పులి మీద స్వారీ!

ABN , First Publish Date - 2021-08-15T06:16:01+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మది నిండా ఇప్పుడు దళితులే! హఠాత్తుగా దళిత జనోద్ధారకుడిగా మారిన ఆయన ఇప్పుడు మెలకువగా ఉన్నంతసేపూ దళితుల గురించే ఆలోచిస్తున్నారు....

పులి మీద స్వారీ!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మది నిండా ఇప్పుడు దళితులే! హఠాత్తుగా దళిత జనోద్ధారకుడిగా మారిన ఆయన ఇప్పుడు మెలకువగా ఉన్నంతసేపూ దళితుల గురించే ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో దళితుల పరిస్థితి దారుణంగా ఉందని, వారికి ఇంతకాలంగా ఏదో దోచిపెట్టినట్టుగా  ఏడవవద్దని కూడా ముఖ్యమంత్రి హితవు చెబుతున్నారు. తెలంగాణ సమాజం గురించి తనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని తరచుగా చెప్పుకొనే కేసీఆర్‌కు ఇప్పుడే ఈ విషయం తెలియడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యమంత్రిగా ఏడేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత ఇంతకాలానికి దళితుల స్థితిగతులపై కేసీఆర్‌కు అవగాహన ఏర్పడటం సంతోషించాల్సిన విషయమే! ఆంధ్రప్రదేశ్‌లోని దళితులతో పోల్చితే తెలంగాణలోని దళితుల పరిస్థితి దయనీయంగా ఉంటుందన్న విషయం చాలా మందికి తెలిసినా కేసీఆర్‌కు ఇప్పుడే తెలియడం విడ్డూరంగా ఉంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ అంటరానితనం, రెండు గ్లాసుల విధానం అమల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రికి మాత్రం తెలియలేదనుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణలోని దళితులు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. వారిని పెత్తందారీ సమాజం చిన్నచూపు చూస్తోంది. ఇంతకాలానికి ఇప్పుడు హుజూరాబాద్‌ ఉపఎన్నిక పుణ్యమా అని కేసీఆర్‌కు దళితులు గుర్తుకొచ్చారు. వాసాలమర్రి గ్రామానికి వెళ్లిన ఆయన దళితుల ఇళ్లకు వెళ్లడమే కాకుండా వారితో కలసి భోజనం చేశారు. దళితుల స్థితిగతులపై బోలెడంత ఆవేదన కూడా చెందారు. రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా కేసీఆర్‌ ప్రభుత్వ ప్రాధాన్యాలు మారిపోతుంటాయి. ఇప్పుడు హుజూరాబాద్‌ ఉపఎన్నిక పుణ్యమా అని దళితబంధు పథకం పురుడు పోసుకుంది. దాంతో ఇప్పుడు ఆ పథకం గురించి కేసీఆర్‌ ఊదరగొడుతున్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో రాజకీయ ప్రయోజనం పొందడం కోసమే దళితబంధు పథకం అమలుచేస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినందున ఆక్షేపించడానికి కూడా ఏమీ లేదు. అయితే కేసీఆర్‌ ఎత్తులూ, జిత్తులూ తెలుసుకున్న తెలంగాణ సమాజం హుజూరాబాద్‌లో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్‌ మస్తిష్కంలో మెరిసిన దళితబంధు పథకం ఆయనకు మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం వల్ల హుజూరాబాద్‌లో ఓట్ల వర్షం కురుస్తుందని కేసీఆర్‌ లెక్కలు వేసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రుల్లో మాత్రం అది గుబులు పుట్టిస్తోంది. దళితబంధు పథకాన్ని మంత్రిమండలి ముక్తకంఠంతో స్వాగతించిందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించినప్పటికీ, మంత్రులు మాత్రం ప్రైవేటు సంభాషణల్లో ఈ పథకం వల్ల అనర్థం జరుగుతుందేమోనని భయపడుతున్నారు. కులాల కుంపట్ల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల జీవితాలు పొగచూరిపోతున్నట్టుగానే తెలంగాణలో కూడా ఇకపై కులాల కుంపట్లు రాజుకునే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో దళితబంధు తరహాలో తమకు కూడా ఇటువంటి పథకం అమలుచేయాలని సమాజంలోని వివిధ వర్గాల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. దళితబంధు కింద ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం నుంచి పది లక్షల రూపాయల చొప్పున పంచిపెట్టనున్నందున తమకు కూడా అలాగే ఇవ్వాలని బీసీలు, ఆదివాసీలు కోరడం మొదలైంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియదు. ప్రస్తుతానికి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాత్రమే దళితబంధును అమలు చేస్తున్నందున ఈ పథకం ఫలాలు తమకు ఎప్పుడు అందుతాయోనని మిగతా నియోజకవర్గాలకు చెందిన దళితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో న్యాయం జరగడం లేదని హుజూరాబాద్‌లో శుక్రవారం రభస జరగడాన్ని చూశాం. అదే సమయంలో దళితులు మాత్రమే ఓటర్లా? మేం కాదా? అని బీసీలు, ఇతర వర్గాల ప్రజలు సంఘటితమవుతున్నట్టు సమాచారం వస్తోంది. అదే నిజమైతే కేసీఆర్‌కు మొదటికే మోసం వస్తుంది. అదే సమయంలో తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావాలన్నా, సరికొత్త పథకాలు అమలు కావాలన్నా ఉపఎన్నికలు రావాల్సిందేనన్న అభిప్రాయం విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ కారణంగానే తమ నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు మార్గం సుగమం చేయాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు వారి రాజీనామాల కోసం డప్పు చాటింపు కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించుకుంది. మొత్తానికి తేనెతుట్టెను కదిలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ ఉద్దేశంతో దళితబంధును ప్రవేశపెట్టారన్నది పక్కన పెడితే తన ఆలోచనలు, రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో ఇప్పుడు కేసీఆర్‌ మరింత విపులంగా ఆవిష్కరించుకున్నారు. దీంతో దళితబంధు గురించి ఎంత గొప్పగా చెప్పుకొంటున్నప్పటికీ, దళిత నాయకులతో ప్రకటనలు చేయిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కని పరిస్థితి ఏర్పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్‌ ఇప్పుడు పులి మీద స్వారీ చేయడం మొదలెట్టారు. ఎలాగైనా హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించాలన్న పట్టుదల పెరిగిపోతుండడంతో కేసీఆర్‌లో విచక్షణ నశిస్తోంది. హుజూరాబాద్‌ ప్రజలను సంతృప్తిపరచడానికై ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టి, డ్వాక్రా మహిళలకు సబ్సిడీ మంజూరు చేశారు. 57 ఏళ్ల వయసు వచ్చిన వారికి కూడా పెన్షన్లు ఇస్తామని గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకి బూజు దులిపి అమలు చేయబోతున్నారు. ఒక్క ఉపఎన్నికలో నెగ్గడానికి, రాజేందర్‌ను ఓడించాలన్న పంతంతో రాష్ట్ర ఖజానాను తనఖా పెట్టడానికి కూడా కేసీఆర్‌ వెనుకాడటం లేదు. ఈ చర్యల ప్రభావం మిగతా నియోజకవర్గాలపై తీవ్రంగా పడుతోంది. ఒక్క నియోజకవర్గంలో గెలుపు కోసం రాష్ట్ర ఖజానా నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న కేసీఆర్‌, మరో రెండేళ్ల తర్వాత జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవడానికి ఏం చేస్తారోనన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రజలలో ఆశలు పుట్టించి అసలుకే ఎసరు తెచ్చుకుంటారా? అన్న అనుమానం కలుగుతోంది. నిజానికి రాష్ట్ర ఖజానా వెలవెలబోతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని స్థితి తెలంగాణలో కూడా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బాటలోనే అప్పు చేసి పప్పు కూడు పెట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధపడిపోయారు. మరోవైపు కేంద్రప్రభుత్వం విధిస్తున్న షరతుల వల్ల ఎడాపెడా అప్పులు చేయడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు నీటిపారుదల ప్రాజెక్టులకు అప్పులే ఆధారం. సమగ్ర అనుమతులు లేని ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వకూడదని వివిధ ఆర్థికసంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించినందున వాటి పురోగతి ప్రశ్నార్థకం కాబోతున్నది. స్థూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ముఖచిత్రం ఇదే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ చర్యల వల్ల ప్రజల్లో కోరికలు గుర్రాలవుతున్నాయి. దీంతో టీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రులు, శాసనసభ్యులూ తలలు పట్టుకుంటున్నారు. హుజూరాబాద్‌ కారణంగా తమ నియోజకవర్గం ప్రజల నుంచి తమకు కూడా అవన్నీ కావాలని ఒత్తిడి వస్తోందని శాసనసభ్యులు వాపోతున్నారు. వ్రతం చెడినా ఫలితం దక్కాలంటారు. ఇంత చేసినా హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను విజయం వరిస్తుందన్న గ్యారంటీ లేదు. ఇప్పటికి కూడా ఈటల రాజేందర్‌ పరిస్థితే పైచేయిగా ఉంది. ఉపఎన్నిక ఎంత ఆలస్యమైతే తమ విజయావకాశాలు అంత మెరుగుపడతాయని టీఆర్‌ఎస్‌ బాధ్యులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉపఎన్నిక త్వరగా జరగాలని ఈటలతో పాటు బీజేపీ నాయకులు కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని వారు కేంద్ర మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకువెళ్లగా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఒక్కరోజైనా పదవి నుంచి దింపాలన్న తమ లక్ష్యం ముందు హుజూరాబాద్‌కు ఎన్నిక జరగడం చిన్న విషయమని బదులిచ్చినట్టు తెలిసింది. గత ఎన్నికల్లో నందిగ్రాం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మమతా బెనర్జీ ఆరు నెలల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలవని పక్షంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది. అమిత్‌ షా అండ్‌ కో కోరుకుంటున్నది ఇదే. దీంతో హుజూరాబాద్‌లో గెలుపుపై బీజేపీ నాయకులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఈ ఉపఎన్నిక ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలనూ ప్రయోగించినప్పటికీ హుజూరాబాద్‌లో ఓడిపోతే కేసీఆర్‌కు రాజకీయంగా శరాఘాతమే అవుతుంది. అదే జరిగితే పార్టీ పైనా, ప్రభుత్వంపైనా ఆయన పట్టు సడలుతుంది. పార్టీ తరఫున చతురంగ దళాలను రంగంలోకి దించడంతో పాటు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించినా ఫలితం లేకపోతే కేసీఆర్‌కు అంతకు మించిన అవమానం ఉండదు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదన్న అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. ఈ కారణంగానే ఎలాగైనా హుజూరాబాద్‌లో గెలిచి తన అధికారాన్ని పదిలపరచుకోవాలని కేసీఆర్‌ ఈ ఎన్నికలను అంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. అయితే ఆయన ఇందుకోసం ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజనీతిజ్ఞుడిగా కాకుండా సాధారణ రాజకీయ నాయకుడిగా వ్యవహరించడమే విషాదం!


తగ్గోడు దొరికాడు!

ఇప్పటివరకు కేసీఆర్‌ వేసిన రాజకీయ ఎత్తుగడలకు తిరుగుండేది కాదు. ఇప్పుడు పరిస్థితులు అలా కనిపించడం లేదు. గతంలో ఏ ఎన్నిక జరిగినా ఆడుతూపాడుతూ గెలుచుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ప్రతి ఎన్నికలో విజయం కోసం చెమటోడ్చాల్సివస్తోంది. ఈ పరిస్థితికి కర్త, కర్మ, క్రియ కేసీఆర్‌ మాత్రమే. ఇప్పటివరకు కేసీఆర్‌ తన వాగ్ధాటితో తెలంగాణ ప్రజలను కట్టిపడేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదంటున్నారు. బహిరంగసభల్లో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే జనాలు లేచిపోతున్నారు. అంతేకాకుండా ఆయన ప్రసంగాలకు ప్రజల నుంచి స్పందన కూడా అంతంత మాత్రమే ఉంటోంది. ధనబలంతో ఎన్నికల్లో గెలిచి పరువు నిలబెట్టుకున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కేసీఆర్‌ పరపతి క్షీణిస్తోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణలో ప్రతిపక్షాలు క్రియాశీలం అయ్యాయి. నిన్నటివరకు బీజేపీ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ వచ్చింది. రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా రేవంత్‌ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చింది. ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన దళిత, ఆదివాసీ దండోరా విజయవంతమైంది. పీసీసీ చేపడుతున్న ఇతర కార్యక్రమాలు కూడా సక్సెస్‌ అవుతున్నాయి. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉందన్న నమ్మకం కల్పించడంలో రేవంత్‌రెడ్డి కృతకృత్యులయ్యారు. అంత మాత్రాన రేవంత్‌ రెడ్డి మహా నాయకుడు అని భావించకూడదు. కేసీఆర్‌కు గట్టిగా ఎదురునిలిచి ప్రతిఘటించే వారివైపు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత చూస్తోంది. నిన్నటివరకు కాంగ్రెస్‌లో స్తబ్ధత ఉండటంతో పాటు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్‌ వంటి వారు కేసీఆర్‌ను ధాటిగా ఎదుర్కోవడంతో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యాక కేసీఆర్‌కు తగ్గోడు దొరికాడన్న అభిప్రాయం కాంగ్రెస్‌ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా ఏర్పడింది. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సమ ఉజ్జీలుగా కేసీఆర్‌తో తలపడుతున్నాయి. ఈ పరిణామం తమకు మేలు చేస్తుందని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు రెండు పార్టీల మధ్య చీలిపోయి తమకు లాభిస్తుందని టిఆర్‌ఎస్‌ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే తెలంగాణ సమాజం ఇప్పుడు రెండుగా విడిపోయింది. ఒక వర్గం కేసీఆర్‌కు అనుకూలంగా ఉండగా మరో వర్గం ఆయనను వ్యతిరేకిస్తున్నది. ఈ కారణంగా ఓట్ల చీలిక ఉండదని దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు రుజువు చేశాయి. 


ప్రతిష్ఠ పాతాళానికి!

ప్రజల్లో కేసీఆర్‌ పట్ల ఇంత వ్యతిరేకత ఏర్పడటానికి కారణం లేకపోలేదు. రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ ఇటు ప్రభుత్వాన్నీ, అటు పార్టీనీ గాలికి వదిలేశారు. కుమారుడు కేటీఆర్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించినప్పటికీ ఆయనకు స్వేచ్ఛ ఇవ్వలేదు. దీనికితోడు కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావును మొదట్లో మంత్రి పదవులకు దూరంగా ఉంచారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో పార్టీ వ్యవహారాలను హరీశ్‌రావ్‌, ప్రభుత్వ వ్యవహారాలను కేటీఆర్‌ చక్కదిద్దుతూ ఉండేవారు. కేసీఆర్‌ కూడా చురుగ్గా ఉండేవారు. తప్పు చేయడానికి శాసనసభ్యులు భయపడేవారు. అధికార యంత్రాంగంలో కూడా క్రమశిక్షణ ఉండేది. రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అధికారుల్లో కూడా నిబద్ధత కొరవడింది. అదే సమయంలో కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్టు విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇదిగో ఇప్పుడు అప్పుడు అంటూ ముహూర్తాలు కూడా నిర్ణయించారు. పార్టీ శాసనసభ్యులు కూడా కేటీఆర్‌ ముఖ్యమంత్రి అన్నట్టుగా వ్యవహరించేవారు. కొంతకాలం పాటు ఈ పరిస్థితిని అనుమతించిన కేసీఆర్‌, ఆ తర్వాత ఏమైందోగానీ కేటీఆర్‌ ముఖ్యమంత్రి అని ప్రకటనలు చేసే వారిని బండకేసి ఉతుకుతానని హెచ్చరించారు. ఆ తర్వాత రైతు సమన్వయ సమితి అంటూ కొంతకాలం హడావుడి చేశారు. మండల స్థాయి వరకు రైతు సమితులు ఏర్పాటుచేసి ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేయాలన్నదీ నిర్ణయిస్తామన్నారు. ఇప్పుడు రైతు సమన్వయ సమితులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. కేసీఆర్‌ కూడా మర్చిపోయారు. అదే సమయంలో తాను జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తానంటూ వాళ్లనూ వీళ్లనూ కలిసొచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యుద్ధమేనని ఆర్భాటంగా ప్రకటించారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో సంధి కుదుర్చుకొని వచ్చారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల ఊసు ఎత్తడం లేదు. ఇలాంటి చర్యలు, ప్రకటనల వల్ల ప్రజల దృష్టిలో కేసీఆర్‌ పలుచన అయ్యారు. ఆయన మాటలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. మధ్యలో కొంతకాలం పాటు హరీశ్‌రావును దూరం పెట్టారు. ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌ తర్వాత మళ్లీ హరీశ్‌ రావును పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. హుజూరాబాద్‌ గండం గట్టెక్కించే బాధ్యతను కూడా హరీశ్‌కే అప్పగించారు. ఇప్పుడు కేటీఆర్‌ పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. ఆయన కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం జరగడానికి కారణమైన కేసీఆర్‌, ఇప్పుడు ఆ ఊసే ఎత్తనివ్వడం లేదు. రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండున్నరేళ్లలో కేసీఆర్‌ ఎన్నో పర్యాయాలు నాలుక మడతేశారు. ఫలితంగా ఆయన ప్రతిష్ఠ పాతాళానికి దిగజారింది. ఈ కారణంగానే ఇప్పుడు దళితబంధు అని ఎంత హడావుడి చేస్తున్నప్పటికీ మైలేజీ రావడం లేదు. నాయకుడి విశ్వసనీయత దెబ్బతిన్నప్పుడు ఇలాగే ఉంటుంది. అవసరార్థం అడ్డం పొడుగు హామీలు ఇవ్వడం కేసీఆర్‌కు అలవాటే కదా? అని ప్రజలు పెదవి విరుస్తున్నారు. రాజకీయాల్లో నాయకులు పడి లేవడం సహజ పరిణామం. కేసీఆర్‌ ప్రతిష్ఠ ప్రస్తుతానికి అథోముఖంగా ఉంది. కోల్పోయిన విశ్వసనీయతను తిరిగి సాధించుకోకుండా హరీశ్‌రావునో మరొకరినో చేరదీసి బాధ్యతలు అప్పగించినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పటికీ బలమైన ప్రతిపక్షం లేకపోయినా కేసీఆర్‌ పలుకుబడి తగ్గడం టీఆర్‌ఎస్‌ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెడ్డి సామాజికవర్గంలో కదలిక వస్తోంది. ఆ వర్గమంతా ఆయన వెనుక సంఘటితమవుతున్నది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి కొద్దో గొప్పో మిగిలి ఉన్న ఓటర్లు కూడా రేవంత్‌ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పార్టీకి, బహుజన్‌ సమాజ్‌ పార్టీకీ మధ్య పొత్తు కుదరవచ్చు. బహుజన వర్గాల్లో మంచి పేరున్న మాజీ ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ ఇటీవల బీఎస్పీలో చేరడంతో తెలంగాణలో ఆ పార్టీకి ప్రాధాన్యం పెరిగింది. జాతీయ రాజకీయ సమీకరణల్లో భాగంగా కాంగ్రెస్‌, బీఎస్పీలు జట్టు కడితే ఆ మేరకు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి అదనపు ఎడ్వాంటేజ్‌ దక్కినట్టే. ఇక షర్మిల ప్రారంభించిన వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఏ వైఖరి తీసుకుంటుందో తెలియదు. మరోవైపు మజ్లిస్‌ పార్టీ క్రమంగా కేసీఆర్‌కు దూరమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. మజ్లిస్‌ పార్టీ కూడా కాంగ్రెస్‌తో జట్టు కడితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు గడ్డు పరిస్థితి తప్పదు. కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అన్నట్టుగా కేసీఆర్‌ పట్ల తెలంగాణ సమాజంలో వ్యామోహం తగ్గడానికి ఎన్నో కారణాలు. ఈ పరిస్థితుల్లో గతంలో ప్రచారం జరిగినట్టుగా కేసీఆర్‌ బదులు ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అయితే ప్రజాభిప్రాయంలో మార్పు రావచ్చు. కేటీఆర్‌ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని తెలంగాణకు చెందిన ముఖ్యుడొకరు అభిప్రాయపడ్డారు. తెలంగాణ జాతిపిత అని పిలిపించుకున్న కేసీఆర్‌ ప్రభ ఏడేళ్లకే మసకబారడం స్వయంకృతాపరాధమే!


జగన్‌ ఒంటరి!

ఈ విషయం అలా ఉంచితే, రెండేళ్ల క్రితం హత్యకు గురైన వైఎస్‌ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత తన కుటుంబానికి ప్రాణహాని ఉందని కడప జిల్లా ఎస్పీకి అర్జీ పెట్టుకోవడం సంచలనమైంది. వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సూత్రధారుల నుంచే తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. వరుసకు సోదరుడైన జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ డాక్టర్‌ సునీత ఆయనను ఆశ్రయించకుండా నేరుగా ఎస్పీకి లేఖ రాయడం గమనార్హం. తన తండ్రిని హత్య చేసిన వారిని శిక్షించాలని డాక్టర్‌ సునీత రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారు. తన ఈ పోరాటంలో వైఎస్‌ కుటుంబీకులతో పాటు వైఎస్‌ షర్మిల కూడా తనకు అండగా ఉన్నారని ఆమె చెప్పారు. భద్రత కోసం సోదరుడిని ఆశ్రయించలేదంటేనే డాక్టర్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో జగన్మోహన్‌రెడ్డి ఒంటరివాడు అయ్యారని స్పష్టమవుతోంది. వివేకా హంతకులకు డాక్టర్‌ సునీత కంట్లో నలుసులా ఉంటున్నారు. రాయలసీమలో, ముఖ్యంగా పులివెందుల నేపథ్యం తెలిసిన వారందరూ డాక్టర్‌ సునీత ప్రాణాలకు ముప్పు ఉందని అంగీకరిస్తారు. డాక్టర్‌ సునీత తనను కలసి భద్రత కోరకపోయినప్పటికీ ఆమెకు రక్షణ కల్పించవలసిన బాధ్యత జగన్‌ రెడ్డి పైనే ఉంటుంది. డాక్టర్‌ సునీతకు ఎటువంటి హాని జరిగినా జగన్‌ రెడ్డి మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. డాక్టర్‌ సునీత తాజా అర్జీ తర్వాత వివేకానంద రెడ్డి హంతకులకు ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి అండదండలు పరోక్షంగానైనా ఉండివుంటాయని అనుమానం సహజంగానే కలుగుతుంది. జగన్‌ రెడ్డికి ఏ పాపం తెలియని పక్షంలో డాక్టర్‌ సునీత తన భద్రత కోసం ఆయననే ఆశ్రయించి ఉండేవారని చిన్నపిల్లవాడైనా చెబుతాడు. రాజశేఖర రెడ్డి కుటుంబం ఇలా చీలిపోవడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత సోదరి షర్మిల, సొంత బాబాయి కుమార్తె డాక్టర్‌ సునీత కంటే జగన్మోహన్‌ రెడ్డికి ఇంకెవరో ముఖ్యమయ్యారన్న మాట! వారెవరో తేలితే తప్ప వివేకానంద రెడ్డి హత్య కేసు మిస్టరీ వీడదు!!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-08-15T06:16:01+05:30 IST