MAA Elections : ‘మా’ కులచిచ్చు వెనుక అదృశ్యహస్తం..!
ABN , First Publish Date - 2021-10-17T15:09:27+05:30 IST
ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికలు, తదనంతర పరిణామాల విషయానికి వద్దాం...

ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికలు, తదనంతర పరిణామాల విషయానికి వద్దాం. ఈ ఎన్నికల పుణ్యమా అని సినిమా పరిశ్రమలోని కులాల కుంపట్లు మరోసారి రాజుకున్నాయి. సినిమావాళ్లు మరీ ఇంత సంకుచితంగా దిగజారి వ్యవహరిస్తారా? అని పలువురు విస్తుపోయారు. ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాశ్‌రాజ్ ఓడిపోయారు. విజయం సాధించిన మంచు విష్ణు తరఫున ఆయన తండ్రి మోహన్‌బాబు, మద్దతు ఇచ్చిన నరేష్ పోల్ మేనేజ్మెంట్లో పైచేయి సాధించారు. ప్రకాశ్‌రాజ్‌కు మద్దతు ప్రకటించిన చిరంజీవి వర్గం తెర వెనుకకే పరిమితమైపోయింది. మధ్యలో నాగబాబు వంటి వారు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రకాశ్‌రాజ్ ఓటమికి పరోక్ష కారణం అయ్యాయి. స్వతంత్ర అభిప్రాయాలు కలిగిన ప్రకాశ్‌రాజ్ ఈ తరహా ఎన్నికలకు పనికిరారు. అయినా ప్రేరణ ఏమిటో తెలియదు గానీ ఆయన పోటీ చేశారు,- ఓడిపోయారు.
ఈ సందర్భంగా కొట్టుకోవడాలూ, కొరుక్కోవడాలూ, తిట్టుకోవడాలు.. అన్నీ చూశాం. మొత్తంగా సినీనటుల పరువు బజారున పడింది. పైకి కనిపిస్తున్నది ఇంతే గానీ లోతుగా పరిశీలిస్తే దీని వెనుక బోలెడు రాజకీయాలు ఉన్నాయి. ‘మా’ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమ కమ్మ-, కాపు వర్గాలుగా విడిపోయిందని అంటున్నారు గానీ దాని వెనుక ఎవరున్నారు? ఎవరికి ప్రయోజనం? అన్న ప్రశ్నలకు సమాధానం అన్వేషించవలసి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ, తెలుగుదేశం పార్టీకి గానీ ‘మా’ ఎన్నికలతో సంబంధం లేదు. అయితే ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలు, తదనంతర పరిణామాల వెనుక అదృశ్యశక్తి ఉన్నట్టుగా అనిపిస్తోంది. జగన్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ అడుగులు తెలుగుదేశం పార్టీ వైపు పడుతున్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ‘మా’ ఎన్నికలు జరిగాయి.
మూడు రాజధానుల విషయాన్ని పవన్ కల్యాణ్ వ్యతిరేకించగా చిరంజీవి సమర్థించారు. దీన్నిబట్టి జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే విషయంలో మెగా ఫ్యామిలీలో ఏకాభిప్రాయం లేదని భావించాలి. అదే సమయంలో బాలకృష్ణ చర్యల వల్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఇరకాటంలో పడ్డారు. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి మాత్రమే లాభిస్తుంది. కమ్మ, రెడ్డి ఒక్కటేనని ప్రచారం చేయడం వల్ల కాపులను తెలుగుదేశం పార్టీకి దూరం చేయవచ్చు. పవన్ కల్యాణ్ నుంచి చిరంజీవిని దూరం చేయగలిగితే ఎంతో కొంత లాభపడేది జగన్ మాత్రమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ వాతావరణం ప్రకారం చంద్రబాబు,- పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేస్తే జగన్‌రెడ్డి అధికారం కోల్పోవడం తథ్యంగా కనిపిస్తోంది. ఈ కారణంగానే వీరిరువురూ కలిసినా ఓట్ల బదిలీ సజావుగా జరగకుండా నివారించడానికి కమ్మ,-కాపుల మధ్య వైషమ్యాలకు తెర తీశారని చెప్పవచ్చు. ‘మా’ ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఈ అనుమానాలకు ఊతమిస్తోంది. కాపులను కించపరుస్తూ పెడుతున్న పోస్టులను కమ్మ సామాజికవర్గం వారే పెడుతున్నారని అనుమానించేలా ఫలానా ‘చౌదరి’ అంటూ ఆ పోస్టుల కింద పేర్లు పెడుతున్నారు. నిజానికి పేరు చివర చౌదరి అన్న తోక తగిలించుకొనే కమ్మవారు చాలా తక్కువ ఉంటారు. కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం అందరికీ ‘చౌదరి’ అనే తోక తగిలిస్తోంది. ఈ ట్రిక్‌నే ఉపయోగిస్తూ ఇప్పుడు నకిలీ ఖాతాల ద్వారా కాపులను రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తున్నారు.
వెయ్యి మంది సభ్యులు కూడా లేని ‘మా’కు జరిగిన ఎన్నికలను కూడా రాజకీయం కోసం వాడుకోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. చిత్ర పరిశ్రమ సాలీనా టర్నోవర్ 1,500 కోట్ల రూపాయలకు మించి ఉండదు. అయినా మనకు ఎంతోమంది స్టార్లు తయారయ్యారు. వారి వెనుక కులాలు చేరాయి. గతంలో సినీనటుల కులాల గురించి ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు కులం పిచ్చి పెరిగిపోవడంతో ఎప్పుడో చనిపోయిన అద్భుత నటులకు కూడా కులాలు అంటగట్టారు. ఈ ధోరణినే జగన్‌రెడ్డి వంటి వారు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అదే సమయంలో ఇప్పుడు కమ్మ, -కాపులను వర్గ శత్రువులుగా ప్రకటించుకున్నారు. ‘మా’ ఎన్నికలు కూడా ఈ శక్తులకు ఉపయోగపడ్డాయి. సినిమావాళ్లు ఇప్పటికైనా సంకుచిత ధోరణులకు స్వస్తి చెప్పని పక్షంలో ప్రభుత్వాలకు గులాంగిరీ చేయక తప్పదు. రాజకీయ నాయకులకు పావులుగా చిక్కితే మొత్తం చిత్ర పరిశ్రమ మనుగడకే ప్రమాదం ముంచుకొస్తుంది. తస్మాత్ జాగ్రత్త..!

‘మా’ అధ్యక్షుడిగా నెగ్గిన మంచు విష్ణు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి బావమరిది అవుతారు. తెర వెనుక నుంచి ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన చిరంజీవి, నాగబాబు జనసేనాని సోదరులు. మంచు విష్ణు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. దీంతో మెగా ఫ్యామిలీని ఓడించడం కోసం కమ్మ, -రెడ్డి ఒక్కటయ్యారని ప్రచారం చేశారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి కాపులు సహజంగానే దూరమవుతారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో చేతులు కలుపుదామన్న ఆలోచనతో పవన్ కల్యాణ్ ఉండి ఉంటే ఈ ప్రచారం అందుకు ప్రతిబంధకం అవుతుంది. ఈ పరిణామం వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? ఆలోచించాలి! ఎన్నికల అనంతరం మోహన్‌బాబు తన కుమారుడు విష్ణుతో కలసి నందమూరి బాలకృష్ణను కలిశారు. ఇది పథకం ప్రకారం జరిగిందో లేక యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు గానీ తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కూడా అయిన బాలకృష్ణ పర్యవసానాలు ఆలోచించకుండా విష్ణుకు మద్దతు ప్రకటించారు. ఆ వెంటనే మోహన్‌బాబు రెండో కుమారుడు మనోజ్ జనసేనాని పవన్ కల్యాణ్‌ను కలిశారు. చూసేవాళ్లకు ఇదంతా గజిబిజిగా ఉంటుంది గానీ దీని వెనుక మరేదో ఉంది. జగన్‌రెడ్డిని గద్దె దించడమే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ ప్రకటించగా, చిరంజీవి మాత్రం జగన్‌తో సన్నిహితంగా ఉంటున్నారు.
