్రాణాలు, నీళ్లలో చిక్కుకుని సాయం కోసం అల్లాడిపోయిన ప్రజలను పట్టించుకోకుండా వికృత రాజకీయ క్రీడకు శాసనసభను వేదికగా మార్చిన పాలకులకు ఓ నమస్కారం! నాయకులు వస్తుంటారు పోతుంటారు, రాష్ట్రం శాశ్వతం,- భావితరాల భవిష్యత్తు ముఖ్యం. ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాల కంటే ఒక వ్యక్తిని టార్గెట్‌గా చేసుకుని పైశాచిక ఆనందం పొందేవారు ఎవరైనా వారిని ఎన్నుకున్న ప్రజలదే తప్పవుతుంది. దొంగే దొంగ.. దొంగ అని అరచినట్టు ఎదురుదాడికి దిగుతున్న అధికార పార్టీ నాయకుల బరితెగింపును ఎలా అర్థం చేసుకోవాలి? సమాజంలో జఢత్వం వేళ్లూనుకున్నప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఏదిఏమైనా మానసిక క్షోభ నుంచి చంద్రబాబు కుటుంబం, ముఖ్యంగా భువనేశ్వరి కోలుకోవాలని, అందుకు అవసరమైన శక్తి ఆమెకు సమకూరాలని కోరుకుంటూ..

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-11-21T07:14:01+05:30 IST